- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ పెళ్లి ఆర్భాటం కాదు.. ఆదర్శం!
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అబ్దుల్ ముకీత్ చందా తన కుమారుడి వివాహాన్ని అత్యంత సాదాసీదాగా నిర్వహించి, ఆదా చేసిన రూ.50 లక్షలను 'గిఫ్ట్ ఎ స్మైల్' కార్యక్రమం ద్వారా 300 మంది ప్రతిభావంతులైన పేద విద్యార్థుల విద్య కోసం విరాళంగా అందించి సమాజానికి ఆదర్శంగా నిలిచారు.

ఒక మధ్యతరగతి పెళ్లి అయినా సరే ఈ రోజుల్లో లక్షల ముచ్చట. మరి కోట్లు ఉన్న వ్యాపారవేత్తల ఇంట్లో పెళ్లంటే? అలంకారాలు, బ్యాండ్ బాజాలు, వందల రకాల వంటకాలు, ఆడంబరాలు.. ఇవే కదా మనకు గుర్తొచ్చేవి! కేవలం కొన్ని గంటల హంగూ ఆర్భాటాల కోసం లక్షలు, కోట్లు నీళ్లలా ఖర్చు పెట్టే రోజులివి. కానీ, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త అబ్దుల్ ముకీత్ చందా మాత్రం అందరిలా ఆలోచించలేదు. సమాజం మెచ్చేలా కాకుండా, సమాజానికి మేలు జరిగేలా ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడి వివాహాన్ని నాంపల్లిలోని మస్జిద్-ఏ-బాఘేలో అత్యంత సాదాసీదాగా, సాంప్రదాయబద్ధంగా జరిపించారు. ఆ పెళ్లి వేడుకల్లో తగ్గించిన ప్రతి రూపాయిని కలిపి.. ఏకంగా 50 లక్షల నిధిగా మార్చి.. ఆ డబ్బును ‘సర్ సయ్యద్ మైనారిటీస్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ’ ఆధ్వర్యంలో ‘గిఫ్ట్ ఎ స్మైల్’ కార్యక్రమం ద్వారా ప్రతిభావంతులైన పేద విద్యార్థుల చదువుల కోసం విరాళంగా ప్రకటించి నిజమైన ‘గొప్ప మనసు’ను చాటుకున్నారు. ఆర్భాటాల పెళ్లిళ్లకు వెళ్తే కాసేపు కడుపు నిండుతుంది, కానీ ముకీత్ చందా చేసిన ఈ పనితో ఫీజులు కట్టలేక, చదువు మధ్యలోనే ఆగిపోతుందేమోనని భయపడుతున్న అనాథలు, ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన 300 మంది విద్యార్థుల జీవితాల్లో చదువుల వెలుగులు నిండాయి. ఆయన చేసిన ఈ పని ఎందరికో స్ఫూర్తి. "మనం కూడా మన ఇళ్లలో జరిగే వృథా ఖర్చులను తగ్గించి, సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలి" అనే ఆలోచనను ఈ ఘటన చాలా మందిలో రేకెత్తించింది. పెళ్లి అనేది కేవలం రెండు మనసుల కలయిక మాత్రమే కాదు.. అది సమాజంలో ఒక మంచి మార్పుకు కారణం కావాలని నిరూపించిన అబ్దుల్ ముకీత్ చందాకి, వారి కుటుంబానికి అభినందనలు. ఈ ఆదర్శం మరికొందరిలో స్ఫూర్తి నింపాలని ఆశిద్దాం!
-ముహమ్మద్ ముజాహిద్
96665 02183






