వీహెచ్‌పీ షష్టిపూర్తి వేడుక..!

by Disha edit |
వీహెచ్‌పీ షష్టిపూర్తి వేడుక..!
X

లోక కళ్యాణం కాంక్షిస్తూ 1964లో శ్రీ కృష్ణాష్టమి నాడు విశ్వహిందూ పరిషత్ పురుడు పోసుకుంది. నాటి నుంచి నేటి దాకా ఆరు దశాబ్దాలుగా అప్రతిహత విజయాలతో ముందుకు సాగుతూ హిందూ సమాజాన్ని చైతన్యం చేస్తూ వస్తోంది. ఈ పరంపరలో 60 సంవత్సరాలు పూర్తి చేసుకుని షష్టిపూర్తి మహోత్సవాలకు సిద్ధమైంది. 2023 శ్రీకృష్ణ జన్మాష్టమి నుంచి 2024 శ్రీకృష్ణ జన్మాష్టమి వరకు విశ్వహిందూ పరిషత్ షష్టిపూర్తి మహోత్సవాలు దేశంలోని గ్రామ గ్రామాన నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

దినదినాభివృద్ధి చెందుతూ..

విశ్వహిందూ పరిషత్.... ఈ పేరు ఇటీవల కాలంలో ప్రపంచ దేశాల్లోని ప్రజల నోళ్లలో నానుతున్న ధార్మిక పదం.... అయోధ్య రామ జన్మభూమి కేసు సుప్రీంకోర్టులో విజయం సాధించిన 2019 నవంబర్ 9 నుంచి మొన్నటి రామ మందిర నిర్మాణ భూమి పూజ (ఆగస్టు 5, 2020) నాటికి అందరి మదిలో మెదిలి.. చర్చకు మూలమైన విశ్వహిందూ పరిషత్ గురించే.... 1964లో శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభ పర్వదినాన ఆర్ఎస్ఎస్ రెండవ చీఫ్ మాధవ సదాశివ గోల్వాల్కర్ (గురూజీ) నేతృత్వంలో విశ్వహిందూ పరిషత్ పురుడుపోసుకుంది.. ముంబై మహానగరంలోని సాందీపని ఆశ్రమం వేదికగా సంస్థకు అంకురార్పణ జరిగింది. మొట్టమొదట స్వామి చిన్మయానంద సరస్వతి అధ్యక్షులుగా వీ.హెచ్.పీ కార్యక్షేత్రంలోకి అడుగుపెట్టింది. అనేక మైన సంఘర్షణలు, ఆందోళనలు, నిర్మాణాత్మక కార్యక్రమాలతో... దినదినాభివృద్ధి చెందుతూ ...శాఖోపశాఖలుగా దేశవ్యాప్తంగా విస్తరించి... సమాజమంతా ప్రభావిత స్థాయిలో వేళ్ళకు పోయేలా తన కృషి అమోఘం అయిందని చెప్పవచ్చు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనుబంధంగా ఉంటూ ...ధార్మిక సామాజిక సేవా రంగాల్లో కార్యకలాపాలు విస్తరించింది. దాదాపు 27 ప్రధాన విభాగాల్లో హిందూ జీవన విధానంపై ప్రపంచానికి అవగాహన కల్పిస్తూ నిస్వార్థ కృషి సల్పుతున్నది. 1983లో వీ.హెచ్.పీ ప్రతిష్టాత్మకంగా ఏకాత్మతా యజ్ఞం నిర్వహించింది. ఆ సంవత్సరం నవంబర్ 16 నుంచి డిసెంబర్ 16 వరకు సామాజిక సమరసతా భావం నింపేందుకు... అంటరానివారు, దళితులు అనే భావన విడనాడి సకల హైందవ జాతి ఒక్కటే అని చాటి చెప్పింది. సామాజిక దురాచారాలను రూపుమాపేందుకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో రూపొందించింది....

