పారిశ్రామిక మహిళలకు ఆర్థిక చేయూత కీలకం: ఎమ్మెల్సీ కవిత

by  |
పారిశ్రామిక మహిళలకు ఆర్థిక చేయూత కీలకం: ఎమ్మెల్సీ కవిత
X

దిశ, శేరిలింగంపల్లి: మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు ఆర్థికంగా చేయూత అందించడం ఎంతో అవసరమన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మంగళవారం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన తెలంగాణ ఛాంబర్‌ ఆఫ్‌ ఈవెంట్స్‌ ఇండస్ట్రీ (టీసీఈఐ) నాలుగవ స్త్రీ శక్తి అవార్డుల కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ వినోభా దేవికి స్త్రీ రత్న అవార్డు, మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పుష్పలతా దేవికి స్త్రీ మూర్తి అవార్డు, ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనూషకు స్త్రీ శక్తి అవార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ఒక మహిళకు అవార్డు అందిస్తే, ఆ మహిళను ఆదర్శంగా తీసుకునే పిల్లలకు, కుటుంబానికి కూడా అవార్డు ఇచ్చి ప్రోత్సహించినట్లు అవుతుందన్నారు. వాడవాడలా బతుకమ్మ జరుపుతూ, స్త్రీని దేవతగా పూజించే పవిత్రమైన నవరాత్రి సమయంలో స్త్రీ శక్తి అవార్డు ఇవ్వడం సంతోషకరంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు ఆరుకోట్ల మంది పారిశ్రామికవేత్తలు సూక్ష్మ, మ‌ధ్యత‌ర‌గ‌తి ప‌రిశ్రమ‌లు నిర్వహిస్తున్నారన్న ఆమె ఇందులో కేవలం 15 శాతం మాత్రమే మహిళల భాగస్వామ్యంలో నడుస్తున్నాయన్నారు.

ఈ 15 శాతంలో 80 శాతం మహిళలు సొంతంగా వ్యాపారాలను నిర్వహిస్తుండగా, మిగిలిన 20 శాతం మంది ప్రైవేటు, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో పరిశ్రమలు నిర్వహిస్తున్నారని వివరించారు. పారిశ్రామిక రంగంలో అడుగుపెట్టిన మహిళలు, ఔత్సాహిక మహిళలకు వీలైనంత సాయపడాలని సూచించారు. పారిశ్రామిక రంగంలోకి ప్రవేశించాలనుకునే మహిళలకు, యువతకు అన్ని రకాలుగా సలహాలు అందించేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని మహిళా పారిశ్రామిక వేత్తలను ఎమ్మెల్సీ కవిత కోరారు.

అంతర్జాతీయ గైనకాలజిస్టుల అసోసియేషన్ కు కార్యదర్శిగా ఎంపికైన తెలుగు మహిళ డా. శాంతికుమారిని ఎమ్మెల్సీ కవిత ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, పారిశ్రామిక వేత్తలతో కలిసి ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. అవార్డు వేడుకల్లో భాగస్వామ్యం చేసినందుకు నిర్వాహకులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణిదేవి, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఐఏఎస్ కరుణ వాకాటి, పలువురు ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.


Next Story

Most Viewed