వీగిపోతుందని తెలిసినా.. అవిశ్వాస తీర్మానం ఎందుకు?

by Disha edit |
వీగిపోతుందని తెలిసినా.. అవిశ్వాస తీర్మానం ఎందుకు?
X

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ‘ఇండియా’ కూటమి ఇటీవల అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీన్ని అనుమతించిన లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, అన్ని పార్టీల నేతలతో చర్చించి, తీర్మానంపై చర్చిస్తామని వెల్లడించారు. అయితే సర్కారును కూల్చివేసే బలం ప్రతిపక్షానికి లేనప్పుడు, ఈ అవిశ్వాసానికి అర్థం లేదని అధికారపక్ష నేతలు వాదిస్తున్నారు. ఇదంతా రాజకీయం మాత్రమే అని కొట్టిపారేస్తున్నారు. అయితే అవిశ్వాసం అంటే ప్రభుత్వాన్ని కూల్చివేయడం మాత్రమే కాదని.. అతి తీవ్రమైన సమస్యలపై ప్రభుత్వం చర్చించకుండా నిర్లిప్తంగా, నిష్క్రియాత్మక ధోరణిలో ఉన్నప్పుడు... ‘నో కాన్ఫిడెన్స్ మోషన్’ ద్వారా సర్కారును తట్టిలేపడమే కాకుండా.. సమస్య తీవ్రతను తెలియజేయవచ్చని, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చని విపక్ష నేతలు అభిప్రాయపడుతున్నారు.

ఆయుధంగా తీర్మానం

పార్లమెంటులో సంఖ్యాబలాన్ని చూస్తే అవిశ్వాసం వీగిపోతుందని ఇట్టే తెలిసిపోతుంది. ఆ విషయం ‘ఇండియా కూటమి’కి సైతం అవగతమే. 543 మంది సభ్యులు గల లోక్‌సభలో ప్రస్తుతం ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 330 మంది ఎంపీలు ఉన్నారు. కాంగ్రెస్‌తో కూడిన విపక్ష కూటమికి సుమారు 140 మంది ఎంపీల మద్దతు ఉన్నది. ఈ రెండు గ్రూపుల్లో లేని ఇతర పార్టీలకు 60 మంది ఎంపీలు ఉంటారు. అంటే ఈ అవిశ్వాసం నుంచి అధికార పక్షం ఈజీగా గట్టెక్కవచ్చు. ఈ పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందని, ప్రభుత్వం కూలిపోతుందని ఊహించేవారు ఎవరూ ఉండరు. అయితే మణిపూర్ అంశంపై చర్చ జరిగేలా విపక్షం ఈ అవిశ్వాస తీర్మానాన్ని ఆయుధంగా చేసుకుంటున్నది.

‘మణిపూర్’పై చర్చ కోసమే..

మణిపూర్ రాష్ట్రంలో దాదాపు రెండు నెలలుగా అంతర్యుద్ధమే జరుగుతున్నది. తెగల మధ్య తలెత్తిన వివాదం మూకుమ్మడి దాడులు, గృహ దహనాలు, లూటీల వరకు వెళ్లింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన యావత్ దేశాన్ని సిగ్గుపడేలా చేసింది. సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ విషయంపై యూరోపియన్ పార్లమెంట్ సైతం చర్చించింది. అయినా దేశంలో చర్చించకుండా చేయడాన్ని, ప్రధాని మౌనం వహిస్తుండడాన్ని ప్రతిపక్షం తప్పుపడుతున్నది. దీంతో మణిపూర్‌లో జరిగిన హింసాకాండతో సహా పలు అంశాలకు సంబంధించి ప్రధాని నుంచి సమాధానాలు రాబట్టేందుకు అవిశ్వాస తీర్మాన మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తున్నది.

27 సార్లు అవిశ్వాస తీర్మానాలు..

‘ప్రజాస్వామ్యం మనుగడకు అవిశ్వాస తీర్మానాలు అవసరం. వాటిని స్వాగతించాలి. ఇలాంటి తీర్మానాలు పీరియాడిక్‌గా రావాలి. ప్రభుత్వాలు వాటిని ఎదుర్కొని తీరాలి’ అంటూ తన ప్రభుత్వంపై ఆచార్య జేపీ కృపలాని ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై పార్లమెంటులో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చేసిన వ్యాఖ్యలివి.

ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకున్నా, కొన్ని కీలక అంశాలపై చర్చ జరగాలని భావించినా.. విపక్షపార్టీలు అరుదుగా అవిశ్వాస తీర్మానంపై స్పీకర్‌కు నోటీసు ఇస్తాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇదో కీలక ఘట్టం. చరిత్రను పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వంపై 27 సార్లు అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టారు. తాజా అవిశ్వాస తీర్మానం 28వది. 1962లో చైనాతో యుద్ధంలో భారత్‌ ఓడిపోవడంతో అప్పటి నెహ్రూ ప్రభుత్వంపై ఆచార్య కృపలానీ 1963లో మొదటిసారిగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ తీర్మానం వీగిపోయినా, నాలుగు రోజులపాటు 21 గంటలు చర్చ జరిగింది. సభలో బలాన్ని నిరూపించుకునే క్రమంలో ‘విశ్వాస తీర్మానం’పై జరిగిన ఓటింగ్‌లో ఓడిపోయి వీపీ సింగ్, వాజపేయీ ప్రభుత్వాలు మాత్రమే కూలిపోయాయి. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అత్యధికంగా 15 సార్లు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. 1979లో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ జరుగకుండా ప్రధాని మొరార్జీ దేశాయ్‌ ముందుగానే రాజీనామా చేశారు. పీవీ నరసింహారావు సైతం మూడుసార్లు ఈ గండం నుంచి గట్టెక్కారు. భారతదేశానికి ఇప్పటి వరకు 14 మంది ప్రధానమంత్రులు పని చేయగా, ఒక్క చౌదరి చరణ్‌సింగ్‌ మాత్రమే అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోలేదు.

అన్ని మార్గాలను పరిశీలించాకే..

మణిపూర్‌పై పార్లమెంటులో చర్చ జరిగేందుకు గల అన్ని మార్గాలను పరిశీలించామని, అవిశ్వాసం అనేది అత్యుత్తమ మార్గంగా కనిపించిందని విపక్ష కూటమి నేతలు చెబుతున్నారు. ఎన్డీఏను గద్దె దించడం కన్నా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నదే తమ లక్ష్యమని పేర్కొంటున్నారు. చర్చల్లో మణిపూర్‌లో అల్లర్లకు కారణాలు, ప్రభుత్వ వైఫల్యం, ఘటనల వాస్తవాలు లాంటి అనేక అంశాలు తెరమీదికి వస్తాయని చెబుతున్నారు. అవిశ్వాస తీర్మానం వల్ల ఓటింగ్‌లో ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీలేదు. కాకపోతే చర్చల సందర్భంగా మోడీ వ్యవహారశైలిని, ఫెయిల్యూర్స్‌ను ప్రతిపక్షాలు ఎండగట్టడం ఖాయంగా కనిపిస్తున్నది.

-ఫిరోజ్ ఖాన్,

రాజకీయ విశ్లేషకులు

96404 66464



Next Story

Most Viewed