ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం.. వారందరికీ ఎగ్జామ్స్.. !

by  |
intermediate students
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటర్ ఫస్టియర్ వార్షిక పరీక్షలను దసరాలోపు నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లను చేస్తోంది. పరీక్షల షెడ్యూల్, పరీక్షల నిర్వహణ సమయం, సిలబస్‌ను తర్వలోనే ప్రకటించనున్నారు. ప్రస్తుతం సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులందరూ పరీక్షలు తప్పనిసరిగా రాయాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫస్టియర్ పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధమయ్యేందుకు ప్రిపరేషన్ షెడ్యూల్‌ను తయారు చేయనున్నారు. కాగా, ఇంటర్ ఫస్టియర్ పరీక్షల కోసం 4.59లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

కరోనా ప్రభావంతో ఇంటర్ సెకండ్ ఇయర్‌లో ఫీజులు కట్టిన 4,73,967 మంది విద్యార్థులను ప్రభుత్వం ఫస్టియర్ మార్కుల ఆధారంగా పై తరగతులకు ప్రమోట్ చేసింది. ఫస్టియర్ పరీక్షలను వాయిదా వేస్తూ విద్యార్థులను సెకండ్ ఇయర్‌లో చేరేందుకు అనుమతులిచ్చింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో 2020-21 అకాడమిక్ ఇయర్ ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఇంటర్ బోర్డ్ తగిన ఏర్పాట్లను చేపట్టింది. పరీక్షల కోసం ఫీజులు చెల్లించిన 4,59,008 మంది విద్యార్థులు తప్పనిసరిగా ఫస్టియర్ పరీక్షలు రాయాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు గతేడాది 10వ తగరతి పరీక్షలు రాయకుండానే ఇంటర్ తరగతులకు ప్రమోట్ అయ్యారు. ఈ ఏడాది కూడా అదే విధంగా పై తరగతులకు ప్రమోట్ చేయడం ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలు పూర్తిగా కొరవడనున్నాయని విద్యాశాఖ భావించింది. విద్యార్థులకు నష్టం వాటిల్లకుండా ఉండేందుకు పరీక్షలు తప్పనిసరిగా సరిగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

దసరాలోపు పరీక్షల నిర్వహణ

సెప్టెంబర్ 1 నుంచి ఫిజికల్ తరగతులు ప్రారంభం కానుండడం, కరోన తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను నిర్వహించనుంది. దసరాలోపు పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పరీక్షలు నిర్వహించే ముందు విద్యార్థులకు ప్రిపరేషన్ తరగతులను నిర్వహించనున్నారు. ఫస్టియర్ సిలబస్‌ను కళాశాలలో రివిజన్ చేసి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేసేలా షెడ్యూల్ తయారు చేయనున్నారు. 3 గంటల పరీక్షా సమయాన్ని 2 గంటలు లేదా 1.30 గంటలకు కుదించనున్నారు. సిలబస్‌లో కూడా భారీగా తగ్గింపులు చేపట్టి ప్రశ్నా పత్రాలను తయారు చేయనున్నారు. ఈ పరీక్షల్లో ఫైయిల్ అయిన విద్యార్థులకు వెంటనే సప్లమెంటరీ పరీక్షలను కూడా నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.

విద్యార్థులందరూ పరీక్ష రాయాల్సిందే: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ఫస్టియర్ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫీజులు చెల్లించిన 4.59లక్షల మంది విద్యార్థులు తప్పనిసరిగా పరీక్షలు రాయాల్సిందే. త్వరలోనే పరీక్షల నిర్వహణ తేదీలను ప్రకటిస్తాం. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు వెంటనే సప్లమెంటరీ పరీక్షలను కూడా నిర్వహిస్తాం. ఫస్టియర్ పరీక్షలకు విద్యార్థులు సన్నద్దమయ్యేలా తగిన చర్యలు చేపడుతాం.

Next Story

Most Viewed