వామన్‌రావు హత్యలో అంతుచిక్కని నిజాలు.. అసలేంజరుగుతోంది..?

by  |
వామన్‌రావు హత్యలో అంతుచిక్కని నిజాలు.. అసలేంజరుగుతోంది..?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్ సిటీ: రెండు రోజుల క్రితం దారుణ హత్యకు గురైన అడ్వకేట్ దంపతులకు సంబంధించి ఆరోపణలు ప్రత్యారోపణలూ సాగుతున్నాయి. వామనరావుకు కూడా హంతక చరిత్ర ఉందని కరీంనగర్‎కు చెందిన నీటి పారుదల శాఖ విశ్రాంత ఉద్యోగి భార్య అరుణజ్యోతి ఆరోపించారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. తన కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 2008లో తన భర్త వద్ద రూ.1.50 లక్షలు తీసుకున్నాడని, ఉద్యోగం ఇప్పించకపోవటంతో, డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తెచ్చిన తన భర్తను, నగర శివారులోని అలుగునూర్ వద్ద కిడ్నాప్ చేసి, అక్కడి నుంచి నల్గొండ జిల్లా వలిగొండ గ్రామంలో హత్య చేశాడని ఆరోపించారు. ఏడాది అనంతరం హత్యోదంతం వెలుగులోకి రాగా, అప్పటి హోంమంత్రితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కన్నీటిపర్యంతమయ్యారు.

మేడిపండులోని పురుగులను చూడండి

వామన్ రావు క్లాస్ మేట్ బండి శ్రీనివాస్ శనివారం మంథనిలో మాట్లాడుతూ.. హత్యకు పాల్పడ్డ వారికి శిక్ష పడాలన్నారు. వామన్ రావు చేసిన అరాచకాలు కూడా అన్ని ఇన్నీ కావని, చిన్నప్పటి నుంచి నేర స్వభావం కల్గిన వ్యక్తని ఆరోపించారు. తాను సాగు చేస్తున్న 3.5 ఎకరాల భూమి రెవెన్యూ రికార్డులో వామన్ రావు కుటుంబ సభ్యుల పేరిట ఉందని తెలిపారు. తమ పేరిట మార్చాలని ఆయన తండ్రి కిషన్ రావును కోరితే రూ. మూడు లక్షలు గుడ్ విల్ అడిగారన్నారు. వామన్ రావు కూడా డబ్బులు డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. ఇవ్వకపోవడంతో వామన్ రావు తనతో పాటు మరో 25 మందిపై, 80 ఏళ్ల తన తల్లిపై కూడా చేర్చారన్నారు.

రూ. 6 వేల కోట్ల భూ దందా ఏంటీ?

ఫిబ్రవరి మొదటి వారంలో వామన్ రావు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన స్క్రీన్ షాట్లు వైరల్ అవుతున్నాయి. ‘‘మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని 18 గ్రామాల్లో 1973 సీలింగ్ యాక్ట్ ప్రకారం పట్టాలు కలిగి ఉన్న 1200 ఎకరాల భూమిని లబ్ధిదారుల నుంచి వేరే ఇతరులకు అక్రమంగా మార్చారు. దాని ప్రస్తుత మార్కెట్ విలువ రూ. ఆరు వేల కోట్లు. అవినీతి అధికారులపై చర్యల కోసం హై కోర్టులో పిల్ దాఖలు చేయనున్న నెన్నెల మండలం ఇందూరు గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త ఇందూరి రాంమోహన్’’ అని చేసిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ రూ. ఆరు వేల కోట్ల విలువైన భూ దందా స్కాం గురించి వెలుగులోకి వస్తే పెద్ద తలకాయలు బయటపడతాయన్న ఆందోళనతో చేతులు కలిపి ఉంటారా? అన్న చర్చ కూడా సాగుతోంది.

నాలుగో టార్గెట్ నేనే

పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకు మిగిలిన టార్గెట్ తానేనని మంథని మాజీ ఉప సర్పంచ్ ఇనుముల సతీష్ ఆరోపించారు. ఆయన టార్గెట్ చేసిన నలుగురిలో ఒకరిపై పీడీ యాక్టు నమోదు చేయించారని, మరొకరిని టీఆర్ఎస్‌లో చేర్పించుకున్నారని, మూడో వ్యక్తి అయిన గట్టు వామన్ రావును మట్టు బెట్టడంతో నాలుగో వ్యక్తి అయిన తనను టార్గెట్ చేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమికి నలుగురు వ్యక్తులే కారణమంటూ పుట్ట మధు గతంలోనే ప్రకటించారని పేర్కొన్నారు. ఆయన టార్గెట్లలో నాలుగో వ్యక్తిగా ఉన్న తనకు రక్షణ కల్పించాలని సతీష్ కోరారు. ఈ విషయంపై డీజీపీని కూడా కలిసి వినతి చేస్తానని తెలిపారు.

