గాలి బుడగలా వారి బతుకులు

by  |
గాలి బుడగలా వారి బతుకులు
X

దిశ, తెలంగాణ బ్యూరో : పంచర్ షాపునే నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు… అది నడిస్తేనే కుటుంబ పోషణ. కరోనాకు ముందు ఉదయం నుంచి రాత్రి వరకు రూ.800 ల వరకు సంపాదించేవారు. అయితే కొవిడ్ నియంత్రణకు ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి బతుకు పంచర్ అవుతోంది.

ప్రభుత్వ కొలువుల కోసం, సహకారం కోసం ఎదురు చూడకుండా స్వశక్తితో రాణించేందుకు పంచర్ దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు నిరుద్యోగులు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్షకు పైగా పంచర్ దుకాణాలను ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. కరోనాకు ముందు ప్రతి రోజు రూ.800ల వరకు సంపాదించేవారు. ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు షాపును నడిపేవారు. అయితే కరోనా ఫస్ట్ వేవ్ తో ఉపాధిలేక ఇబ్బందులు పడ్డారు. తిరిగి గాడిన పడుతున్న తరుణంలో సెకండ్ వేవ్ ఉధృతం కావడంతో ప్రభుత్వం మళ్లీ లాక్ డౌన్ విధించింది. ఈ లాక్ డౌన్ లో కొంత వెసులుబాటు కల్పించినా ఒకటి, రెండు వాహనాలకు పంచర్ చేస్తుండగానే సమయం అయిపోతుందని దీంతో మూసి వేస్తున్నామని పలువురు పంచర్ షాపు నిర్వాహకాలు తెలిపారు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని వాపోతున్నారు.

పంచర్ షాపు నిర్వహకులు ద్విచక్ర వాహనం పంచర్ అతికితే రూ.60, టైరు మార్చితే రూ.100, కారుకు అయితే రూ.100 నుంచి రూ.150 వరకు తీసుకుంటున్నారు. ద్విచక్ర వాహనానికి గాలి పెడితే రూ.5 నుంచి 10, కారుకు రూ.20 వరకు తీసుకుంటున్నట్లు పంచర్ షాపు నిర్వహకులు తెలిపారు. అయితే లాక్ డౌన్ కారణంగా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు వెసులుబాటు కల్పించినా రోజుకు ఒకటి రెండు వాహనాలు మాత్రమే రావడంతో రూ.200 సంపాధించడం గగణమైందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. లాక్ డౌన్ సమయంలో రేషన్ ద్వారా నిత్యవసర సరుకులతో పాటు రూ.5వేల నగదు అందజేసి ఆదుకోవాలని, అదే విధంగా వెట్టివెండర్ కార్మికులుగా గుర్తించి ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.

రూ.200 లు కూడా వస్తలేవు..

కరోనా వచ్చిన తర్వాత పని దొరక్త లేదు. లాక్ డౌన్ తో నాలుగు గంటలు వెసులుబాటు కల్పించినా ఒకటి రెండు వాహనాలకు మాత్రమే పంచర్ చేస్తున్నం. ఇది వరకు ఉదయం నుంచి రాత్రి వరకు షాపు తెరిచి ఉంటే పని దొరికేది. కానీ ఇప్పడు రోజుకు రూ.200 కూడా సంపాదిస్తలేం.
-సంతోష్, పంచర్ షాపు నిర్వహకుడు, శ్రీనగర్ కాలనీ

మమ్ముల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి

బతుకు దెరువు కోసం పంచర్ షాపు పెట్టా. గతేడాది కరోనాకు ముందు రోజు రూ.800 వరకు సంపాదించే వాడిని. కరోనా వచ్చిన తర్వాత పనిలేదు. ఇంకా ఈ లాక్ డౌన్ తో షాపు కరెంటు బిల్లులు, ఇంటి అద్దెలు, కుటుంబానికి పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం రేషన్ సరుకులతో పాటు రూ.5వేల నగదు ఇచ్చి ఆదుకోవాలి.
-రమేష్, పంచర్ షాపు నిర్వహకుడు, ఆనంద్ నగర్


Next Story

Most Viewed