‘ధరణి’ సెగ.. రైతుల జీవితాలకు ‘ఆటో లాక్’

124
Dharani portal

’ధరణి‘ పోర్టల్ లక్షలాది మంది రైతుల జీవితాలకు ఆటోలాక్ వేసింది. తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములు ‘ధరణి’ పోర్టల్ లో ప్రభుత్వానికి చెందినవిగా నమోదయ్యాయి. తహసీల్దార్ కార్యాలయాలకు పరుగులు తీసి గోడు వెల్లబోసుకున్నా అధికారులు తమకేమీ తెలియదంటూ ముఖం చాటేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గట్టుపల్లిలో సర్వే నంబరు 65 లో చాలా మంది పట్టాదారులున్నారు. వారి పట్టాదారు పుస్తకాల్లో మాత్రం పట్టా భూములుగానే ఉన్నది. ధరణి పోర్టల్ లో మాత్రం లావునీ భూములుగా పేర్కొన్నారు. ఇప్పుడు క్రయ విక్రయాలన్నీ నిలిచిపోయాయి. ఈ సర్వే నంబరులోని పట్టా భూములుగా ఉన్న వాటిలో ఫాం హౌజ్ వెంచర్ వేశారు. పీవోబీలో ఉండటంతో రిజిస్ట్రేషన్లు చేయలేమని తహసీల్దార్ తిరస్కరిస్తున్నారు. రాష్ట్రంలో లక్షలాది ఎకరాలకు ‘ధరణి‘ దగా చేస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకమైన ‘ధరణి’ పోర్టల్ లక్షలాది మంది జీవితాలకు ‘ఆటో లాక్’ వేసింది. తరతరాలుగా వచ్చిన భూములను ప్రశ్నార్థకంగా మార్చారు. దశాబ్దాలుగా దున్నుకుంటున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నాయి. ఎన్నో ఏండ్లుగా పట్టా భూములుగానే రికార్డుల్లో నమోదు చేశారు. కానీ ధరణి పోర్టల్ లో మాత్రం ప్రభుత్వ భూములుగా నమోదై ఉంది. ప్రభుత్వ భూములు, దేవాదాయ, వక్ఫ్​ భూములను కాపాడుతామని, వాటిని ఆటోలాక్ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. అయితే పట్టా భూములను కూడా ఆటో లాక్ చేశారన్న విమర్శలొస్తున్నాయి. వాటిపై క్రయ విక్రయాలు జరగకుండా నిషేధించారు. వారసత్వంగా సంక్రమించిన తమ భూములను హఠాత్తుగా ప్రభుత్వానికి చెందినవిగా నమోదు చేయడం పట్ల ఆందోళన వ్యక్తమవుతున్నది. ఏ అధికారి వారి గోడును వినిపించుకోవడం లేదు. ఏ కార్యాలయం నుంచి భరోసా లభించడం లేదు. తమకేం తెలియదంటూ తహసీల్దార్లు ముఖం చాటేస్తున్నారు. తమకేం తెలియదంటూ తిప్పి పంపించేస్తున్నారు. కనీసం పట్టా భూములను ప్రభుత్వానివిగా నమోదు చేయడంలో ఎక్కడ పొరపాటు జరిగిందో, ఎవరు చేశారో, ఎందుకు చేశారో అన్న ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు. ఉద్దేశ పూర్వకంగా నమోదు చేశారా? యాదృచ్చికంగా నమోదయ్యాయా? అన్న సందేహాల నివృత్తికి తహసీల్దార్లు అంగీకరించడం లేదు. ఏదేమైనా పరిష్కారానికి ఉన్నతాధికారుల నుంచి తదుపరి ఉత్తర్వులు జారీ కావాల్సిందేనంటున్నారు. ధరణి పోర్టల్ లో భూముల వివరాల నమోదుకు 2017 రికార్డులను పరిగణనలోకి తీసుకోలేదు. ఖాస్రా పహాణీ, చెస్లా పహాణీల ఆధారంగానే ఏయే సర్వే నంబర్లు పట్టా భూముల, ఏవి సర్కారు భూములో నమోదు చేశారు. అయితే ఆ తర్వాత 70 ఏండ్లలో జరిగిన పరిణామాలను పరిగణనలోకి తీసుకోలేదని తెలిసింది. భూ కేటాయింపులు, బదలాయింపులు, ఎన్వోసీలు, క్రమబద్ధీకరణలు వంటి అంశాల ప్రతిపాదికన నమోదు ప్రక్రియ జరగలేదు. దాంతో ఖాస్రా పహాణీ కాలం నుంచి 2017 వరకు ఇచ్చిన ఆదేశాలు, ఉత్తర్వులేవీ ధరణికి చేరలేదు. దీంతో లక్షలాది ఎకరాల భూమి క్రయ విక్రయాలకు నోచుకోకుండా గందరగోళంగా నెలకొంది. చేతిలో పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నప్పటికీ క్రయ విక్రయాలకు నోచుకోవడం లేదు.

