సీఎం జగన్‌కు కొత్త టెన్షన్.. ఉద్యోగ సంఘాల వార్నింగ్.!

by  |
సీఎం జగన్‌కు కొత్త టెన్షన్.. ఉద్యోగ సంఘాల వార్నింగ్.!
X

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో పీఆర్సీ పంచాయితీ ముదురుతోంది. పీఆర్సీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక అడుగు ముందుకు వేశారు. పది రోజుల్లో పీఆర్సీపై ఓ నిర్ణయం తీసుకుంటామని చిత్తూరులో సీఎం జగన్ ప్రకటించారు. సీఎం ప్రకటనతో ఉద్యోగ సంఘాలు శాంతిస్తాయని అంతా భావించారు. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం తగ్గేది లేదంటున్నాయి. సీఎం ప్రకటనపై ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు, ఫ్యాప్టో అధ్యక్షుడు శ్రీధర్‌లు స్పందించారు. మాకు పీఆర్సీపై ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక సమాచారం లేదన్నారు.

పది రోజుల్లో పీఆర్సీ ప్రక్రియ పూర్తి చేస్తాం అని సీఎం చెప్పినట్లు మీడియాలో చూశామని.. ముఖ్యమంత్రి ప్రకటనను స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. అయితే, తమ డిమాండ్ ఒక్క పీఆర్సీ మాత్రమే కాదని పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, జీపీఎఫ్ చెల్లింపులు, సీపీఎస్ రద్దు వంటివి ఇలా మెుత్తం 71 డిమాండ్లు ఉన్నాయని, వాటన్నింటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కొత్త పీఆర్సీ కోసం ఉద్యోగ సంఘాలు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితం ఉద్యమ కార్యాచరణను నోటీసు రూపంలో సీఎస్‌కు కూడా ఇచ్చారు. ఏడో తేదీ నుంచి నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు.

పీఆర్‌సీ నివేదిక ఇవ్వలేమన్న కార్యదర్శుల కమిటీ
– ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందన్న బండి శ్రీనివాసరావు

పీఆర్‌సీ సహా సంబంధిత అంశాలపై ఉద్యోగ సంఘాలతో కార్యదర్శుల కమిటీ సమావేశం ముగిసింది. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో భాగస్వాములైన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సచివాలయం మొదటి బ్లాక్‌‌లో సమావేశం జరిగింది. పీఆర్‌సీ నివేదిక ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరగా.. నివేదికలోని సాంకేతిక అంశాలపై అధ్యయనం చేయాలని అధికారులు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పీఆర్‌సీ నివేదిక ఇవ్వలేమని స్పష్టం చేశారు. పీఆర్‌సీపై సీఎం జగన్‌ తిరుపతిలో ప్రకటన చేశారు. సీఎం హామీ మేరకు పది రోజుల్లో పీఆర్‌సీ ప్రకటిస్తామని కార్యదర్శుల కమిటీ తెలిపింది.

దీనిపై స్పందించిన ఉద్యోగ సంఘాలు పీఆర్‌సీ నివేదిక ఇవ్వకుండా చర్చలెలా సాధ్యమని ప్రశ్నించారు. దీంతో కార్యదర్శుల కమిటీ సమావేశం అసంపూర్తిగానే ముగిసింది. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. 71 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మళ్లీ ఇచ్చామని తెలిపారు. కార్యదర్శుల కమిటీది కాలయాపన తప్ప మరొకటి కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏదో ఒకటి చెప్పేవరకు ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందన్నారు.

ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం జగన్.. వారిలో కొత్త ఆశలు

Next Story