మైనార్టీ సంక్షేమంపై చిత్తశుద్ధి ఏది?

by Disha edit |
మైనార్టీ సంక్షేమంపై చిత్తశుద్ధి ఏది?
X

భారతదేశం ఒక ప్రజాస్వామ్య, సెక్యులర్ దేశం. ఇక్కడ పౌరులందరికీ సమాన హక్కులూ, అవకాశాలు లభ్యం కావాలి. ఏ ఒక్కరి పట్ల వివక్ష, పక్షపాతం ఉండకూడదు. కానీ పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆ పరిస్థితి లోపించింది. బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా ముస్లిం మైనారిటీల పరిస్థితి 'గొర్రెకు బెత్తెడు తోక' సామెతను తలపిస్తోంది. ఏడున్నర దశాబ్దాల కాలమంటే చిన్న విషయం కాదు. ఈ కాలంలో దేశం అనేక రంగాల్లో అభివృద్ధి సాధించింది. కానీ ముస్లిం సముదాయానికి మాత్రం స్వాతంత్ర్య ఫలాలు ఇంకా అందని ద్రాక్షలుగానే మిగిలిపోయాయి. ఇంతటి సుదీర్ఘ స్వతంత్ర భారతంలో పేదలు, బడుగు బలహీన వర్గాలకు సమాన హక్కులు, అవకాశాలు లభిస్తున్నాయా? అంటే సమాధానం కోసం తడుముకోవాల్సిన ప్రశ్న.

ఎందుకంటే, గత డెబ్బెయ్యేళ్ళకు పైగా ఒక పెద్ద మానవ సమూహం మనదేశంలో వివక్షకు, అన్యాయానికి, అవకాశాల లేమికి, పీడనకు, హక్కుల ఉల్లంఘనకు గురవుతూనే ఉంది. అసంఖ్యాక మంది త్యాగధనుల బలిదానాల ఫలితంగా భారత దేశ దాస్య శృంఖలాలను తెంచుకొని లౌకిక, ప్రజాస్వామ్య గమ్యం వైపుకు ప్రస్థానం చేసింది. నిజానికి పరాయి బానిసత్వం నుండి విముక్తి పొందిన తరువాత ప్రజల జీవితాలు మారిపోవాలి. వారి జీవన ప్రమాణాలు అనూహ్యంగా మెరుగు పడాలి. అన్నిటికీ మించి వారి ఆత్మ విశ్వాసానికి ఆకాశమే హద్దు కావాలి.

సంక్షేమంపై గాలి మాటలే..

కానీ మన దేశంలోని రెండో పెద్ద మెజారిటీ వర్గమైన ముస్లింల పరిస్థితి అలా లేదు. 'వారి అభివృద్ధి 'ఎక్కడ వేసిన గొంగడి అక్కడే' అన్నట్లుంది. వారి జీవన ప్రమాణాల్లో చెప్పుకోదగిన మార్పులేవీ అంతగా సంభవించలేదు. వారిలో ఆత్మన్యూనత, అభద్రతా భావం ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. అనుమానపు దృక్కులు వారిని చిత్రవధ చేస్తూనే ఉన్నాయి. తినే తిండి, తొడిగే బట్ట విషయంలో కూడా స్వతంత్రత లేకుండా పోతున్నది. మూకదాడులు, ఆస్తుల విధ్వంసంతో పోయిన వారి ప్రాణాలు పోగా, మిగిలిన వారి జీవితాలు దుర్భరమౌతున్నాయి. అసలే పేదరికంతో మగ్గుతున్న జాతికి ఇది గోరుచుట్టుపై రోకటి పోటు. ఈనాటికీ దేశ ముస్లిం జనాభాలో అరవై శాతం మంది ప్రజలు దారిద్య రేఖ దిగువన దుర్భర జీవనం గడుపుతున్నారు. అత్యధిక శాతం మందికి సరైన జీవనోపాధి అవకాశాలు లేవు. కూడు, గూడు, గుడ్డ అన్న కనీస రాజ్యాంగ హామీ కూడా వీరికి వర్తించడం లేదు. అక్షరాస్యతా శాతం అతి హీనం. ఉన్నత స్థాయి విద్యనభ్యసించిన వారిని, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారిని, చట్టసభల్లో కాలుమోపిన వారిని వేళ్ళపై లెక్కించవచ్చు. ఎన్నో కమిటీలు, కమిషన్లు వారి జీవన స్థితి గతుల్ని, వారి వెనుక బాటును, దాని కారణాలను వివరంగా తెలియజేశాయి. సమస్యల పరిష్కారానికి సూచనలూ, వారి సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలనూ సిఫార్సు చేశాయి. కానీ చర్యలు శూన్యం. కమిషన్లు దేశంలోని ఇతర అన్నివెనుకబడిన వర్గాలకంటే ముస్లిమ్ సముదాయం మరింత వెనుకబాటుకు, అణచివేతకు, అవకాశాల లేమికి గురై ఉందన్న పచ్చి నిజాన్ని వెల్లడించాయి. అయితే, ఈ దుస్థితికి ప్రధాన కారణం పాలక వర్గాలే అన్నది జగమెరిగిన సత్యం. ఇప్పటివరకు ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకొని అన్ని పార్టీలూ లబ్ధి పొందాయి. కానీ వారి సంక్షేమంపై మాత్రం గాలి మాటలే తప్ప, చేతల్లో ఎక్కడా చేసి చూపించలేదు. కమిషన్లు, కమిటీలు అంటూ కాలయాపన చేస్తున్నారు. ఇవన్నీ వారిని మభ్యపెట్టడానికి, ఓటు బ్యాంకు దారి మళ్లకుండా కాపాడుకోడానికి తప్ప మరొకటి కాదు.

