గ్రేటర్ పోలింగ్‎కు సర్వం సిద్ధం

by  |
గ్రేటర్ పోలింగ్‎కు సర్వం సిద్ధం
X

దిశ, వెబ్‎డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం మొత్తం 9,101 కేంద్రాలు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ విధుల్లో 45 వేల మంది ఎన్నికల సిబ్బంది పాల్గొననున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బ్యాలెట్ పద్ధతిలోనే పోలింగ్ నిర్వహించనున్నారు. బయటి వ్యక్తులు జీహెచ్ఎంసీ పరిధి దాటి వెళ్లాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

కొవిడ్-19 పాజిటివ్ ఉండి పోస్టల్ బ్యాలెట్ పొందలేని ఓటర్లకు ప్రత్యేక లైన్ ద్వారా ఓటువేసే అవకాశం కల్పించారు. ప్ర‌తి పోలింగ్ స్టేష‌న్‌లో వృద్దులు, విక‌లాంగుల‌కు ప్ర‌త్యేక క్యూలైన్ల ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు, శాంతి భద్రతల పరిరక్షణకు 52,500 పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. కొవిడ్-19 నిబంధనలను అనుసరించి ప్రతి పోలింగ్ కేంద్రాన్ని ముందు రోజు శానిటైజేషన్ పూర్తి చేయనున్నారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సి ఉంటుంది.

కాగా, జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 150 వార్డులకు గాను 1,122 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 74,67,256 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. డిసెంబర్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.


Next Story

Most Viewed