ఆ నాలుగు రాష్ట్రాల బార్డర్‌లు బంద్

by  |
ఆ నాలుగు రాష్ట్రాల బార్డర్‌లు బంద్
X

ముంబయి : కరోనా మహమ్మారి విస్తరించకుండా పలు రాష్ట్రాలు సరిహద్దులను మూసేసుకుంటున్నాయి. ప్రధాని కర్ఫ్యూ పిలుపుతో ఆదివారం మొత్తం భారత్ లాక్‌డౌన్‌ను పాటిస్తున్నది. అటుతర్వాత ఈ లాక్‌డౌన్ అలాగే కొనసాగే అవకాశమున్నదనీ విశ్లేషణలు వస్తున్నాయి. వీటికి బలం చేకూర్చేలా.. నాలుగు రాష్ట్రాలు మహారాష్ట్ర, గోవా, బీహార్, పశ్చిమ బెంగాల్‌లు పొరుగురాష్ట్రాలతో బార్డర్‌లను బంద్ చేసుకున్నాయి.

మహారాష్ట్రలో ఎంఎస్ఆర్‌టీసీ బస్సులు, వేరే రాష్ట్రాల బస్సులు, ప్రైవేటు టూరిస్టు బస్సులను సరిహద్దు వెలుపలకు, బయటి నుంచి లోపలకు రానివ్వకుండా ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి రాకపోకలపై శనివారం అర్థరాత్రి నుంచే గోవా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కేవలం గోవా వాసులను మాత్రమే రాష్ట్రంలోకి ఆహ్వానిస్తున్నది. ఇప్పటికి ఒక్క కేసు కూడా ఈ రాష్ట్రంలో నమోదు కాలేదు. కానీ, ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అలాగే, పర్యాటకులు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తమ టూర్లను వాయిదా వేసుకోవాలని కోరింది. బీహార్ కూడా మార్చి 31 వరకు పొరుగురాష్ట్రాలకు రాకపోకలపై నిషేధాన్ని ప్రకటించింది.

ఇక రాజస్తాన్, ఒడిషాలైతే మొత్తంగా లాక్‌డౌన్‌కే ఆదేశాలిచ్చాయి. ఈ నెల 31 వరకు రాష్ట్రం మొత్తం బంద్ పాటించాలని రాజస్తాన్ ప్రభుత్వం ఆదేశించింది. కాగా, ఈ నెల 29 వరకు ఐదు జిల్లాలు(రాష్ట్రంలోని 40 శాతం భూభాగం) లాక్‌డౌన్ పాటించాలని ఒడిషా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Tags: borders, sealed, coronavirus, spread, contain, states

Next Story

Most Viewed