అంజన్న భక్తులకు ఎంత కష్టమొచ్చే..? సమస్యలకు నిలయంగా కొండగట్టు..

by  |
అంజన్న భక్తులకు ఎంత కష్టమొచ్చే..? సమస్యలకు నిలయంగా కొండగట్టు..
X

దిశ, మల్యాల : ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద దేవాలయాల్లో ఒకటైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం ఎంతగానో ప్రసిద్ధి గాంచినది. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన కొండగట్టుకు ప్రతి ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి ఆంజనేయస్వామి వారిని దర్శించి పునీతులు అవుతున్నారు. కేవలం తెలంగాణ జిల్లాల నుంచి మాత్రమే కాకుండా పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి కూడా నిత్యం వేల సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు సమర్పించే కానుకలు, హుండీ ద్వారా ప్రతి సంవత్సరం కోట్ల రూపాయల ఆదాయం సమాకూరుతుంది.అయినప్పటికీ, ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో సరైన వసతులు లేక భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. టెండర్ల ప్రక్రియ నత్తనడకన సాగడం, పిలిచిన టెండర్లు ఇప్పటికీ రెండు సార్లు వాయిదా పడటం మూలంగా కొండపైన ఉండే పూలు పండ్ల దుకాణం, కొబ్బరికాయల దుకాణం, హోటల్, కిరాణం వంటి ముఖ్యమైన దుకాణాలు మూసి ఉంచడం వలన భక్తులు ఎంతగానో ఇబ్బంది పడున్నారు.

ఇప్పటివరకు కేవలం స్వామివారికి తలనీలాలు సమర్పించే కల్యాణకట్టకు సంబంధించిన ఒక టెండర్ మాత్రమే పూర్తి అయింది. కొబ్బరికాయల టెండర్ ఇంకా పెండింగ్‌లోనే ఉన్నందున ఆలయ అధికారులు పొరుగుసేవల సిబ్బందిని ఉపయోగించుకుని విక్రయాలు సాగిస్తున్నారు. టెండర్ల వాయిదా వలన భక్తులు వసతుల లేమితో ఇబ్బంది పడటమే కాకుండా దేవాదాయ శాఖ లక్షల రూపాయల ఆదాయం నష్టపోవాల్సి వస్తుంది. పోయిన ఏడాదికి సంబధించిన టెండర్లు అన్ని జనవరిలో ముగిసినప్పటికీ గుత్తేదారులు తాము కరోనా వల్ల తీవ్రంగా నష్టపోయామని హైకోర్టును ఆశ్రయించడంతో మరో మూడు నెలలు సమయం ఇచ్చారు. గడువు సమయం ముగియడంతో జూన్ నెలలో అధికారులు అన్ని దుకాణాలను ఖాళీ చేయించారు. దానితో జూన్ నుండి ఇప్పటికీ దాదాపుగా 6 నెలల నుండి అన్ని దుకాణాలు మూసి ఉన్నాయి.

సిబ్బంది చేతివాటం..

భక్తులు స్వామి వారికి సమర్పించే కొబ్బరికాయల టెండర్ ఇంకా పూర్తికానందున ఆలయ పొరుగు సేవల సిబ్బందికి విక్రయాల బాధ్యతలు అప్పగించడం వలన వారు ఎక్కువ రేటుకు విక్రయిస్తూ చేతివాటం చూపిస్తున్నారని, ఇదంతా ఆయా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుందని తెలుస్తోంది. కొబ్బరికాయ కొట్టే దగ్గర కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని, దీని వలన ఆలయ ప్రతిష్ట దెబ్బతింటుందని హిందూ వాహిని కార్యకర్తలు ఇప్పటికే పలుమార్లు ఆధారాలతో సహా ఆలయ ఈఓ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన మాత్రం నామమాత్రపు చర్యలు తీసుకొని వదిలేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆదేశాలు రాగానే టెండర్ల ప్రక్రియ చేపడతాం :

గతంలో ఉన్న గుత్తేదారులు బకాయిలు చెల్లించకపోవడంతో కొన్ని నిబంధనలు మార్పు చేశామన్నారు. అనివార్య కారణాల వలన రెండు సార్లు టెండర్లకు పిలిచినా వాటిని వాయిదా వేసినట్టు పేర్కొన్నారు. కమిషనర్ ఆఫీస్ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చిన వెంటనే టెండర్లు నిర్వహిస్తాం.కొబ్బరికాయలు ఎక్కువ ధరకు అమ్ముతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, వెంటనే విచారణ జరిపి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తాము.

-ఆలయ ఈఓ వెంకటేష్


Next Story

Most Viewed