భారీగా పెరిగిన ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి..

by  |
commerce and industry
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఏడాది అక్టోబర్ నెలకు సంబంధించి భారత్‌లోని మౌలిక విభాగంగా పేర్కొనే ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి 7.5 శాతానికి పెరిగింది. గతేడాది ఇదే నెలలో 0.5 శాతం క్షీణత నమోదైనట్టు మంగళవారం ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కీలక రంగాల్లో ఉత్పత్తి 4.4 శాతం పెరిగింది. బొగ్గు, సహజవాయువు, రిఫైనరీ, సిమెంట్ రంగాల్లో ఉత్పత్తి పనితీరు మెరుగ్గా ఉండటంతో ఈ వృద్ధి నమోదైందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో ఈ ఎనిమిది రంగాల వెయిటేజ్‌ 40.27 శాతం.

ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-అక్టోబర్ మధ్యకాలంలో ఈ రంగాల ఉత్పత్తి అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో నమోదైన 12.6 శాతం నుంచి 15.1 శాతానికి పెరిగింది. అలాగే, ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలలైన ఏప్రిల్-అక్టోబర్ మధ్య భారత ద్రవ్యలోటు రూ. 5.47 లక్షల కోట్లుగా ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. రంగాల వారీగా చూస్తే.. బొగ్గు ఉత్పత్తి 14.6 శాతం, సహజవాయువు 25.8 శాతం, రిఫైనరీ ఉత్పత్తి 14.4 శాతం పెరిగింది.

ముడి చమురు ఉత్పత్తి మాత్రం 2.2 శాతం క్షీణించింది. ఎరువుల ఉత్పత్తి 0.04 శాతం, సిమెంట్ ఉత్పత్తి 14.5 శాతం, విద్యుత్ ఉత్పత్తి 2.8 శాతం, ఉక్కు ఉత్పత్తి 0.9 శాతం పెరిగిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.


Next Story

Most Viewed