పోలింగ్ క్లోజ్.. వెయిటింగ్ మోడ్ ఆన్

by  |
పోలింగ్ క్లోజ్.. వెయిటింగ్ మోడ్ ఆన్
X

దేశ రాజకీయ యవనికపై సుమారు రెండు నెలలుగా సాగుతున్న మినీ ఎన్నికల సంగ్రామం ఎట్టకేలకు ముగిసింది. పశ్చిమబెంగాల్ మినహా తమిళనాడు, కేరళ, అసోంతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గత రెండు విడతల మాదిరిగానే బెంగాల్‌లో మళ్లీ ఉద్రిక్తతల నడుమే పోలింగ్ జరిగింది. పలు ఘటనలు చోటు చేసుకున్నా అక్కడ ఓటింగ్ మాత్రం భారీగానే నమోదైంది. ఇక తమిళనాడు, కేరళలో కూడా 70 శాతానికి పైగా పోలింగ్ నమోదుకాగా.. అసోం, పుదుచ్చేరిలో ఓటింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. దీంతో ఆ రెండు రాష్ట్రాలలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది.

న్యూఢిల్లీ : దేశంలోని నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో మంగళవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. బెంగాల్ మినహా మిగిలిన చోట్ల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సుమారు 20 కోట్ల మంది ప్రజలు.. 475 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొవిడ్ వ్యాప్తి ఉన్నా ఓటేసేందుకు ఓటర్లు ఉత్సాహం చూపించారు. దాదాపు అన్ని చోట్ల మెరుగైన ఓటింగే నమోదైంది. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) మంగళవారం సాయంత్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉద్రిక్తతలు కొనసాగినా బెంగాల్‌లో 77.68 శాతం పోలింగ్ నమోదుకాగా.. తమిళనాడులో 71.79 శాతం, కేరళలో 69.95 శాతం, పుదుచ్చేరిలో 81.88 శాతం, ఈశాన్య రాష్ట్రం అసోంలో ఏకంగా 82.33 శాతం పోలింగ్ రికార్డు కావడం గమనార్హం. కాగా.. బెంగాల్ (మరో 5 విడతలు) మినహా మిగిలిన చోట ఎన్నికలు ముగిశాయి. వీటి ఫలితాలు మే 2న వెలువడనున్నాయి.
బెంగాల్ ‌లో అదే సీన్ : తొలి రెండు దశల మాదిరిగానే బెంగాల్‌లో మూడో దఫా ఎన్నికలు కూడా ఘర్షణ వాతావరణంలోనే జరిగాయి. ఇద్దరు టీఎంసీ అభ్యర్థులపై దాడులు జరిగాయి. ఆరంబాగ్ నియోజకవర్గంలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తలు ఒకరిమీద ఒకరు దాడులకు దిగారు. ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్న టీఎంసీ అభ్యర్థి సుజాత మొండల్‌పై బీజేపీ మద్దతుదారులు దాడికి దిగారని ఆమె ఆరోపించింది. సుజాత మండల్‌పై కొంతమంది కర్రలు, ఇటుకలతో దాడికి దిగారని ఆ పార్టీ ట్విట్టర్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో పలువురు దుండగులు సుజాతను పోలింగ్ బూత్ నుంచి కొంతదూరం వరకు వెంటబడి తరిమారు. భయాందోళనకు గురైన అక్కడ్నుంచి పరిగెత్తుతూ వెళ్లారు. ఈ దాడిలో ఆమె సెక్యూరిటీ కూడా గాయపడ్డారు. కాగా, ఖానకుల్ స్థానం నుంచి పోటీ చేస్తు్న్న టీఎంసీ అభ్యర్థి నజీబుల్ ఖాన్‌పైనా దాడి జరిగింది. ఇదే క్రమంలో ఉల్బేరియా సౌత్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి పపియా అధికారిపై టీఎంసీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. బెంగాల్ లో 4 వ విడత ఎన్నికలు ఈనెల 10 న జరగనున్నాయి.

ఈశాన్య రాష్ట్రాన పోటెత్తిన ఓటర్లు..

ఈశాన్య రాష్ట్రం అసోంలో చివరిదైన మూడో దశలోనూ ఓటర్లు పోటెత్తారు. 40 శాసనసభ స్థానాలకు జరిగిన ఈ ఎన్నికలలో 82.33 శాతం పోలింగ్ నమోదైంది. తొలి రెండు దశల్లో అక్కడ వరుసగా 79.97 శాతం, 80.96 శాతం ఓటింగ్ నమోదైన విషయం తెలిసిందే.

తమిళనాడులో..

ఒకేదశలో 234 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 8 గంటల దాకా (కొవిడ్ పేషెంట్ల కోసం ప్రత్యేకంగా) అక్కడ పోలింగ్ జరిగింది. రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు సాధారణ ప్రజలు కూడా ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొన్నారు. డీఎంకే అధినేత స్టాలిన్ సోదరి కనిమొళికి కరోనా సోకడంతో ఆమె సాయంత్రం పీపీఈ కిట్ ధరించి వచ్చి ఓటేశారు. స్టాలిన్, పళినిస్వామి, పన్నీర్ సెల్వం, రజినీకాంత్, కమలహాసన్ తో పాటు సినీ ప్రముఖులంతా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

కేరళలో..

140 అసెంబ్లీ స్థానాలకు గాను ఒకే విడతలో జరిగిన ఎన్నికలు పలుచోట్ల అవాంఛనీయ ఘటనలు మినహా ప్రశాంతంగానే ముగిశాయని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. కన్నూరు జిల్లాలోని పయ్యన్నూర్‌లో అధికార సీపీఐ(ఎం) కార్యకర్తలు ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న అధికారి మీద దాడులకు పాల్పడ్డారని ఆయన పిర్యాదు చేశారు.

పుదుచ్చేరిలో..

30 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 81.88 శాతం పోలింగ్ నమోదైనట్టు ఈసీ తెలిపింది. ఓటింగ్ ప్రారంభమైనప్పట్నుంచే పోలింగ్ బూత్ ల వద్ద క్యూలలో నిల్చున్న ప్రజలు.. ఉత్సాహంగా ఓటేశారు.

Next Story

Most Viewed