ఒక జననం, ఒక మరణం

by Disha Web Desk 13 |
ఒక జననం, ఒక మరణం
X

భారతదేశ చరిత్రలో ఏప్రిల్ 14 ఒక మైలు రాయి వంటిది. సమాజ మార్పు కోసం, సమాజ అభివృద్ధి కోసం పనిచేసిన, వారి జీవితాలను త్యాగం చేసిన ఎందరో మహనీయులు మహాత్మ జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ బాబు జగ్జీవన్ రామ్ వంటి వారికి నిలయమైన భరత భూమిలో, ఆ కోవకే చెందిన సమాజంలోని కుల వివక్షత, అంటరానితనం మనిషిని మనిషిగా చూడని హీనస్థితి మెరుగుపడాలని అహోరాత్రులు శ్రమించి బడుగు బలహీన వర్గాలకు సమన్యాయం జరిగేందుకు హక్కులు కల్పించి భరోసాను అందించే విధంగా ప్రపంచ దేశాల రాజ్యాంగాలను చదివి పరిశీలించి ఉత్తమమైన వాటిని భారత రాజ్యాంగంలో పొందుపరిచి అత్యున్నతమైన రాజ్యాంగాన్నిఅందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం.

కాగా, స్వతంత్ర భారతంలో రాజ్యాంగ మౌలిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వకుండా పాలకులు ఇష్టానుసారం పాలన కొనసాగిస్తూ అసమానతలు అంతరాలను పెంచి పోషిస్తున్న కాలంలో, అన్యాయం అక్రమం పేట్రేగిపోతున్న సమయంలో, ఉస్మానియా యూనివర్సిటీలో ఒక అరుణతార ఈ రోజునే నేలకొరిగింది. సమాజంలోని అపసవ్య ధోరణులను అధ్యయనం చేస్తూ, ప్రపంచ దేశాల విప్లవాలను ఆలకిస్తూ, లాటిన్ అమెరికా దేశాల విప్లవ వీరుడు చేగువేరా స్పూర్తిగా యూనివర్సిటీలలోనే సమాజ మార్పుకు నాంది పడాలని తన ఆచరణ ద్వారా చూపిస్తూ మతోన్మాద గుండాల చేతిలో బలి అయిన ఉస్మానియా అరుణతార, విప్లవ వీరుడు జార్జి రెడ్డి వర్ధంతి నేడు.

ప్రగతిశీల ప్రజాస్వామిక విద్యార్థి సంఘం స్థాపక కారకులు జార్జి రెడ్డి అమరుడైన రోజు. ఏప్రిల్ 14 ఒక ధ్రువతార వికసించిన రోజు, ఒక అరుణతార రాలిపోయిన రోజు. ఇద్దరి ఆశయాలు సమాజంలోని సమానత కోసమే, అంతరాలు లేని మానవీయ సమాజం కోసమే, ఇద్దరూ ప్రపంచ స్థాయి మేధావులే. ప్రజల బాగోగుల కోసం, సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచించిన ఆలోచన పరులే. సమాజ హితం కోసం అడుగు అడుగున పోరాడిన వీర యోధులే..

ప్రతి సంవత్సరం ఈరోజు నాకు ఒక సంఘర్షణను రేపుతోంది. ఒక సామాజిక విప్లవకారుని జననం, మరొక విప్లవకారుడు నేలకొరిగిన రోజు. ఒకరిదిపుట్టుక, ఒకరిది చావు.. ఇద్దరినీ ఒకే రోజు స్మరించుకోవడం సంఘర్షణ కాదా? సమీకరించు, బోధించు, పోరాడు అన్న నినాదంతో చైతన్యం కోసం పాటుపడిన వారు ఒకరు, జీనా హైతో మర్ నా సీఖో కదం కదం పర్ లడ్నా సీఖో అనే నినాదం ఇచ్చి విప్లవ ఆదర్శాలను అందించిన సాహసోపేతమైన శక్తి ఒకరు... ఈ ఇద్దరు మహనీయులు కూడా ఉన్నత చదువులను చదువుతూనే, ప్రతిక్షణం పేద వారి గురించి ఆలోచించారు. తమ స్వార్థం గురించి ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా తమ అమూల్యమైన జీవితాలను ప్రజల కోసం త్యాగం చేశారు.

ఇరువురి దారులు వేరైనా అంతిమ లక్ష్యం ఒక్కటే. మతములన్నియు మాసిపోవును, జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును అని గురజాడ గారన్నట్లు జ్ఞానం ద్వారానే జీవితానికి వెలుగు అని నమ్మిన వారే.. విద్య ద్వారానే అసమానతలు అంతరాలు తొలగిపోతాయి అని శాస్త్రీయ విద్యా విధానం కోసం ఒకరు పోరాడితే, రిజర్వేషన్ ఫలాలు అందించి అణగారిన వర్గాలు విద్యా గంధానికి నోచుకోవాలి అని కృషి చేసిన వారు మరొకరు.

కులం అణచివేతలు, కుల దురహంకార పీడనలు లేని ఆత్మగౌరవ సమాజం కోసం పోరాడిన సాంఘిక విప్లవకారుడు అంబేద్కర్ జీవితం.. దోపిడీ, పీడన లేని సమసమాజాన్ని కలలుగన్న విప్లవ స్వాప్నిక కార్యశీలి జార్జ్ రెడ్డి జీవితం ప్రస్తుత సమాజానికి ఆదర్శప్రాయం, అనుసరణీయం.. ఒకరు బాధిత కులంలో పుట్టి అన్యాయ అక్రమ అవమానాలను భరించి, కుల ఆధిపత్యానికి, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడడానికి తమ జాతిని, బాధితులను మరియు పీడితులను చైతన్య పర్చారు.. మరొకరు మధ్యతరగతి వర్గంలో జన్మించి, ఇబ్బందులు లేని జీవితాన్ని గడిపే అవకాశం ఉన్నా, పేదల, శ్రామికవర్గ గ్రామీణ కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థుల బాధలను అర్థం చేసుకునేందుకు వారి స్థాయికి దిగి సాధారణ జీవితాన్ని అనుభవించిన విద్యార్థి.

1972లో జార్జి రెడ్డిని మతోన్మాద సంఘ్ పరివార్ శక్తులు హత్య చేసిన పరిస్థితులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. యూనివర్సిటీలలో అణగారిన వర్గాల విద్యార్థులు ఉన్నత పరిశోధనలు చేయకుండా మానసిక క్షోభకు గురిచేసి బలవన్మరణాలకు పాల్పడే విధంగా చేయడం జరుగుతుంది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మరియు విద్యార్థి అమరవీరుడు జార్జిరెడ్డి ఆశించినట్టుగా ప్రజాస్వామిక ప్రజాతంత్ర శాస్త్రీయ విద్యా విధానం అమలు కావడం లేదు, అమలు చేసే పరిస్థితులు కూడా లేవు. కానీ ప్రజాస్వామిక విలువలు, మానవీయ విలువలు పెరిగి ఆదర్శవంతమైన సమాజం రూపుదిద్దుకోవాలంటే అంబేద్కర్, జార్జి రెడ్డి ల ఆశయాలను తప్పక నెరవేర్చాలి. అందుకు వారి ఆలోచన విధానం అనుసరణీయం.

(నేడు అంబేద్కర్ జయంతి, జార్జిరెడ్డి వర్ధంతి)

- తండ సదానందం

టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్

99895 84665






Next Story

Most Viewed