మచ్చకు కొన్ని

– రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గట్టుపల్లిలో సర్వే నంబరు 65 లో చాలా మంది పట్టాదారులు ఉన్నారు. వారి పట్టాదారు పుస్తకాల్లో మాత్రం పట్టా భూములుగానే ఉన్నది. ధరణి పోర్టల్ లో మాత్రం లావునీ పట్టా భూములుగా పేర్కొన్నారు. ఇప్పుడు క్రయ విక్రయాలన్నీ నిలిచిపోయాయి. ఈ సర్వే నంబరులోని పట్టా భూములుగా ఉన్న వాటిలో ఫాం హౌజ్ వెంచర్ వేశారు. అయితే పీఓబీలో ఉండటంతో రిజిస్ట్రేషన్లు చేయలేమని తహశీల్దార్ తిరస్కరిస్తున్నారు. గట్టుపల్లిలో సర్వే నంబరు 65/1 లోని 35.28 ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి అనీ, మిగతా సర్వే నంబర్లు 65/2 నుంచి 65/15 వరకు పట్టా భూములని లేఖ నంబరు బీ/1578/2016, తేదీ 6.6.2016 ద్వారా మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ కు మహేశ్వరం తహసీల్దార్​ కు పంపారు. కానీ ధరణి పోర్టల్ లో మాత్రం చాలా నంబర్లు ప్రభుత్వమని, లావునీ అని నమోదు చేశారు. వాటన్నింటినీ పీఓబీలో పేర్కొన్నారు. కొన్నింటిని మాత్రం పట్టా భూములుగా నమోదు చేశారు. ఇదేం వింతనో రైతులకు అర్ధం కావడం లేదు. ఒకటే సర్వే నంబరులో సగమేమో లావునీ, సగమోమో పట్టాగా పేర్కొన్నారు.
– రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్లలో సర్వే నంబర్​ 50 విస్తీర్ణం చాలా పెద్దది. 1000 ఎకరాలకు పైగా ఉంది. ఇందులో కొంత ప్రభుత్వ భూమి, మిగతా పట్టా భూమి అని తరతరాలుగా రికార్డుల్లో నమోదై ఉన్నది. ధరణి పోర్టల్ లో మాత్రం చాలా బై నంబర్లను ప్రభుత్వానిదిగా, లావునీ భూములుగా నమోదు చేశారు. కొన్నింటిని మాత్రం పట్టా భూములుగా పేర్కొన్నారు. ఇక్కడా రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

ప్లాట్లుగా రిజిస్ట్రేషన్లు

నిషేధిత భూముల జాబితాలో పేర్కొన్న ప్రభుత్వ, పట్టా భూముల్లోని వెంచర్లలో మాత్రం ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు, క్రయ విక్రయాలకు ఎలాంటి ఆటంకాలు లేవు. సగమేమో ప్రభుత్వం, మిగతా సగం పట్టాగా ఉన్న సర్వే నంబర్లలోని వెంచర్లలోని ప్లాట్లు రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. పీవోబీ జాబితాలో ప్లాట్లు లేవు. కానీ వ్యవసాయ భూములుగా అమ్మడంలోనే చిక్కులు ఎదురవుతున్నాయి. సాగు భూములు కూడా సబ్ రిజిస్ట్రార్ల చేతిలోనే ఉంటే తమ భూముల అమ్మకాలు ఈజీగా ఉండేదేమోనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. నిషేధిత జాబితాలో పొరపాటుగా నమోదు చేసిన తహసీల్దార్లు తమ భూముల క్రయ విక్రయాలను అడ్డుకుంటున్నారని బాధితులు మండిపడుతున్నారు. అవి పట్టా భూములేనని లిఖితపూర్వకంగా తహసీల్దార్లు రాసిచ్చిన వాటిని కూడా సరి చేయడం లేదంటున్నారు.

ఉత్తర్వుల అమలేది?

