విదేశీ బొగ్గు మనకెందుకు?

by Disha edit |
విదేశీ బొగ్గు మనకెందుకు?
X

గతం కన్నా 177 శాతం వృద్ధితో రూ.868 కోట్ల లాభాలు ఆర్జించి, దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న సింగరేణి, కోల్‌ ఇండియాతో పోటీ పడుతోంది. థర్మల్ విద్యుత్త్ ఉత్పత్తికి తెలంగాణలో బొగ్గుకు కొదువలేదని, దేశంలో ఉత్పత్తి అయ్యే బొగ్గుతో పోలిస్తే దానికి మూడు రెట్లు ఎక్కువ ఖర్చవుతుందని, దిగుమతి చేసుకున్న బొగ్గును రాష్ట్రాలు కొనుగోలు చేయాలన్న నిబంధనను తొలగించాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఇప్పటికే రైతుల నడ్డి విరిచేలా విద్యుత్తు సవరణ చట్టాన్ని తెచ్చి, ప్రజలు చీకట్లో మగ్గేందుకు చేస్తున్న ప్రయత్నాలు రైతులకు శాపంలా పరిణమిస్తున్నాయి.

దేశంలోని సగానికి పైగా విద్యుత్ కేంద్రాలలో బొగ్గు నిల్వలు దాదాపు అడుగంటిపోయాయి. బొగ్గు తన శక్తి రూపాన్ని ఉష్ణం నుంచి యాంత్రికానికి, అక్కడినుంచి విద్యుత్తుకు బదలాయిస్తూ ప్రపంచ తలరాతనే మార్చేసింది. కోట్లాది ఏళ్ల కిందట భూమిలో నుంచి పుట్టుకొచ్చి ఆది మానవుడి నుంచి ఆధునిక మానవుడి వరకు జీవన గమనాన్ని శాసిస్తూనే వస్తుంది. పారిశ్రామిక విప్లవాన్ని కొత్త పుంతలు తొక్కించింది. నేటి విద్యుత్ ప్రపంచాన్ని కూడా శాసిస్తున్నది. భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహనాల మనుగడ తలరాతను నిర్వహిస్తున్న ఇంధనం బొగ్గే. నల్ల బంగారంగా ప్రాముఖ్యం పొందుతున్న దీనికి డిమాండ్ పెరిగింది. దేశంలోని విద్యుత్‌ అవసరాలను 70 శాతం థర్మల్‌ పవర్‌ కేంద్రాలే తీరుస్తున్నాయి. ఆయా కేంద్రాలలో ఇప్పుడు బొగ్గుకి కొరత ఏర్పడడంతో మునుపెన్నడూ లేని విధంగా వేసవిలో దేశమంతా విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. హఠాత్తుగా వేడిమి పెరిగిపోయి ఏసీలు, ఫ్రిజ్‌ల వాడకం ఎక్కువైపోయింది. దేశవ్యాప్తంగా పెరిగిపోయిన విద్యుత్‌ వినియోగంతో పాటు బొగ్గు పంపిణీలో లోపాలు సమస్యని మరింత జఠిలం చేసాయి.

మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, హరియాణా, బిహార్‌ జమ్మూ-కాశ్మీర్, తమిళనాడు, కర్ణాటకలతోపాటు మరికొన్ని రాష్ట్రాలలో విద్యుత్‌ కోతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీని ప్రభావం పరిశ్రమలపై పడి ఆర్థిక రంగం కూడా కుదేలైపోతుందన్న ఆందోళనలు ఉన్నాయి. రెండేళ్లుగా సంక్షోభంలో ఉన్న పరిశ్రమలలో ఉత్పత్తి సాధారణ స్థితికి వచ్చింది. దీంతో విద్యుత్‌ వాడకం ఎక్కువైపోయింది. డిమాండ్‌కి తగ్గట్టుగా సప్లయ్‌ చేయడానికి థర్మల్‌ కేంద్రాలను బొగ్గు కొరత వేధిస్తోంది. ఉండవలసిన నిల్వలలో 30 శాతం కూడా ఉండడం లేదు. ఇదే విషయాన్ని కేంద్ర విద్యుత్ శాఖ కూడా నెల క్రితం అన్ని రాష్ట్రాలకు తెలిపి ముందుగా బొగ్గు నిల్వలు పెంచుకోవాలని సూచించింది. ప్లాంట్‌ ఎప్పుడు నిలిచిపోతుందో తెలియని పరిస్థితి దాపురించింది.

కుట్రలతో నిర్ణయాలు

1880లలో బొగ్గును విద్యుత్ ఉత్పత్తికి వాడుకోవడం మొదలెట్టారు. చివరికిదే విద్యుత్ ఉత్పత్తిలో ప్రధాన ఇంధనంగా మారింది. ప్రపంచం మొత్తం వినియోగించుకుంటున్న శక్తిలో దాదాపు 28 శాతం బొగ్గు నుంచి లభిస్తుంది. ఇందులో ఆసియా దేశాలే సుమారు మూడు వంతులు వాడుకుంటున్నాయి. దానితో విదేశీ బొగ్గు ధర బాగా పెరిగిపోయింది. ఇలా పెరిగిన ధరలతో రాష్ట్రాలు థర్మల్ విద్యుత్ కేంద్రాలలో 50 వేల టన్నులకు 10 శాతం (5వేల టన్నులు) విదేశీ బొగ్గు తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాలని, దాని వలన దేశీయ బొగ్గు వినియోగం తగ్గుతుంది గనుక ఆ దేశీయ బొగ్గును అదానీ, టాటాల ప్లాంట్లకు మళ్లించాలని కేంద్రం కుట్ర చేసింది. ఇటు ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ధరలు 40 శాతం పెరిగాయి. భారతదేశ దిగుమతులు రెండేళ్ల కనిష్టానికి పడిపోయాయి. ప్రపంచంలో బొగ్గు నిల్వలలో భారత్‌ నాలుగవ స్థానంలో ఉంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద బొగ్గు దిగుమతిదారు కూడా భారతదేశమే. దేశీయంగా ఉన్న కొరతను తీర్చడానికి ఎక్కువ బొగ్గును దిగుమతి చేసుకోవడం సరైన మార్గం కాదని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రాల మీదనే కాదు అదానీ కరెంట్ అమ్మడానికి, దోచిపెట్టాలనీ, ప్రధాని కార్యాలయం విదేశాలపై ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం ఉంది.

