భారత సాఫ్ట్‌వేర్ పితామహుడు ఇకలేరు

by  |
భారత సాఫ్ట్‌వేర్ పితామహుడు ఇకలేరు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత సాఫ్ట్‌వేర్ పరిశ్రమ పితామహుడిగా పరిగణించబడుతున్న ఫకీర్ చాంద్ కొహ్లీ గురువారం కన్నుమూశారు. ఆయన వయసు ప్రస్తుతం 96 సంవత్సరాలు. దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ టాటా కన్స్లల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) వ్యవస్థాపకులలో ఒకరిగా, తొలి సీఈవోగా, పద్మభూషణ్ అవార్డు గ్రహీతగా ఫకీర్ చాంద్ గుర్తింపు పొందారు. భారత 100 బిలియన్ డాలర్ల ఐటీ పరిశ్రమ నిర్మాణానికి పునాది వేసిన ఫకీర్ చాంద్ మరణం పట్ల పలువురు కార్పొరేట్ అధిపతులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ‘భారత ఐటీ రంగానికి విచారకరమైన రోజిది. ఫకీర్ చాంద్ టీసీఎస్ తొలి సీఈవో మాత్రమే కాదు. భారత వృద్ధికి పునాదులు వేసిన వ్యక్తి అని టెక్ మహీంద్రా ఎండీ సీపీ గుర్నాని చెప్పారు.

ఫకీర్ చాంద్ కొహ్లీ 1924, మార్చి 19న స్వాతంత్ర్యానికి పూర్వం పెషావర్‌లో జన్మించారు. పెషావర్‌లోనే పాఠశాల విద్యను పూర్తిచేశారు. అనంతరం లాహోర్‌లోని పంజాబ్ యూనివర్శిటీలో బీఏ, బీఎస్సీలో గోల్డ్ మెడల్ సాధించారు. 1950కో మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్‌లో పీజీ చేసిన తర్వాత, అమెరికాలోని పలు కంపెనీల్లో పనిచేశారు. అనంతరం 1951లో భారత్‌కు తిరిగి వచ్చి టాటా ఎలక్ట్రిక్ కంపెనీలో చేరారు. 1968లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ను జేఆర్‌డీ టాటా, ఫకీర్ చాంద్ కొహ్లీలు స్థాపించారు. ముంబై కేంద్రంగా ఐటీ సేవలను ప్రారంభించిన వీరు అనంతర కాలంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీసీ సేవల బ్రాండ్‌గా టీసీఎస్‌ను నిలపడంలో కృషి చేశారు. ఫకీర్ చాంద్ 1995 నుంచి 1996 మధ్య నాస్కామ్ ఆధ్యక్షుడిగా కూడా పనిచేశారు.


Next Story

Most Viewed