‘తెలంగాణ భూముల హక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల చట్టం-2020’లో లోపాలను సవరించకపోతే సామాన్యులకు కష్టాలు మొదలు కానున్నాయి. ఖాస్రా పహాణీ ఆధారంగా ప్రభుత్వ భూముల లెక్కను ‘ధరణి’ పోర్టల్ లో నమోదు చేయడం ద్వారా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. 1948 నుంచి లక్షలాది ఎకరాలను అనేక మందికి పలు రకాలుగా పంపిణీ చేసింది. వాటిలో రైతులకు అసైన్డ్ చేసింది. అలాగే స్వాతంత్ర్య సమరయోధులకు, మాజీ సైనికులకు.. ఇలా అనేక మంది భూములను కేటాయించింది. వాటిని కూడా ప్రభుత్వ భూములుగానే పరిగణిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది అమ్ముకున్నారు. కొన్నింట్లో లే అవుట్లు వెలిశాయి. కొన్ని సెటిల్మెంట్లు జరిగాయి. వాటి ఆధారంగా పట్టా భూములుగా మారాయి. ఇంకొన్ని భూ మార్పిడి కింద కేటాయింపులు చేశారు. ఇప్పుడేమో వాటిని సర్కారు ఖాతాల్లో జమ చేస్తున్నారు. భవిష్యత్తులో క్రయ విక్రయాలకు ఆటంకాలు కలిగించే తరహాలో ఉన్నాయి. ఆర్వోఆర్ యాక్టు 1971 ప్రకారం తహశీల్దార్ ను రికార్డింగ్ అథారిటీగా డిఫైన్ చేశారు. ఇందులో దాన్ని తొలగించారు. భూ రికార్డుల ప్రక్షాళన ప్రకారం ‘ధరణి’ పోర్టల్ లోకి డేటాను అప్ లోడ్ చేశారు. అందులో అనేక తప్పులు దొర్లాయి. ఆ తప్పులను సరిదిద్దడానికి ప్రస్తుత తహసీల్దార్లకు ఎలాంటి అధికారం ఇవ్వలేదు.

సెటిల్మెంట్ భూముల సంగతేమిటి?

పాయిగా, జాగీర్, సంస్థాన్ వంటి భూములకు ఆర్వోఆర్ వర్తించదు. వాటిని ప్రభుత్వ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో పేర్కొన్నారు. వీటిలో కొన్ని భూములు సెటిల్ అయ్యాయి. వాటిని 1971 చట్టంలో 2018 లో సెక్షన్ 12- ఎ సబ్ సెక్షన్​ 3 ప్రకారం అంతకు ముందే సెటిల్ చేసిన పాయిగా, జాగీర్ భూములకు ఈ నియమం వర్తించదని సవరణ చేశారు. కానీ కొత్త ఆర్వోఆర్ చట్టంలో అలాంటి వెసులుబాటు కల్పించలేదు. అలాంటి భూముల జాబితా ఏ తహసీల్దార్ దగ్గర లభించడం లేదు. వాటిని ఏ విధంగా ప్రభుత్వ భూములుగా రికార్డు చేస్తారన్న సందేహం కలుగుతున్నది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రూ.వేల కోట్ల విలువైన పాయిగా భూములు సీఎస్ 14/1958, సీఎస్ 7/1958 ప్రకారం అనేకం వివాదాల్లో ఉన్నాయి. వాటిని ఎలా రికార్డు చేస్తారో అంతుచిక్కడం లేదు. ఖుర్షిదా పాయిగా, ఆస్మాన్ జాసి పాయిగా, సర్ వికార్వలా పాయిగా వంటి మూడు రకాల పాయిగాలు ఉన్నాయి.

పరిష్కారం కోర్టులోనేనా?

భూ రికార్డుల ప్రక్షాళనలో తలెత్తిన లోపాలను సవరించకుండానే అదే డేటాను ధరణిలో నమోదు చేశారు. కంప్యూటర్ తప్పిదాలు, ఆపరేటర్లు చేసిన పొరపాట్లు అనేకం ఉన్నాయి. పీవోబీ జాబితాలో పట్టాదారుల భూములను కూడా పేర్కొన్నారు. వాళ్లు చేసిన పొరపాట్లను కూడా సవరించుకునేందుకు రెవెన్యూ శాఖలో వ్యవస్థ లేదు. ఇక కోర్టులను ఆశ్రయించాల్సిందేనా? అన్న సందేహం కలుగతోంది. కనీసం వారి రికార్డులన్నీ పరిశీలించి సరిదిద్దే వ్యవస్థ, అధికారం రెవెన్యూ అధికారులకు లేదు. చిన్న రైతులు పరిష్కారానికి కోర్టు దాకా వెళ్లే స్థాయి లేదన్న స్పృహ లేకుండా ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధరణిలో డేటా ఆధారంగా తలెత్తే వివాదాలకు పరిష్కారం మండల స్థాయిలో లభించేటట్లు ఉండాలని రెవెన్యూ యంత్రాంగం కోరుతోంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..