మిర్చికి తెగులు.. రైతుకు దిగులు

375

దిశ, వాజేడు: ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాల్లో ఎక్కువ శాతం రైతులు మిర్చి పంట సాగు చేస్తున్నారు. తిరుమలలో సుమారు పదివేల ఎకరాల్లో మిర్చి సాగు చేస్తారు. మిర్చి పంటపై ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు పొందాలని ఆలోచనతో మిర్చి సాగుపై మక్కువ చూపుతారు. అలాంటిది కొద్ది సంవత్సరాల నుంచి మిర్చి సాగులో అంతగా లాభం రాక రైతులు అప్పులపాలై ఇబ్బందులు పడుతున్నారు.

గత సంవత్సరం వెంకటాపురం మండలంలో నకిలీ విత్తనాలు రైతులకు అంటగట్టడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అదేవిధంగా ఈ ఏడాది వాజేడు వెంకటాపురం మండలంలో సుమారు 10వేల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు ఒకవైపు మిర్చికి మార్కెట్లో మంచి ధర ఉండడంతో ఆనందం వ్యక్తం చేసిన రైతులు ఆపదలో పడ్డారు. ఏజెన్సీ ప్రాంతంలో పురుగు మందు షాపుల్లో అమ్మే బయో మందులు మిర్చి తోటలపై పిచికారి చేసి తీవ్రంగా నష్టపోతున్నారు. బయో మందుల వల్ల భూసారం దెబ్బతిని వివిధ రకాల తెగుళ్లు మిర్చి పంటకు వచ్చి మిర్చి మొక్కలు చచ్చిపోతున్నాయి. వేరు కుళ్లు తెగులు కంకర తెగులు బూడిద తెగులు ఎండు తెగులు ఇలా అనేక రకాల తెగుళ్లతో రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు.

ఎకరాకు లక్షన్నర పెట్టుబడి..

ఇప్పటికే ఎకరానికి లక్షా 50 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ఉన్న రైతు హఠాత్తుగా మిర్చి పంటకు తెగులు వచ్చింది. వ్యవసాయంపై రైతులకు సూచనలు సలహాలు అందించే అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఏజెన్సీ ప్రాంతంలోని చిన్న సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వీల్ టు వేరు కుళ్లు తెగులు లాంటి వైరస్‌లకు మందులు దొరకక రైతు తీవ్రంగా నష్టపోతున్నారు.

వాజేడు వెంకటాపురం మండలాల్లో తెగుళ్ల బారినపడి పంట నష్టపోయిన రైతులు ఎందరో ఉన్నారు. వ్యాపారుల వద్ద పెట్టుబడులు తెచ్చి మిర్చి పంటకు పెట్టిన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. బయో మందుల వాడకం వల్ల భూసారం దెబ్బతిని తెగుళ్లకు దారితీస్తుందని కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మిర్చి పంటపై భారీగా పెట్టుబడులు పెట్టిన రైతులు సీజన్ మధ్యలో మిర్చి పంటకు తెగుళ్లు సంభవించడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..