తెలంగాణలో వరదలు.. నష్టం వెయ్యి కోట్లు

by  |
తెలంగాణలో వరదలు.. నష్టం వెయ్యి కోట్లు
X

దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణలో గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో పలు జిల్లాల్లో పంటలు నీట మునిగాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. కొన్ని చెరువుకట్టలు తెగిపోయాయి. పలు కాలువలు దెబ్బతిన్నాయి. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందర్, పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఆయా విభాగాల ఉన్నతాధికారులు ఇటీవల క్షేత్రస్థాయి పర్యటన చేశారు. వీరి ఆదేశాల మేరకు వివిధ శాఖల అధికారులు పలు జిల్లాల్లో జరిగిన నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేశారు.

4 లక్షల ఎకరాల్లో..

వరంగల్ అర్బన్, రూరల్, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, కరీంనగర్ తదితర జిల్లాల్లో సుమారు వెయ్యి కోట్ల రూపాయల మేర నష్టం జరిగినట్లు ఆయా శాఖల అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో ఒక్క వ్యవసాయ శాఖ తరఫునే రూ.500 కోట్లకంటే ఎక్కువ నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వానికి ప్రాథమిక స్థాయి నివేదిక సమర్పించినట్లు తెలిసింది.

నాట్లు వేసిన తొలి దశలో ఉన్న వరిపంట, విత్తన పత్తి తదితర పంటలు పూర్తిగా నష్టపోయినట్లు పేర్కొన్నారు. సుమారు నాలుగు లక్షల ఎకరాల్లో వరి, పత్తి, కంది తదితర పంటలు నష్టపోయినట్లు పేర్కొన్నారు. ఒకటిన్నర లక్షల ఎకరాల్లో వరి, 1.30 లక్షల ఎకరాల్లో పత్తి, సుమారు 20 వేల ఎకరాల్లో కంది, ఇతర పంటలు దాదాపు 50 వేల ఎకరాల్లో నీట మునిగినట్లు పేర్కొన్నారు.

దెబ్బతిన్న రోడ్లు..

ఇక రోడ్లు భవనాల శాఖకు చెందిన అనేక రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, వర్షాలు తగ్గిన తర్వాత కొత్త రోడ్లు వేయడం మినహా ఇవి పనికిరావని, నివేదికలో ఆ శాఖ అధికారులు పేర్కొన్నట్లు తెలిసింది. వరంగల్ సిటీలోని దాదాపు అన్ని రోడ్లూ నీట మునిగినందున మళ్లీ కొత్తగా రోడ్లు వేయాల్సి ఉంటుందని స్థానిక అధికరులు తెలిపారు.

అయితే, ఇప్పుడు నిల్చిపోయి ఉన్న నీరు తగ్గిపోయిన తర్వాత ఆ రోడ్డు పరిస్థితిని అంచనా వేసి మళ్లీ నివేదిక రూపంలో సర్కారుకు తెలియజేయనున్నారు. పంచాయతీరాజ్ శాఖకు చెందిన గ్రామీణ రోడ్లు కూడా ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ లాంటి జిల్లాల్లో దాదాపుగా పూర్తి స్థాయిలో పాడైపోయినట్లేనని అధికారులు భావిస్తున్నారు. వర్షం, వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత నిర్దిష్టంగా ఏ మేరకు నష్టం వాటిల్లింది, వాటి విలువ ఎంత ఉంటుందనే అంచనాల్లో స్పష్టత వస్తుంది.

Next Story

Most Viewed