అన్ని వర్గాల లాగే..

నిజానికి దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయబద్దంగా, రాజ్యాంగ పరంగా వారికి లభించవలసిన హక్కులు, అవకాశాలు, అభివృద్ధి ఫలాలు లభించినప్పుడే 'స్వతంత్ర భారత' భావనకు పరిపూర్ణత చేకూరుతుంది. అలా కాకుండా దేశంలోని ఏ ఒక్క వర్గం ప్రజలైనా వివక్షకు, పక్షవాతానికి, అణచివేతకు, అవకాశాల లేమికి, న్యాయ నిరాకరణకు గురైతే దేశం ప్రగతీ వికాసాల బాటలో పయనించడం, నాగరిక లక్షణాలతో విలసిల్లడం అసాధ్యం. కనుక, పాలక పక్షాలు ఇప్పటికైనా స్పందించి దేశ ప్రజలకు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని వారికి అందించాలి. ముస్లిం సముదాయానికి వారి జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో తగిన ప్రాతినిధ్యం కల్పిస్తూ, పంచాయతీ మొదలు పార్లమెంటు వరకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి. ముస్లింల సంక్షేమానికి అరకొర నిధులు విదల్చడం కాకుండా ప్రత్యేకంగా సమగ్ర బడ్జెట్ కేటాయించాలి. సబ్ ప్లాన్ అమలు చేయాలి. మైనారిటీ కార్పొరేషన్ , మైనారిటీ ఎడ్యుకేషన్ బోర్డు, ముస్లిం పర్సనల్ లా, ఉర్దూ అకాడమీ, వక్ఫ్ బోర్డుల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి.

ఇప్పటికే అన్యాక్రాంతమైపోయిన వక్ఫ్ భూములు, ఇతరేతర ఆస్తుల్ని కబ్జాదారుల నుండి తిరిగి రాబట్టాలి. లేనిపక్షంలో, ఉన్న ఆస్తులను రక్షించలేక పోయినందుకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ ముస్లిములకు నష్ట పరిహారం చెల్లించాలి. విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగ లన్నింటిలో ముస్లింలకు సముచితమైన, చట్టబద్దమైన అవకాశాలు, ప్రాతినిధ్యం కల్పించాలి.

ఐక్య కార్యాచరణ రూపొందించుకొని

తెలంగాణలో ఉర్దూను రెండవ అధికార భాషగా అమలు చేస్తామన్న వాగ్దానాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు.12 శాతం రిజర్వేషన్ల హామీ కూడా గాలికి కొట్టుకుపోయింది. ఈ విషయంలో ముస్లిం నాయకత్వ జెండా మోస్తున్నామని చెప్పుకునేవాళ్ళు కేసీఆర్‌ను ప్రశ్నించడం లేదు. నిలదీయడం లేదు. కనుక ముస్లింలు ఓటు బ్యాంకు రాజకీయాలకు లొంగకుండా, రాజకీయ చైతన్యం పెంపొందించుకోవాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా రాజ్యాంగ ప్రసాదితమైన తమ హక్కుల సాధనకు రాజ్యాంగ బద్దంగానే పోరాడాలి. పాలక పక్షాలు చురుగ్గా స్పందించేలా దేశంలోని ప్రజాస్వామ్య ప్రియులు, హక్కుల నేతలు, లౌకిక వాదులు, వామపక్షీయులు, బహుజన శక్తులతో కలిసి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకు రావాలి. ప్రజాస్వామ్య శక్తులు, భావ సారూప్యత కలిగిన వ్యక్తులు, సంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, పౌరసమాజం సహకారంతో ముస్లిం నేతలు, సంఘాలు ఐక్య కార్యాచరణ రూపొందించుకొని ఉద్యమాలకు పూనుకోవాలి. బాధిత వర్గాల్లో చైతన్యం రానంత కాలం పాలక పక్షాలు వారిని ఓటు బ్యాంకులుగానే పరిగణించి చిన్నచిన్న తాయిలాలతోనే సంతృప్తి పరిచే ప్రయత్నాలు చేస్తుంటాయి. కనుక చైతన్యంతో కార్యాచరణ రూపొందించుకొని సాధన దిశగా ముందుకు సాగాలి.

(నవంబర్ 11 జాతీయ మైనారిటీ సంక్షేమ దినోత్సవం)

- యండి. ఉస్మాన్ ఖాన్

సీనియర్ జర్నలిస్టు

99125 80645

Next Story

Most Viewed