వైద్య పరీక్షలను సత్వరం నిర్వహించండి

by  |
వైద్య పరీక్షలను సత్వరం నిర్వహించండి
X

దిశ, తెలంగాణ బ్యూరో: నీట్-పీజీ, ఎంబీబీఎస్ ఫైనలియర్ పరీక్షలు, విదేశీ వైద్య విద్యార్థులకు నిర్వహించే ఎఫ్ఎంజీఈ ప్రవేశపరీక్షలను అర్ధాంతరంగా వాయిదా వేయడంతో వారి సేవలు వినియోగంలోకి రాకుండా పోయాయని, నెల రోజుల వ్యవధిలో యుద్ధ ప్రాతిపదికన పరీక్షలను నిర్వహించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేంద్ర వైద్యారోగ్య మంత్రికి విజ్ఞప్తి చేసింది. పరీక్షలను వాయిదా వేసినందువల్ల, ఎప్పుడు జరిగేదీ షెడ్యూలు ప్రకటించనందువల్ల నీట్-పీజీ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్న 1,74,886 మంది గ్రాడ్యుయేట్ డాక్టర్ల సేవలను ప్రస్తుతం వినియోగించుకోలేపోతున్నామని, కరోనా కేసులు లక్షల్లో పెరుగుతూ ఉన్న సమయంలో వారి విజ్ఞానం సమాజానికి ఉపయోగపడకుండా పోతోందని ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ జయలాల్, సెక్రటరీ జనరల్ జయేశ్ లీలే ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సుమారు 88 వేల మంది ఎంబీబీఎస్ విద్యార్థులు ఫైనలియర్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారని, ఇందులో కొద్దిమంది ‘కంపల్సరీ ఇంటర్న్ షిప్‘ పూర్తి చేసుకున్నారని, మరికొద్దిమంది ఇంకా చేరాల్సి ఉన్నదని, ఈ పరిస్థితుల్లో వార్షిక పరీక్షలను వాయిదా వేయడంతో వారి సేవలు కూడా నిరుపయోగంగా మారిపోతున్నాయని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని నెల రోజుల వ్యవధిలో ఈ పరీక్షలను నిర్వహించడం ద్వారా వారిని ప్రస్తుతం ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్ పొందుతున్న పేషెంట్లకు ఉపయోగపడేలా వాడుకోవచ్చని కేంద్ర వైద్య మంత్రికి సూచించారు.

మరోవైపు విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకున్న సుమారు లక్ష మంది ఇండియాలో ప్రాక్టీసు చేయడానికి ఎఫ్ఎంజీఈ అనే ప్రవేశపరీక్షను రాయాల్సి ఉంటుందని, ఇక్కడ మెడికల్ ప్రోటోకాల్ ప్రకారం ట్రీట్‌మెంట్ ఇవ్వడానికి తగిన పరిజ్ఞానాన్ని పొందాల్సి ఉంటుందని, ఇప్పుడు ఈ పరీక్షలను కూడా వాయిదా వేసినందువల్ల వారి సేవలను సైతం ఉపయోగించుకోలేకపోతున్నామని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఒక్కసారికి ప్రత్యేక పరిస్థితిగా భావించి కాస్త సరళమైన తీరుల పరీక్షను సత్వరం పూర్తి చేసి వారిని కరోనా పేషెంట్ల చికిత్స కోసం వినియోగించుకోవచ్చని, ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.

ఇప్పటికే వైద్య సేవలందిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది మీద విపరీతమైన ఒత్తిడి ఉందని, విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారని, ఇలాంటి సమయంలో 1.74 లక్షల మంది పీజీ విద్యార్థులు, 80 వేల మంది యూజీ వైద్య విద్యార్థులు, లక్ష మంది విదేశీ వైద్య విద్యార్థుల సేవలను వినియోగించుకోవడం ద్వారా ఫలితం ఉంటుందని, ఆ దిశగా సత్వరం తదనుగుణమైన నిర్ణయాలు తీసుకోవాలని ఐఎంఏ విజ్ఞప్తి చేసింది.

Next Story

Most Viewed