గ్రేటర్​పై భారీ నిఘా..!

by  |
గ్రేటర్​పై భారీ నిఘా..!
X

దిశ, క్రైమ్ బ్యూరో : గ్రేటర్ ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా మూడు కమిషనరేట్ల పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. రౌడీలతో పాటు గతంలో పలు క్రిమినల్ కేసులు నమోదై ఉన్న వారిని ఇప్పటికే బైండోవర్ చేశారు. ఎన్నికల సామగ్రి పంపిణీ, కౌంటింగ్ కేంద్రాలు ఇదివరకే పోలీస్ నిఘాలో కొనసాగుతుండగా, ప్రస్తుతం పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. ఓటర్లు ప్రశాంతంగా ఓటు వేసే వాతావరణాన్ని కల్పించడానికి ఆయా ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ ను నిర్వహిస్తున్నారు.

జీపీఎస్‌తో నిఘా ఏర్పాట్లు..

ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు నగరంలోని మూడు కమిషనరేట్ పరిధిలో దాదాపు 30 వేల పోలీసు సిబ్బంది, ఇతర బలగాలను వినియోగించనున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సుమారు 15 వేలు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 13,500, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 10 వేల మంది భద్రతా చర్యలు చేపట్టనున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా మొత్తం 9101 పోలింగ్ కేంద్రాల్లో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2789, సైబరాబాద్‌లో 770, రాచకొండలో 565 సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. 24 గంటల నిఘా ఉండేలా పెట్రోలింగ్ వాహనాలకు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్), పోలింగ్ కేంద్రాలకు జియో ట్యాగింగ్ సదుపాయాలను సమకూర్చనున్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో మౌంటెడ్ కెమెరా వాహనాలను తిప్పనున్నారు. పోలీస్ స్టేషన్ల నుంచే పోలింగ్ కేంద్రాల పరిస్థితులను తెలుసుకోవడానికి సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు.

సోషల్ మీడియాలో ఫిర్యాదుల స్వీకరణ…

పార్టీలకు సోషల్ మీడియా ప్రధాన ప్రచార వేదికగా మారనుంది. క్షేత్ర స్థాయి నుంచి పరిస్థితులను తెలుసుకోవడానికి పోలీసులు సోషల్ మీడియాను కూడా ఆయుధంగా వినియోగించాలని భావించారు. ఈ క్రమంలో ఫేస్ బుక్, ట్విట్టర్, హాక్ ఐ, వాట్సాప్ వేదికలతో పాటు 100 డయల్ ద్వారా వచ్చే ఫిర్యాదులను స్వీకరించాలని భావిస్తున్నారు. పోలింగ్ సందర్భంగా మహిళలను వేధించడం, ఇబ్బందులకు గురి చేసే ఆకతాయిలను గుర్తించేందుకు షీ టీం లు విధుల్లో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే ఫిర్యాదులను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు.

హైదరాబాద్ సిటీ పోలీస్ వాట్సాప్​ నెంబరు – 94906 16555
సైబరాబాద్ పోలీస్ వాట్సాప్ నెంబరు – 9490617444
రాచకొండ పోలీస్ వాట్సాప్ నెంబరు – 9490617111


Next Story

Most Viewed