సామాజిక శాస్త్రాన్ని మరిచారెందుకు?

by Disha edit |
సామాజిక శాస్త్రాన్ని మరిచారెందుకు?
X

ప్రపంచంలో భారతదేశానికి ఒక విశిష్ట స్థానం ఉండటానికి గల కారణం మన సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్ల విలువలు, జానపద రీతులు, భిన్నత్వంలో ఏకత్వాన్నీ కలిగి ఉండటమే. వీటి గురించి తెలిపేదే సామాజిక శాస్త్రం. సమాజ పరిణామ దశలను, మనుగడను, మానవ సంబంధాలను, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, సామాజిక అంశాలను గురించి ఇది వివరిస్తుంది. సమాజ మనుగడ సక్రమంగా కొనసాగేందుకు అంతర్గత సంబంధాలు, సంస్కృతీకరణ, సామాజీకరణ ఎలా ఉపయోగపడతాయో తెలుపుతుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో దేశంలో ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో విద్యా వ్యవస్థలోనూ సమాజ శాస్త్రానికి క్రమంగా గుర్తింపు కరువవుతున్నది.

క్రమంగా మన దేశ ఆచార వ్యవహారాలలో పెనుమార్పులు సంభవించి, రాబోవు తరాలకు వాటి గురించి తెలుసుకునే అవకాశం కూడా కనుమరుగవుతుందా? అనే అనుమానం కలుగుతున్నది. రోజుకో ఆవిష్కరణతో, శారీరక శ్రమకంటే మానసిక ఆలోచనకే ఎక్కువ విలువనిస్తున్న ప్రస్తుత తరుణంలో టెక్నాలజీకి సంబంధించి నూతన కోర్సులు పుట్టుకొచ్చినప్పటికీ, ఆంగ్లేయుల నుంచి స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టిన మహానీయులను మరువకుండా, వారి గురించి విద్యలో భాగంగా నేర్చుకుంటూనే ఉన్నాం కదా! అలాగే, మన ఉమ్మడి కుటుంబాలు, మన విలువలు, ఆచారాలు, సాంప్రదాయాలు, జానపద రీతులు, సంస్కృతిలో పలుమార్పులు సంభవించినప్పటికీ, వాటి వలన మనకు కలిగిన ఉపయోగం, గౌరవాలను రాబోయే తరాలవారికీ అందించాల్సిన ఆవశ్యకత లేదా? ప్రభుత్వాలు ఈ విషయం మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం ఉన్నది.

అవకాశం, అవసరం ఉన్నా

గ్రామీణ ప్రాంతాల సాదకబాధకాలు, సామాజిక సమస్యల పరిష్కారమార్గాలు, సమాజాభివృద్ధికి సంబంధించిన విషయాలను సామాజిక శాస్త్రంలో భాగంగా నేర్చుకోవచ్చు. అందుకే ఈ కోర్సు సమాజాభివృద్ధికి తోడ్పడే వీలున్నది. గతంలో ఇంటర్, డిగ్రీ, పీజీ స్థాయిలో ఈ కోర్సుకు ప్రాధాన్యం ఉండేది. ఉత్తర భారతంలోనూ డిమాండ్ ఉంది. కానీ, నేడు దీనికి దక్షిణ భారతంలో అంతటి ప్రాధాన్యం లేదు. మన రాష్ట్రంలో ఉస్మానియా, కాకతీయ, శాతవాహన యూనివర్సిటీలు మాత్రమే ఈ కోర్సును అందిస్తున్నాయి.

ఇంటర్, డిగ్రీ కళాశాలలలో ఎక్కడా దీని జాడలేదు. అందుకే ఈ కోర్సు చదివేందుకు విద్యార్థులు నిరాసక్తత చూపుతున్నారు. చదివినవారికీ ఉపాధి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అన్ని కళాశాలలో సామాజిక శాస్త్రాన్ని బోధనాంశంగా పెట్టాలనే కేంద్ర ప్రభుత్వం ఆలోచన ముందుకు సాగడం లేదు. పోటీ పరీక్షలలో సామాజిక శాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నారు. ఉపాధ్యాయ శిక్షణా కోర్సులలో సామాజిక శాస్త్రాన్ని ఒక సబ్జెక్టుగా పెట్టినప్పటికీ, బోధకుల కొరతతో ఫలితం ఉండడం లేదు.

అనేక రకాల అధ్యయనాలకు

గ్రామాభివృద్ధికి సంబంధించిన పలు రకాల అంశాలను అధ్యయనం చేయడానికి సామాజిక శాస్త్రం తోడ్పడుతుంది. మానసిక రోగులను పరీక్షించడానికి దోహదపడుతుంది. ప్రతి దవాఖానాలో ఒక సామాజిక శాస్త్ర నిపుణుడు తప్పక ఉండాలి. ఎంతో ఒత్తిడికి గురవుతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను మానసికంగా ఉల్లాసపరచడానికి సైతం ఈ శాస్త్రం ఉపయోగపడుతుంది. పరీక్షలలో తప్పామని కొందరు, అనుకున్న ర్యాంక్ రాలేదని మరి కొందరు, చదువుకోవాలనుకున్న కాలేజీలో సీటురాలేదని ఇంకొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.

వారికి ఈ శాస్త్రం పట్ల అవగాహన లేకపోవడమే అందుకు కారణం. ప్రతి విద్యార్థి సామాజిక శాస్త్ర నైపుణ్యాన్ని పెంపొందించుకునేలా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. దేశంలోని అన్ని జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలలలో ఈ కోర్సును ప్రవేశపెట్టాలి. చదివినవారికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇందుకోసం సామాజికవేత్తలు, సామాజిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మేధావులు, ప్రముఖులు, విద్యావంతులు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలి. సామాజిక శాస్త్ర ఆవశ్యకతను తెలియజేయాలి. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో ఈ కోర్సును ప్రవేశపెట్టడానికి కృషి చేయాలి.

డా. పోలం సైదులు ముదిరాజ్

M.A.,B.Ed.,Ph.D.

94419 30361

Next Story

Most Viewed