బీసీ సంఘాల పయనం ఎటు?

by Disha edit |
బీసీ సంఘాల పయనం ఎటు?
X

గ్ర కులాలవారు బీసీలను అణిచివేతకు గురి చేస్తూ, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబాటుకు కారణమవుతున్నారు. దేశ జనాభాలో దాదాపు 56 శాతం ఉన్న బీసీలను రాజకీయ పార్టీలు కేవలం ఓటర్లుగానే చూస్తున్నాయి. పార్టీలను స్థాపించినవారు, నడిపించేవారు అందరూ అగ్రకులాలవారే. బీసీ, ఎస్సీ, ఎస్టీలు అణిచివేతకు గురవడానికి ప్రధాన కారణం వారికి విద్య లేకపోవడమే. దేశంలోని ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఉండాలని, అణగారినవర్గాల కోసం రాజ్యాంగ నిర్మాతలు కొన్ని ప్రత్యేక హక్కులను, రిజర్వేషన్లను రాజ్యాంగంలో ఏర్పరిచారు. వీటిని తొలగించడానికి అగ్రకులాల నాయకులు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. ఈ మోసాలను గమనించకుండా, బీసీ సమాజాన్ని తప్పుడు మార్గంలోకి నడిపించడానికి బీసీ కులాలకు చెందిన నాయకులను తమ పక్కలో పెట్టుకుని, తమకు అనుకూలంగా మలుచుకునే యత్నాలు మొదలు పెట్టారు. బీసీ నాయకులు కూడా తమతమ అవసరాల కోసం బీసీలను తాకట్టు పెట్టేందుకు సిద్ధపడుతున్నారు.

అగ్రవర్ణాల ఒత్తిడితో

బీసీలకు రాజ్యాధికారం దిశగా ఆలోచించే శక్తి సన్నగిల్లుతున్నదా? వారికి చట్టసభలలో 50 శాతం రిజర్వేషన్లు, ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, క్రీమీ లేయర్ విధానం ఎత్తివేత, కులగణన వంటి పలు డిమాండ్‌లు సాధించేందుకు సదస్సుల వంటి అనేక యత్నాలు చేస్తున్నప్పటికీ అవి విఫలం అవుతూనే ఉన్నాయి. ఎన్నికలపుడు బీసీ నాయకుల మద్దతు తీసుకొని గెలవడానికి అగ్రవర్ణ రాజకీయ నాయకులు చక్రం తిప్పుతున్నారు. బీసీ నాయకులు, ప్రజలు ఎవరికి వారు ప్రశ్నించుకోవలసిన సందర్భం ఏర్పడింది. బీసీ నాయకులు రాజ్యాధికారం సాధించే విధంగా యత్నాలు చేయడం లేదు. బీసీలలో రాజకీయ చైతన్యం పెంపొందించి, పాలకవర్గంలో భాగస్వాములు చేయాలనే కృషి జరగడం లేదు. అగ్రవర్ణ సామాజికవర్గాలు ఆర్థిక బలంతో అందరినీ సంఘటితం చేయడంలో, బీసీలను తమ వైపు తిప్పుకోవడంలో సఫలమవుతున్నారు. బీసీలు గత 72 సంవత్సరాలుగా రిజర్వేషన్లు, కులగణన కోసం పోరాడుతూనే ఉన్నారు. ఏదీ సాధించుకోలేకపోయారు. కులగణన చేస్తే బతుకులు మారుతాయి. లెక్కలు తేలుతాయి. బీసీలకు లబ్ధి చేకూరుతుందనే ఆశ ఉన్నప్పటికీ, అగ్రవర్ణాల ఒత్తిడితో కేంద్రం సానుకూలత చూపడం లేదు. బీసీల అభివృద్ధి జరిగినప్పుడే దేశం అగ్ర దేశంగా మారుతుంది.

ఆ కమిషన్ నివేదిక ప్రకారం

తెలుగు రాష్ట్రాల పభుత్వాలు కులగణన చేయాలని తీర్మానాలు చేయడం, ఏపీలో బీసీలకు దామాషా ప్రకారం కొన్ని పదవులు ఇవ్వడం సంతోషకరమే. కేంద్రం తీరు మార్చుకోవాలి. దేశంలో 3,743 హిందూ / హిందూయేతర కులాలున్నాయని 1978లో మండల్ కమిషన్ నివేదించింది. వీరి అభివృద్ధి కోసం 40 అంశాలతో ఒక నివేదికను తయారు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, 16 ప్రకారం వీరికి 27 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని సూచించింది. నివేదికను రాష్ట్రపతికి సమర్పించేనాటికి వెనుకబడిన తరగతుల సంఖ్య 3,843 కు చేరింది. ఆ నివేదికను అప్పటి అగ్రకుల ప్రభుత్వాధినేతలు అటకెక్కించారు. వీపీ సింగ్ ప్రభుత్వం ఈ సిఫార్సులను అమలులోకి తెచ్చింది.

1990 నుంచి ఉద్యోగాలలో, 2008 నుంచి కేంద్రీయ విద్యాసంస్థలలో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. మండల్ కమిషన్ నివేదిక ఇచ్చి 44 సంవత్సరాలవుతున్నా ఇంకా విద్యా, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు అమలు చేయడం లేదు. దేశ జనాభాలో 56 శాతంగా ఉన్న వీరి భాగస్వామ్యం రాష్ట్ర, కేంద్ర ఉద్యోగాలలో 21 శాతం మాత్రమే. 1993లో ఓబీసీలోని ఉన్నత శ్రేణులను రిజర్వేషన్ల నుంచి తొలగించి, వారి వార్షికాదాయం పరిమితిని లక్ష రూపాయలుగా పెట్టారు. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పెంచాలని జస్టిస్ రామ్‌నందన్ ప్రసాద్ కమిటీ సూచించినా నేటికీ, వారి ఆదాయ పరిమితి ఎనిమిది లక్షలు మాత్రమే. నిజానికి 30 లక్షలుగా ఉండాలి. క్రీమీ లేయర్ విధానం ఏర్పాటు చేసి బీసీలను ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలు, ప్రభుత్వాలు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల ప్రకారం బీసీ కులాలవారికి సామాజిక న్యాయం చేకూర్చాలి. లేదా రాబోయే ఎన్నికలలో మా సత్తా ఏమిటో చూపుతాం.

దుండ్ర కుమార స్వామి

B-Pharma, MSC (CR), LLB

జాతీయ అధ్యక్షుడు, బీసీ దళ్

9959 912341

Next Story

Most Viewed