పోలీసు VS ఈటల వర్గం.. ‘స్పెషల్ బ్రాంచ్’ అధికారికి ఘోర అవమానం

by  |
police
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం వల్భాపూర్‌లో పోలీసులకు, ఈటల వర్గానికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ బాపురెడ్డి షర్టు చినిగిపోయింది. గ్రామంలో జరుగుతున్న ఓ కార్యక్రమానికి ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ బాపురెడ్డిని ఈటల అనుచరులు అడ్డుకుని సెల్ ఫోన్ లాక్కున్నారని తెలిసింది. ఈ క్రమంలో ఏఎస్ఐ బాపురెడ్డి షర్టు జేబు చినిగిపోయింది.

భోజనం తింటుండగా…

వల్భాపూర్ గ్రామంలోని ఓ ఇంట్లో ఉన్న ఈటల రాజేందర్ భోజనం చేస్తుండగా ఏఎస్ఐ బాపురెడ్డితో పాటు మరో పోలీసు అధికారి వచ్చి ఫోటోలు తీస్తున్నారని బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఫోటోలు ఎందుకు తీస్తున్నారని, వద్దని వారించడంతో వాగ్వాదం చోటు చేసుకుందని వారు వివరించారు.

పోలీసులకు ఫిర్యాదు..

విధి నిర్వహణలో ఉన్న తనను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారని స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ బాపురెడ్డి వీణవంక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే బాపు రెడ్డి బైకును కూడా ధ్వంసం చేశారని వీణవంక ఎస్సై కిరణ్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. బాపురెడ్డి విధుల్లో ఉన్నసమయంలో బూతులు తిడుతూ ఎవడు పంపాడురా, ఎందుకు వచ్చావురా..? అంటూ తిట్టారని ఎస్సై వివరించారు. ఎఎస్ఐ బాపురెడ్డి ఫిర్యాదు మేరకు జీడి రాజు, దొమ్మాటి రాయమల్లు, నలుభాల మధు, మారుముల్ల సదయ్య, నామని విజేందర్, రాయిని శివయ్య, జీడి మోహన్, దొమ్మాటి శ్రీనివాస్‌తో పాటు మరికొంత మంది కలిసి ఈ ఘటనకు పూనుకున్నారని ఎస్సై కిరణ్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని ఆయన వివరించారు.



Next Story

Most Viewed