కేంద్ర బడ్జెట్: ప్రాజెక్టులకు పైసలియ్యలే..!

by  |
కేంద్ర బడ్జెట్: ప్రాజెక్టులకు పైసలియ్యలే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: మళ్లీ పాత కథే పునరావృతమైంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రస్తావనే లేకుండా పోయింది. కష్టకాలంలో ఉన్నాం.. ఆదుకోండి అని మొర పెట్టుకున్నా కేంద్రం.. తెలంగాణ ప్రాజెక్టులకు రూపాయి ఇవ్వలేదు. ఈసారి కూడా కేంద్ర బడ్జెట్‌లో జల్‌శక్తి మంత్రిత్వ శాఖలో గంగా ప్రక్షాళన, జల్‌జీవన్‌ మిషన్‌కు మాత్రమే కేటాయింపులు చేసింది. గంగా ప్రక్షాళనకు రూ.9,022 కోట్లు, ప్రతి ఇంటికీ తాగునీటిని అందించే జల్ జీవన్ మిషన్‌కు రూ.60,030 కోట్లు కేటాయించింది. అంతకు మించి ప్రాజెక్టులకు రూపాయి ఇవ్వలేదు.

రాష్ట్రంలో సాగు, తాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం ఈసారి నిధులు ఇస్తుందని రాష్ట్రం ఆశించింది. ఇప్పటికే లేఖలు రాసింది. ఆర్థిక పరిస్థితులను వివరించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను కోరింది. దీంతోనైనా నిధులు వస్తాయని ఆశ పడింది. వేల కోట్ల అప్పులు తెచ్చి ప్రాజెక్టుల పనులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈసారి కేంద్రం కొంతైనా సాయం చేస్తుందనే ఉద్దేశంతో ఉంది. కానీ కేంద్రం మళ్లీ ఉత్తిచేయి చూపించింది. మరోవైపు ఈ ఏడాది లక్ష్యంగా డిండి, సీతారామ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులను పూర్తి చేయాలని పెట్టుకుంది.

ఇప్పటికే ఈ ప్రాజెక్టుల పనుల కోసం వేల కోట్లు అప్పులు తెచ్చింది. అటు కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనుల్లో కూడా అంతే. దీంతో నిధులు లేక ప్రాజెక్టుల పనులు సైతం నెమ్మదించాయి. కరోనా మిగిల్చిన ఆర్థిక పరిస్థితుల్లో కేంద్రం సాయం చేస్తుందని భావించింది. ప్రాజెక్టుల నిర్మాణాలకు రూపాయి కూడా విదల్చలేదు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. కృష్ణా, గోదావరి బోర్డుల నిర్వహణతో పాటు డ్యామ్‌ల సేఫ్టీకి గతంలో మాదిరిగానే నిధులు రానున్నాయి. వీటన్నింటికీ కలుపుకుని దాదాపు రూ.10 కోట్ల వరకు రానున్నాయి. అంతకు మించి ఒక్క రూపాయి కూడా అదనంగా వచ్చే అవకాశాల్లేవ్.​

మిషన్ భగీరథ ఎలా..?

మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు దాదాపు రూ.24 వేల కోట్లు సాయం చేయాలని నీతి ఆయోగ్ సూచించింది. ఈ నేపథ్యంలో వీటికైనా నిధులు ఉంటాయని ఆశించారు. కానీ ఎక్కడా ఆ ప్రస్తావనే లేదు. అయితే ఇప్పుడు మిషన్​భగీరథను జల్‌జీవన్ మిషన్‌లో అనుసంధానం చేస్తారా అనేది కూడా చర్చగా మారుతోంది. ఎందుకంటే కేంద్ర బడ్జెట్ ప్రకారం 2024 వరకు ప్రతి ఇంటికీ మంచినీరు నినాదంతో జల్ జీవన్ మిషన్‌కు ఈసారి రూ.60 వేల కోట్లు కేటాయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో మిషన్ భగీరథ నిర్వహణ భారంగా మారుతోంది. ఒకదశలో మీటర్లు బిగించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పుడు కేంద్రం నుంచి రూపాయి వచ్చే దాఖలాలు లేకపోవడంతో.. జల్ జీవన్ మిషన్‌తో అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed