ఆగుతూ..సాగుతూ.. బదిలీలు, పదోన్నతులు

by Disha edit |
ఆగుతూ..సాగుతూ.. బదిలీలు, పదోన్నతులు
X

గత 25 ఏళ్లుగా స్కూల్ అసిస్టెంట్ క్యాడర్‌లో విధులు నిర్వహిస్తున్న రవీందర్ ఈ పదోన్నతుల షెడ్యుల్‌లో తనకు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా పదోన్నతి పొందవచ్చునని ఆశపడ్డాడు.. అలాగే వచ్చే ఏడు మార్చిలో పదవీ విరమణగావిస్తున్న సుజాత పదోన్నతి పొందవచ్చునన్న ఎన్నో ఏళ్ల ఆశ అవిరికానుందా? అంటే అవుననే అంటున్నారు ఉపాధ్యాయులు. పదోన్నతులు, బదిలీలు జరుగుతాయా, అగుతాయా? అనే సంశయంలో వారు కొట్టుమిట్టాడుతున్నారు. కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్లు వీటికి అనేక కారణాలున్నాయి.

ఆశలు అడియాసలేనా?

రాష్ట్ర ప్రభుత్వం చాలా ఏళ్ళ తరువాత ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు ఈ ఏడాది జనవరిలో షెడ్యూల్ ప్రకటించింది. కొన్ని రోజులు ప్రక్రియ సజావుగా సాగినా స్పౌజ్ పాయింట్ల విషయంలో నాన్ స్పౌజ్ టీచర్లు కోర్టును ఆశ్రయించడంతో ఈ ప్రక్రియను నిలిపివేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. వాయిదాల మీద వాయిదాల ఆనంతరం ఆగస్టులో కోర్టు ఉపాధ్యాయ సంఘాల నాయకులకు ఇచ్చే ప్రత్యేక పాయింట్లను తొలగిస్తూ బదిలీలు, పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం తిరిగి షెడ్యూల్ ప్రకటించడంతో ఉపాధ్యాయుల్లో ఆశలు చిగురించాయి. ఇప్పటివరకు సక్రమంగానే సాగిన ప్రక్రియ కొంతమంది ఉపాధ్యాయులు సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా బదిలీల్లో అంగవైకల్యం శాతాన్ని 70 నుండి 40కి తగ్గించాలని, మ్యూచ్‌వల్‌లో బదిలీల్లో వచ్చిన ఉపాధ్యాయులు ప్రస్తుత బదిలీల్లో తమకు అవకాశం కల్పించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. స్టేని నిరాకరించడంతో ప్రధానోపాధ్యాయుల బదిలీలను ప్రభుత్వం పూర్తిచేసింది. ప్రధానోపాధ్యాయుల పదోన్నతులు పూర్తిచేసే క్రమంలో రంగారెడ్డి జిల్లా సీనియారిటీ జాబితాలో లోపాలున్నాయని కోర్టును ఆశ్రయించడంతో అక్టోబర్ 10 వరకు స్టే ఇవ్వడంతో జోన్-2లో బదిలీలు, పదోన్నతులు నిలిచిపోయాయి. ఒకవైపు పాలకుల, మరోవైపు అధికారులు, కోర్టు కేసులు వెరసి సగటు ఉపాధ్యాయుడు పదోన్నతి పొందకుండానే ఉద్యోగ విరమణ చేస్తున్న దుస్థితి నేడు నెలకొంది. సంవత్సరాలుగా ఒకే పాఠశాలలో పనిచేస్తూ బదిలీ కొరకు ఆశగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల ఆశలు అడియాశలుగానే మిగిలిపోనున్నాయి.

అడ్డంకికి కారణాలేంటి?

ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు 11 శాతం, పట్టణ ప్రాంతాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు 24 శాతం, మున్సిపాలిటీ పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులకు 17 శాతం ఇంటి అద్దె భత్యంను ప్రభుత్వం చెల్లిస్తున్నది. ఈ వ్యత్యాసమే ఉపాధ్యాయుల్లో పోటీకి కారణమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. విద్యావేత్తలు, పట్టణ ప్రాంతాల్లో పనిచేసే ఉపాధ్యాయులు సుదీర్ఘకాలం పనిచేసి ఇప్పుడు దూరప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుందని కావాలనే ప్రక్రియను ఆపాలని కోర్టును అశ్రయిస్తుండడం విస్మయానికి గురిచేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ మాసంలో ఎన్నికలకు వెళ్ళే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో అక్టోబర్ రెండో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందనే చర్చ జరుగుతున్నది. ఒకవేళ అదే జరిగితే ఈ ప్రక్రియ కొనసాగించడానికి ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇస్తుందో లేదో అనే అనుమానం ఉపాధ్యాయుల్లో ఆందోళనను కలిగిస్తున్నది. అందుకే ఇప్పటికైనా పాలకులు, అధికారులు ఒక నిర్దిష్టమైన విధివిధానాలు రూపొందించింది పకడ్బందీగా పదోన్నతులు, బదిలీలు జరపాలి. పలుకుబడి బదిలీలకు తావివ్వకుండా, బదిలీల్లో లబ్దిపొందడానికి తప్పుడు మెడికల్ ధృవపత్రాలు సమర్పించిన వారిపై శాఖాపరమైన చర్యలు చేపట్టాలి. ఇంటి అద్దె భత్యంలోని వ్యత్యాసాన్ని తగ్గించాలి. వృత్తినే దైవంగా భావిస్తూ విద్యార్ధులను అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న సగటు ఉపాధ్యాయుడి ఆకాంక్షలకు అనుగుణంగా త్వరలోనే పదోన్నతులు, బదిలీలు జరుగుతాయని ఆశిద్దాం.

- సుధాకర్.ఏ.వి

అసోసియేట్ అధ్యక్షులు STUTS

90006 74747

Next Story

Most Viewed