బెడ్‌పై పడుకున్న ఏడేళ్ల కూతురిని తండ్రి.. గిలగిలకొట్టుకున్నా వదల్లేదు

183

దిశ, వెబ్ డెస్క్: ప్రతి తండ్రికి కూతురంటే వల్లమాలిన ప్రేమ.. ఇక కూతురికి తండ్రే తన మొదటి హీరో.. తండ్రి కూతుళ్ళ బంధం ఎవరు విడదీయలేనిది. కానీ కుటుంబ కలహాలు ఆ బంధాన్ని విచ్చినం చేశాయి. క్షణికావేశంలో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతుర్ని కడతేర్చాడు ఒక కసాయి తండ్రి. భార్యపై ఉన్న కోపాన్ని కూతురుపై చూపి ఆమె ప్రాణాన్ని బలిగొన్న ఘటన విజయవాడలో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే..

గొల్లపూడిలోని కాంప్లెక్స్‌లో మెడికల్‌ షాపులో పనిచేస్తున్న జగుపల్లి రాజా అనే వ్యక్తి, భార్య యుగంధరి , ఏడేళ్ల పాపతో కలిసి కొత్తపేట మాకిన వారి వీధిలో నివాసముంటున్నాడు. కరోనా కారణంగా రాజా మూడు నెలలుగా పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ విషయమై భార్య రాజాతో రోజూ గొడవపడుతూ ఉండేది. అలాగే బుధవారం రాత్రి కూడా భార్యాభర్తలు మధ్య వివాదం జరగడంతో యుగంధరి, పాపను తీసుకొని వారి పుట్టింటికి వెళ్ళిపోయింది. గురువారం పాపను చూడాలనిపిస్తుందని రాజా ఫోన్ చేయడంతో ముందు పాపను పంపి, తర్వాత తానూ ఇంటికి వెళ్ళింది. మళ్లీ ఇరువురు గొడవపడ్డారు. కొద్దిసేపటి తర్వాత పాపను ఇంట్లో వదిలి యుగంధరి మళ్లీ తన అమ్మ దగ్గరకు వెళ్లింది.

భార్యపై కోపంతో రగిలిపోతున్న రాజా ఆ కోపాన్నంతా తన ఏడేళ్ల కూతురిపై చూపించాడు. మంచంపై పడుకున్న కూతురు ముఖంపై దిండును గట్టిగా అదిమిపెట్టి పాపకు ఊపిరాడకుండా చేశాడు. దీంతో గిలగిలకొట్టుకుంటూ చిన్నారి ప్రాణాలు విడిచింది. కొద్దిసేపటి తర్వాత ఇంటికొచ్చిన యుగాంధరికి శవమై మిగిలిన కూతురు కనిపించడంతో కుప్పకూలిపోయింది. వెంటనే భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజాపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి కోర్ట్ కి తరలించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..