రైతుల పాలిట దేవుడు

2014లో 57 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి తెలంగాణలో ఉంది. వినియోగం 113 మిలియన్ యూనిట్లు ఉంది. 50 శాతానికిపైగా కొరత ఉంది. కేసీఆర్ నాయకత్వంలో 7,778 మెగావాట్ల సామర్థ్యం ఉన్న విద్యుత్ 2022 వరకు 17,305 మెగావాట్లకు చేరింది. ఎలా అధిగమిస్తారని హేళన చేసినవారికి దిమ్మదిరిగేలా. కరెంటు కోతల‌తో రైతులు, పరిశ్రమలు ఇబ్బందులు పడినస్థాయి నుంచి,'మాకు ఇంతసేపు కరెంటు అక్కర్లేదు' అనే స్థాయికి చేరింది. దేశంలో ఎక్కడా లేని విధంగా నాణ్యమైన 24 గంటల కరెంట్ అందించి రైతుల పాలిట దేవుడయ్యారు కేసీఆర్. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉంది. అన్ని గనుల నుంచి థర్మల్‌ కేంద్రాలకు లింకేజీ ఉంది.

దేశంలో మిగులు రాష్ట్రంగా తెలంగాణ విద్యుత్ రంగంలో అద్భుతాలు సృష్టించింది. తెలంగాణ కొంగు బంగారంగా పిలుచుకునే సింగరేణి సంస్థ లాభాలలో దూసుకుపోతుంది. సింగరేణి / కోల్ ఇండియాను నష్టాలలో చూపెట్టి, ప్రభుత్వ రంగ సంస్థలను వేలం వేసిన కేంద్ర ప్రభుత్వం సిరులు కురుస్తున్న సింగరేణి ప్రయివేట్‌పరం చేసేందుకే బొగ్గు సంక్షోభానికి కారణం అయ్యింది. అదానీ, టాటాలను ఆదుకోవడం కోసం దేశీయ బొగ్గుకు రూ.3 వేలకే టన్ను ఉన్నప్పటికీ, టన్ను రూ.30 వేలకు లభించే విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాలని కేంద్రం పదే పదే ఒత్తిడి చేయడం వల్ల,దాని ప్రభావంతో కరెంటు ఛార్జీల భారం ప్రజలపై పడుతుందని తెలంగాణ విద్యుత్తు సంస్థలు మొత్తుకుంటున్నాయి.

సింగరేణి మీద దృష్టి

సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌సీసీఎల్‌) తవ్వేది బొగ్గు గనులే అయినా, ఇది రాష్ట్రం పాలిట బంగారు గని. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించడమే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు యేటా వందల కోట్ల రూపాయలు ఆదాయం తెచ్చిపెడుతోంది. బొగ్గు ఉత్పత్తి, అమ్మకాలు పెరిగే కొద్దీ సంస్థ టర్నోవర్‌ పెరుగుతోంది. దీంతో సర్కారుకు రాయల్టీ, జీఎస్టీ, డివిడెంట్లు, కస్టమ్స్‌ డ్యూటీ, స్వచ్ఛభారత్, కృషి కల్యాణ్, క్లీన్‌ ఎనర్జీ సెస్‌ తదితర రూపాలలో సింగరేణి చెల్లింపులు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఎనిమిదేళ్లలో సింగరేణి గణనీయంగా అభివృద్ధి సాధించింది. సుమారు రూ.40 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని అందించింది. ఇందులో రాష్ట్రానికి రూ.17 వేల కోట్లు, కేంద్రానికి రూ. 22 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.

గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి కరోనా విపత్కర పరిస్థితుల కారణంగా బొగ్గు అమ్మకాలు, రవాణా తగ్గడంతో రూ.1,129 కోట్ల నష్టాలు వచ్చినప్పటికీ, ఈ ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి, రవాణా, విద్యుత్ అమ్మకాలు పెరగడంతో గతం కన్నా 177 శాతం వృద్ధితో రూ.868 కోట్ల లాభాలు ఆర్జించి, దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న సింగరేణి, కోల్‌ ఇండియాతో పోటీ పడుతోంది. థర్మల్ విద్యుత్త్ ఉత్పత్తికి తెలంగాణలో బొగ్గుకు కొదువలేదని, దేశంలో ఉత్పత్తి అయ్యే బొగ్గుతో పోలిస్తే దానికి మూడు రెట్లు ఎక్కువ ఖర్చవుతుందని, దిగుమతి చేసుకున్న బొగ్గును రాష్ట్రాలు కొనుగోలు చేయాలన్న నిబంధనను తొలగించాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఇప్పటికే రైతుల నడ్డి విరిచేలా విద్యుత్తు సవరణ చట్టాన్ని తెచ్చి, ప్రజలు చీకట్లో మగ్గేందుకు చేస్తున్న ప్రయత్నాలు రైతులకు శాపంలా పరిణమిస్తున్నాయి.

డా.సంగని మల్లేశ్వర్,

జర్నలిజం విభాగాధిపతి

కేయూ, వరంగల్,

98662 55355


Next Story

Most Viewed