డ్రాగన్ పండ్ల సాగుకు రైతుల ఆసక్తి

by  |
డ్రాగన్ పండ్ల సాగుకు రైతుల ఆసక్తి
X

దిశ, పరిగి: అమెరికా, చైనా వంటి దేశాల్లో పండే డ్రాగన్ ఫ్రూట్‌ను మనదగ్గర సాగు చేస్తున్నాడు ఓ రైతు. డిమాండ్ ఉన్న పండ్లను ఎంచుకొని సాగు చేస్తే మంచి లాభాలు పొందవచ్చు అంటున్నాడు. పరిగి మండలం బర్కత్​పల్లి గ్రామానికి చెందిన రైతు అనంతచారి తనకున్న ఒక ఎకరంలో డ్రాగన్ ప్రూట్ తోటను సాగు చేస్తున్నాడు. ఇటీవల ఈ పండుకు మార్కెట్లో మంచి క్రేజ్, ధర కూడా ఎక్కువే ఉండటంతో సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు.

డ్రాగన్‌ ఫ్రూట్‌ చెట్టు నాగజముడు, బ్రహ్మజముడు చెట్లను తలపించినా తీగజాతి పండ్ల తోట. ఈ మొక్కకు త్వరగా ఎత్తు పెరిగే గుణం ఉంటుంది. ఇవి నిటారుగా ఎదగడానికి ఆధారం కావాలి. అందుకే సిమెంట్‌ కాంక్రీటు స్తంభాలను నాటాలి. ఒక ఎకరంలో 480 సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేసి డ్రాగన్ ప్రూట్ మొక్క పెరిగేందుకు వీలుగా వాటిపైన పాత టైర్లను అమర్చాడు. ఒక్కో మొక్క రూ.70 రూపాలయలకు కొనుగోలు చేసి తీసుకొచ్చాడు. ఎకరంలో 2 వేలకు పైగా మొక్కలు నాటవచ్చు. స్తంభానికి నాలుగు వైపుల ఒక్కో మొక్కను పెంచి అవి పైకి పారేలా చేశాడు. ఒక ఎకరంలో పొలంలో స్తంభాలు, మొక్కలు, పాత టైర్లు, డ్రిప్‌కు మొత్తం రూ.7 లక్షలకు వరకు వెచ్చించాడు. ఒకసారి మొక్కలు నాటితే 20 సంవత్సరాల వరకు పంట ఉంటుంది. స్తంభానికి నాలుగు దిక్కులా 2 అడుగుల పొడవు, వెడల్పు, ఒక అడుగు లోతు గుంతలు తవ్వాలి. గుంతకు 25 కిలోల పశువుల ఎరువు, కిలో వేప పిండి వేసి మొక్కలు నాటాలి. నేలను బట్టి, సాగు చేసిన రకాలను బట్టి తడులివ్వాలి.

డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగుకు ఎలాంటి నేలలైనా అనుకూలంగా ఉంటాయి. అయితే ఈ నేలలకు నీరు నిల్వ ఉండే స్వభావం ఉండకూడదు. ముఖ్యంగా ఎర్రనేలలు, ఇసుక నేలలు అయితే మరింత అనుకూలంగా ఉంటుంది. మిగతా పంటలతో పోలిస్తే.. డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగులో నీటి వినియోగం చాలా తక్కువ. రోజూ 10-15 లీటర్ల నీరు పెడితే సరిపోతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా డ్రిప్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఇక వర్షాలు ఎక్కువగా ఉన్నా… తక్కువగా ఉన్నా చెట్టుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. డ్రాగన్‌ ఫ్రూట్‌ తింటే ఆరోగ్యానికి మంచింది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఐరన్‌, విటమిన్‌-సి, ఫాస్పరస్‌, కాల్షియంలతో పాటు అనేక పోషక విలువలు ఉంటాయి. క్యాన్సర్‌, షుగర్‌, ఊబకాయం, చర్మ సంబంధ అలర్జీల నివారణకు చాలా ఉపయోగపడుతుంది. షుగర్‌ వ్యాధిగ్రస్తులు కూడా తినవచ్చును. పండు గు రించి ప్రజలకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఈ పండులో రక్తకణాలను పెంచేందుకు, రక్త హీనతను తగ్గించేందకు చాలా ఉపయోగపడుతాయని చెబుతుంటారు.

లాభం వస్తుందని సాగు చేశా..

డ్రాగన్ ప్రూట్స్(పండ్ల)కు మంచి గిరాకీ, ధర ఉండటంతో ఈ తోట సాగు చేయాలన్న ఆలోచన వచ్చింది. ముందు మన ప్రాంతంలో పండుతాయో లేదో తెలుసుకున్నా. సంగారెడ్డిలో ఓ రైతు సాగు చేసిన తోటను గు రించి అడిగి తెలుకున్నా.. సంగారెడ్డి నుంచే మొక్కలు తీసుకువచ్చి గత డిసెంబర్లో మొక్కలు నాటా. పెరిగి పెద్దవై పండ్లు కాస్తున్నాయి. సీజన్లో ఒక్కో పండు రూ. 50 ధర పలుకుతుంది. వారానికి ఒక సారి వచ్చి తోటను చూస్తాను. తక్కువ శ్రమతో ఈ తోట సాగు చేయవచ్చు. ఇతర వ్యాపారం చేస్తూనే ఒక కూలీ మనిషితోనే సొతంగా ఈ తోటను సాగు చేసుకోవచ్చు.

-అవుసలి అనంతచారి, రైతు బర్కత్​పల్లి



Next Story

Most Viewed