ఇలా చేస్తే కరెంట్ షాక్ కొట్టదు: ఆఫీసర్లు

by  |
ఇలా చేస్తే కరెంట్ షాక్ కొట్టదు: ఆఫీసర్లు
X

దిశ, కాటారం: ప్రస్తుతం కురుస్తున్న వానలతో విద్యుత్ ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. వర్షాలకు వ్యవసాయ పొలాల వద్ద స్టార్టర్లు, ఇండ్లల్లో గోడలు నానడంతో స్విచ్‌ల్లోకి నీరు రావడంతో షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదాలు ఉన్నాయని విద్యుత్ అధికారులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇనుప స్తంభాలకు విద్యుత్ సరఫరా జరిగి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వర్షం పడుతున్నపుడు, పడిన తర్వాత మోటార్ ఆన్/ఆఫ్ చేయొద్దు. ఎక్కువగా విద్యుత్ స్తంభాలు, సపోర్ట్ వైర్లు పరికరాలు తగిలి పశువులు కరెంట్ షాక్‌కు గురై మృతి చెందుతున్నాయి. జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాల బారి నుంచి కపాడుకోవచ్చని విద్యుత్ శాఖ ఆఫీసర్లు పేర్కొంటున్నారు.

తడి చేతులతో స్విచ్ వేయొద్దు

తడిచేతులతో స్విచ్‌లు ఆపరేట్ చేయొద్దు. రైతులు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇళ్లలో కరెంట్ వినియోగం, పొలాల్లో మోటార్ల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలి. ఏ సమస్య తలెత్తినా కరెంట్ సిబ్బందికి తెలియజేయాలి. జాగ్రత్తలు పాటించకుంటే ప్రమాదాల బారిన పడతారు.
-జోగానంద్​, ఏఈఈ మహాముత్తారం

ముందస్తు చర్యలు

-కరెంట్​ మోటార్లు, స్విచ్ బోర్డులు, బల్బులు వానకు తడవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.
-దుస్తులు ఆరవేసేందుకు ఇనుప వైర్లను ఉపయోగించొద్దు.
– తడి చేతులతో కరెంట్​ సరఫరా అయ్యే పరికరాలు, హోల్డర్లు, వైర్లు, స్వీచ్ ​బోర్డులను తాకవద్దు. పిల్లలకు అందనంత ఎత్తులోస్విచ్​ బోర్డులు ఉండాలి.
– ఉరుములు, మెరుపులు, వాన కురిసే సమయంలో టీవీలు, కూలర్లు, ఫ్రిజ్​లు, ఏసీలు, కంప్యూటర్లకు విద్యుత్ సరఫరా లేకుండా చూసుకోవాలి.
-ఎవరైనా కరెంట్​ షాక్​తో గురైతే వెంటనే మెయిన్ స్వీచ్ ఆఫ్ చేయాలి. పొడి కర్రతో కానీ, ప్లాస్టిక్ వస్తువులతో కానీ షాక్​‌కు గురైన వారిని నెట్టాలి.

రైతులకు..

-వ్యవసాయ విద్యుత్ మోటార్లకు తప్పనిసరిగా ఎర్త్​ పెట్టాలి.
-పంపుసెట్లు వానతో తడవకుండా కవర్ కప్పాలి
-పొలంలో వ్యవసాయ విద్యుత్ మోటారు తీగలు కింద బురదలో లేకుండా చూసుకోవాలి.
-కరెంట్ మోటారుకు విద్యుత్ సరఫరా చేసే వైర్లు మంచి నాణ్యతతో ఉండాలి.
-మోటార్లను తడి చేతులతో తాకవద్దు.
-కరెంట్​ తీగలు తెగిపోతే వెంటనే సంబంధిత లైన్‌మెన్‌కు సమాచారంఅందించాలి.



Next Story

Most Viewed