బుక్కెడు బువ్వకు పడిగాపులు

by  |
బుక్కెడు బువ్వకు పడిగాపులు
X

దిశ, మేడ్చల్ : మేడ్చల్ జిల్లా..ఇది వలసొచ్చే కార్మికుల పాలిట కల్పతరువు. ఎందుకంటే.. ఇక్కడ పరిశ్రమలు, ఇటుక బట్టీలు, భవన నిర్మాణ రంగానికి కొదవ లేదు. దీంతో ఇక్కడ దొరకని పని అంటూ ఉండదు. తీసుకునే కూలీలో కాంప్రమైజ్ అయితే చాలు.. ఇక్కడ చేసేందుకు మస్తు పని. అందుకే మేడ్చల్ జిల్లాకు ఒక్క తెలంగాణ రాష్ట్రంతో పాటే కాకుండా ఇతర రాష్ట్రాలైన కర్ణాటక, బీహార్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి వలస కార్మికులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. దాదాపు మేడ్చల్ జిల్లా పరిధిలో 50వేల మంది వలస కార్మికులు ఉంటారంటే అతిశయోక్తి కాదు. ఉన్న ఊరు.. కన్నవారిని వదిలి వలస కార్మికులు ఏడాదంతా ఇక్కడే పనిచేస్తుంటారు. అయితే, వారంతా బుక్కెడు బువ్వ కోసం పడిగాపులు కాస్తున్న దీనస్థితి నెలకొంది. కరోనా మహమ్మారి (కోవిడ్ 19) కట్టడికి విధించిన లాక్ డౌన్ వాళ్ల జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. తినేందుకు తిండి లేక, ఉపాధిలేక ఇప్పుడు వారు దాతలందించే భోజనం కోసం వేచి చూస్తున్నారు. మాములు రోజుల్లోనే రోజంతా పనిచేస్తే ఒక్కో వ్యక్తికి రూ.200కు మించి కూలీ ఇవ్వరు. అయినా దొరికిన దాంతో తృప్తి పడుతుండేవారు. కరోనా రక్కసి.. వారి జీవితాల్లో పెద్ద కుదుపు కుదిపింది. స్వస్థలాలకు వెళ్లలేక.. ఇక్కడ ఉండలేక వలస కూలీలు ఆగమాగం అవుతున్నారు.

దాతలే దిక్కు..

జిల్లా పరిధిలో వలస కార్మికులు కేవలం 14,411 మంది ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వారికి అన్ని వసతులు ఏర్పాటు చేశాం. మూడు పూటలా భోజనం, బస వైద్య పరీక్షలంటూ సీఎం కేసీఆర్ ఓ వైపు ఢంకా బజాయిస్తున్నారు. కాని క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా దారుణంగా ఉన్నాయి. ఒక్క ముద్ద బువ్వ కోసం వలస కార్మికులు రోజంతా రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నారు. ఎవరైనా దాతలు రాకపోతారా.. ఒక్క భోజనం ప్యాకెట్ దొరికినా కుటుంబమంతా తలో ముద్ద తిందామన్న దీన స్థితిలో ఉన్నారు. తెల్లారింది మొదలు.. రోడ్లపైనే ఎదురుచూస్తున్నారు.

దాతల చుట్టూ ముడుతున్న కార్మికులు…

వాస్తవానికి ప్రభుత్వంతో సంబంధం లేకుండా అనేక మంది దాతలు స్వచ్ఛందంగా కార్మికులకు భోజనం, బియ్యం వంటి వాటిని పంపిణీ చేస్తున్నారు. కార్మికులు ఎక్కువగా ఉండటం.. సరుకులు తక్కువ ఉండే నేపథ్యంలో అందరికీ అందడం లేదు. దీంతో కార్మికులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.నిత్యం జిల్లా పరిధిలో అక్కడక్కడ కొంతమంది దాతలు భోజనం ఏర్పాటు చేస్తున్నారు. భోజనం పెట్టే సమయంలో వలస కార్మికులు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. భోజనం ప్యాకెట్.. నా దాకా వస్తుందా.. రాదా.. అనే టెన్షన్‌తో కార్మికులు రోజులను వెళ్లదీస్తున్నారు.

ప్రభుత్వం ఏం చేస్తుందో మరీ..

వలస కార్మికులు ఇంతగ రందీ పెట్టుకుంటుంటే.. ప్రభుత్వం ఏంజేస్తుందో అర్థం కాట్లేదు. ఓ వైపు సీఎం కేసీఆర్.. వలసొచ్చిన కార్మికులను మా సొంత బిడ్డల్లెక్క చూసుకుంటం. వారికే లోటు రానీయం. వలస కార్మికులకు అన్ని ఏర్పాట్లు జేయాల్నే అంటూ హుకుం జారీ చేసిండు. అంతవరకు బాగానే ఉంది. కానీ అంతకుమించి ఒక్క అడుగు ముందుకు పడలేదు. వలస కార్మికుల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. స్వస్థలాలకు వెళ్లే వారిని వెనక్కి తీసుకొచ్చి పునరావాస కేంద్రాల్లోకి చేర్చారు. కేంద్రాల్లోకి తీసుకొచ్చిన మొదటిరోజు మూడు పూటలా బువ్వ పెట్టిర్రు. తర్వాత ముందు మురిపెం ఒక్కరోజే అన్నచందంగా వలస కార్మికులను గాలికొదిలేసిర్రు. అధికారులెవరూ పునరావాస కేంద్రాల వైపు చూసేందుకు ఆసక్తి చూపట్లేదు. ఎవరో ఒకరిద్దరూ దాతలు అందజేసే వాటితోనే కార్మికులకు కాసింత భోజనం పెడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. వలస కార్మికుల గోడును పట్టించుకోవాలి.

Tags: no food, migrant workers, medchal dist, covid 19 effect

Next Story

Most Viewed