అయోధ్య ఉద్యమం

గ్రామ గ్రామంలో కరసేవకులు, రామ భక్తులను తయారుచేసి హైందవ వీరులను తీర్చిదిద్దింది వి.హెచ్. పి. 1985 డిసెంబర్ లో మందిర నిర్మాణం కోసం రామజన్మభూమి న్యాస్ ఏర్పాటు చేసింది. జగద్గురు రామనందాచార్య, శివరామాచార్యజి మహారాజ్, అశోక్ సింఘాల్ వంటి బలమైన ధార్మికవేత్తల నేతృత్వంలో లక్షలాది సాధుసంతులు, స్వయం సేవకులు ఉద్యమించారు. చిట్టచివరగా న్యాయబద్ధంగా దేశ అత్యున్నత న్యాయస్థానం భారత సుప్రీంకోర్టులో 2019 నవంబర్ 9న అయోధ్య ను సాధించిన ఘనత వీహెచ్‌పీదే ఏకాత్మక యజ్ఞం, మీనాక్షి సంఘటన, అయోధ్య ఉద్యమం ద్వారా హిందువులను కదిలించింది. ఈ మూడు ఉద్యమాల్లో విజయం సాధించింది. హిందువులకు ఆత్మవిశ్వాసం భరోసాను కల్పించింది. 1975లో సత్య వ్రతం నిర్వహించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు తిరుపతి కేంద్రంగా 1985 ,1988 సంవత్సరాల్లో హిందూ మహా సమ్మేళనాలు నిర్వహించింది. లక్షలాదిగా పాల్గొన్న హైందవ సోదరులు హిందూ సంఘటన కోసం ప్రతిజ్ఞ తీసుకున్నారు... 1975లో కర్నూలులో జ్ఞానపీఠం ఏర్పాటు చేసింది వి. హెచ్. పి. బాల బాలికల సంక్షేమం కోసం గిరిజన వికాస కేంద్రం ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా అనాధ ఆశ్రమాలు, ఆవాసాలు ఏర్పాటు చేసి.. ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా నిర్వహిస్తోంది. గంగానది పవిత్రతను కాపాడాలని భారతమాత, గంగామాత యాత్ర నిర్వహించింది. దేశం నలుమూలల నుంచి ఆయా ప్రాంతాల్లోని నదుల నుంచి జలాలు తీసుకుని వచ్చి గంగలో కలిపి ప్రతిజ్ఞ చేసింది. గంగానది పవిత్రతను, ప్రాముఖ్యతను వివరిస్తూ దేశంలో మొట్టమొదటిసారిగా ఉద్యమం చేపట్టింది.

దేశం కోసం.. ధర్మం కోసం

గోమాత హిందువులకు ప్రత్యక్ష దైవం కాబట్టి గోసంతతిని కాపాడేందుకు.. బజరంగ్‌దళ్ కార్యకర్తలు, అహర్నిశలు కృషి చేస్తున్నారు. గోవులే కాదు ప్రకృతిలోని ప్రాణికోటి, జీవకోటిని సంరక్షించేందుకు కంకణం కట్టుకొని పనిచేస్తోంది. సామాజిక అసమానతలు, ఆర్థిక ఒడిదుడుకులు, నిరక్షరాస్యత, తెలియనితనం, అవగాహన లోపం కారణంగా.. హిందూ సమాజంలోని చాలామంది ధర్మాన్ని వీడుతున్న హిందువులను మళ్లీ స్వధర్మంలోకి తీసుకువచ్చేందుకు ఘర్ వాపసీ నిర్వహించి స్వధర్మం లోకి మళ్ళీ ఆహ్వానిస్తోంది.

లవ్ జిహాద్ వలలో చిక్కుకున్న అమ్మాయిలకు కళాశాలలో, విద్యాలయాల్లో, అవగాహన కల్పిస్తూ ..తమను తాము రక్షించుకునే ఆత్మస్థైర్యాన్నిస్తూ.. వారిలో చైతన్యం నింపుతుంది. దేవాలయాల్లో జరిగే అక్రమాలు, అన్యాయాలను నిలదీస్తూ ఆలయాల పవిత్రతను కాపాడుతోంది. ప్రభుత్వం పోలీసుల నుంచి వేధింపులు సైతం ఎదుర్కొని హిందూ సంఘటనం కోసం విశ్వహిందూ పరిషత్ పని చేస్తోంది. కార్య విస్తరణలో వేలాదిమంది పూర్తి సమయ కార్యకర్తలు వారి జీవితాలను దేశం కోసం, ధర్మం కోసం, పవిత్రమైన మనసుతో త్యాగం చేస్తున్నారు. విశ్వహిందూ పరిషత్ ప్రచారకులు హిందూ రక్షణ యజ్ఞంలో సమిధలుగా మారుతున్నారు. ధర్మ సంస్థాపననే లక్ష్యంగా పనిచేస్తున్న సంస్థ వచ్చే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలనే తపనలో విశ్వహిందూ పరిషత్ వేస్తున్న అడుగులు విజయ తీరాలను చేరాలన్నది సంకల్పం.

(నేడు విశ్వహిందూ పరిషత్ ఆవిర్భావ దినోత్సవం)

పగుడాకుల బాలస్వామి,

ప్రచార ప్రముఖ్, వీ.హెచ్‌.పీ

99129 75753



Next Story