ముప్పతిప్పలు పెడుతున్న మ్యుటేషన్ ప్రక్రియ

233

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ధరణి పోర్టల్ అందుబాటులోకి రావడం.. మ్యుటేషన్ల ప్రక్రియ నిలిపోవడంతో రైతులు నెలల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ఎట్టకేలకు పెండింగ్ వాటికి సర్కారు అనుమతిచ్చినా.. ఆర్థికంగా అదనపు భారం పడుతుండడంతో అన్నదాతలకు ఇబ్బందులు పడుతున్నారు. చాలామందికి అవగాహన లేక, అసలు కొత్తగా దరఖాస్తు కూడా చేయడం లేదని తెలుస్తోంది. గతంలో మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోగా.. ప్రక్రియ ప్రారంభమై ఏ దశలో ఆగినా ఇక అంతే సంగతులు. అలాంటి వారికి మళ్లీ కొంతకాలం నిరీక్షణ తప్పేలా లేదు. అసలే ప్రక్రియ ప్రారంభం కాని వారికి ఎకరానికి రూ.2500 చొప్పున మళ్లీ ఆర్థికంగా అదనపు భారం పడుతోంది.

భైంసాకు చెందిన ఓ వ్యక్తి కామోల్ శివారులో భూమి కొనుగోలు చేయగా.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మ్యూటేషన్ కోసం మీసేవలో ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకున్నారు. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను ఎమ్మార్వో ఆఫీసులో ఇవ్వగా.. తహసీల్దారు లాగిన్ వరకు వెళ్లింది. డిజిటల్ సంతకం కాకపోవడంతో మ్యూటేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ లోగా ధరణి రావడంతో అది కాస్తా పెండింగ్ లో పడింది. తాజాగా మీ సేవ, ఆన్​లైన్​లో దరఖాస్తు చేద్దామంటే.. పెండింగ్ మ్యూటేషన్ కింద చూపడం లేదు. పాత దరఖాస్తుతోనే మ్యూటేషన్ అవుతుందా.. కొత్తగా ఎకరాకు రూ.2500 చెల్లించాలో అర్థం కాని పరిస్థితి ఆ వ్యక్తిది..

నిర్మల్​కు చెందిన మరొకరు తానూరు మండలంలో భూమి కొనుగోలు చేయగా.. రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మ్యూటేషన్ కోసం మీ సేవలో దరఖాస్తు చేసి.. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల జిరాక్సు కాపీలను తహసీల్దారు కార్యాలయంలో ఇచ్చారు. మ్యూటేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే సమయంలో ధరణి పోర్టల్ రావడంతో అది కాస్తా నిలిచి పోయింది. దీంతో తాజాగా ఇటీవల ఎకరాకు రూ.2500చొప్పున చెల్లించారు. నాలుగెకరాలకుపైగా భూమి ఉండగా.. ఇతర చార్జీలతో కలిపి రూ.10 వేలకుపైగా అతడిపై ఆర్థికంగా మళ్లీ భారం పెరిగింది. ఈ విషయం కూడా చాలా మందికి తెలియకపోవడంతో గతంలోనే దరఖాస్తు చేశామని ఊరుకుంటున్నారు.

ఇలా చెప్పుకుంటూ పోతే.. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో పెండింగ్ మ్యూటేషన్లు ఉన్నాయి. ఒక్క నిర్మల్ జిల్లాలో ఇప్పటి వరకు కొత్తగా ధరణి పోర్టల్ లో పెండింగ్ మ్యూటేషన్ల పూర్తి కోసం 365 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతంలో మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకుని.. మ్యూటేషన్ ప్రక్రియ పూర్తి కాకుండా వేలాది సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్​పడ్డాయి. తాజాగా సర్కారు పెండింగ్ మ్యూటేషన్ల పూర్తికి అనుమతివ్వడంతో.. ఆయా జిల్లాల కలెక్టర్లు వీటికి క్లియరెన్స్​ఇస్తున్నారు. పెండింగ్ మ్యూటేషన్లు రెండు రకాలుగా ఉన్నాయి. గతంలో వ్యవసాయ భూములు కొనుగోలు చేశాక.. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు మ్యూటేషన్​కు మీ సేవ ద్వారా దరఖాస్తు పెట్టుకున్నారు. మ్యూటేషన్ ప్రక్రియ అసలే ప్రారంభం కానివి ఓ రకం. గతంలో మ్యూటేషన్ ప్రక్రియలో అయిదు దశలు ఉండగా.. ప్రక్రియ ప్రారంభమై ఏ దశలో ఆగినవి రెండో రకం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు రకాలవి ఉన్నాయి.

మీ సేవలో దరఖాస్తు చేసుకున్నాక ఎలాంటి ప్రక్రియ ప్రారంభం కాని వాటికి తాజాగా ఎకరానికి రూ.2500 చొప్పున మళ్లీ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు వీలు లభించింది. ఆన్ లైన్ లో వచ్చిన దరఖాస్తుల జాబితాను కలెక్టర్ సంబంధిత తహసీల్దార్లకు పంపి స్పష్టత తీసుకుని మ్యూటేషన్లు చేస్తున్నారు. ఇలాంటి దరఖాస్తులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఇక గతంలో మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారి మ్యూటేషన్ ప్రక్రియ ప్రారంభమై.. అసంపూర్తిగా ఉన్నాయి. గతంలో అయిదు దశల్లో అధికారుల వద్ద ప్రక్రియ ఉండగా.. ఏ స్థాయిలో ఆగినా ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకునే పరిస్థితి లేదు. వీటికి సంబంధించి సర్కారు నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాకపోవడంతో మరికొంత కాలం వేచి చూడాల్సిందే. చాలా మంది కొత్తగా దరఖాస్తు చేసేందుకు కార్యాలయాలు, మీ సేవ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..