ఛేజ్ చేశారా? కాపు కాశారా?

వామన్ రావు, నామగణి హత్య విషయంలో పోలీసుల ప్రకటనలు పొంతన లేకుండా ఉన్నాయి. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్మి పోస్తున్నా పోలీసు అధికారులు అలా వ్యవహరించడం వెనక ఆంతర్యం ఏంటో అంతు చిక్కకుండా పోయింది. హ్యత జరిగిన తర్వాత రామగుండం సీపీ సత్యానారాయణ మీడియాతో మాట్లాడుతూ.. వామన్ రావు దంపతులు ప్రయాణిస్తున్న కారును ఛేజ్ చేసి అడ్డగించి అతి కిరాతకంగా చంపేశారని ప్రకటించారు. అప్పటికే ఘటనా స్థలంలో ఉన్న కొందరు తీసిన వీడియోలో ఓ మహిళ మాట్లాడుతూ నిందితులు చాలా సేపటి నుంచి ఘటనా స్థలానికి కొద్ది దూరంలో కారులోనే ఉన్నారని చెప్పింది. ఆ తరువాత ఐజీ నాగిరెడ్డి మీడియాతో మాట్టాడుతూ.. గట్టు వామన్ రావు చివరి సారిగా మాట్లాడిన వీడియో తీసిన వారు సహకరించాలని కోరారు. వీడియో తీసిన వ్యక్తిని సాక్ష్యంగా చూపాలనుకుంటున్న పోలీసులు అదే వీడియోలో ఉన్న మహిళ మాటలను పరిగణనలోకి తీసుకోవడం లేదని లేదని స్పష్టం అవుతోంది.

సాధారణంగా క్రైం జరిగినప్పుడు సంబంధిత స్టేషన్ పరిధిని ఉద్దేశించి మాట్లాడుతారు. రామగుండం సీపీ విడుదల చేసిన ప్రెస్ నోట్లో అయినా, ప్రేస్ మీట్లో అయినా మంథనికి 16 కిలో మీటర్ల దూరంలో వామన్ రావు దంపతుల హత్య జరిగిందని ప్రకటించారు. రామగిరి పోలీస్ స్టేషన్‌కు మూడు కిలో మీటర్ల దూరంలో ఘటన జరిగిందని చెప్పకుండా మంథనికి 16 కిలోమీటర్ల దూరం అని చెప్పడం ఏంటీ అన్న ప్రశ్న తలెత్తుతోంది. బిట్టు శ్రీను, కుంట శ్రీనివాస్ మర్డర్‌కు ముందు 25 సార్లు ఫోన్లు మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసు అధికారులు నిందితులతో వాట్సప్ కాల్‌లో టచ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. సెన్సేషనల్‌గా మారిన వామన్ రావు దంపతుల మర్డర్ కేసులో పోలీసులు ఆచూతూచి అడుగేస్తున్నారు. కేసును హై కోర్టు సూమోటోగా స్వీకరించడంతో తప్పిదాలు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. మర్దర్ కేసులో సాంకేతికతను అందిపుచ్చుకుని మరిన్ని ఆధారాలు సేకరించేందుకు ఫోరెన్సిక్ టీం కూడా ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి వస్తోంది.

ఎవరినీ వదిలి పెట్టేది లేదు: సీపీ సత్యనారాయణ

అడ్వకేట్లు గట్టు వామన్ రావు, నాగమణి హత్య కేసులో అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని రామగుండం సీపీ సత్యనారాయణ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ హత్య కేసును పోలీస్ శాఖ చాలా సీరియస్‌గా తీసుకుందన్నారు. నిష్పక్షపాతంగా, వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నామని, స్పెషల్ ఫోరెన్సిక్, సాంకేతిక బృందాలు పాల్గొన్నాయని, ఉన్నతాధికారుల సమక్షంలోనే విచారణ సాగుతోందని సీపీ వివరించారు. నిందితులకు కత్తులు, కారు సమకూర్చిన బిట్టు శ్రీనును దర్యాప్తు బృందం విచారిస్తోందన్నారు.



Next Story

Most Viewed