సీఎం అశోక్ గెహ్లాట్‌ సోదరుడికి ఈడీ షాక్

by  |
సీఎం అశోక్ గెహ్లాట్‌ సోదరుడికి ఈడీ షాక్
X

దిశ, వెబ్‌డెస్క్ :
రాజస్థాన్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఛాన్స్ వస్తే చాలు కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో లాగా తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎరువుల కుంభకోణానికి సంబంధించి సీఎం అశోక్ గెహ్లాట్ సోదరుడు అగ్రసేన్ గెహ్లాట్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) బుధవారం మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. కేసుకు సంబంధించి ఢిల్లీ, గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌, రాజస్థాన్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థ దాడులు జరిపాయి. ఈ కుంభకోణానికి సంబంధించి రాజస్థాన్‌లో ఆరు, గుజరాత్‌లో నాలుగు, న్యూఢిల్లీలోని ఓ చోట, పశ్చిమ బెంగాల్‌లో రెండు చోట్ల తనిఖీ నిర్వహించినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ దాడులు మాజీ ఎంపీ బద్రిరామ్ జఖర్ నివాసంలో చేసినట్లు సమాచారం. అనుపమ్ కృషి అనే సంస్థ చేసిన ఎగుమతుల్లో నిబంధనలు ఉల్లంఘన జరిగినట్లు తేలడంతో గతంలోనే కస్టమ్స్ విభాగం రూ .7 కోట్ల జరిమానా విధించింది. ఆ సంస్థ యజమానే సీఎం అశోక్ గెహ్లాట్ సోదరుడు అగ్రసేన్ గెహ్లాట్. యూపీఏ హయాంలో జరిగిన కుంభకోణంలో అగ్రసేన్‌ గెహ్లాట్‌ ప్రమేయం ఉందని, తన కంపెనీ సబ్సిడీ ఎరువులను ఎగుమతి చేసిందని గతంలో బీజేపీ ఆరోపించింది. అయితే, సీఎం అశోక్‌ గెహ్లాట్‌, మాజీ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ మధ్య విభేదాలతో రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే.



Next Story