ఎన్నికల్లో ఓడిన.. అధికారం వారికే!

by Disha edit |
ఎన్నికల్లో ఓడిన.. అధికారం వారికే!
X

ఓటు వేసిన ప్రజలు ప్రజాస్వామ్య స్వేచ్ఛను కోల్పోతున్నారు. మన నియోజకవర్గానికి పనికి రాడని ఓటుతో తీర్పు ఇచ్చినా... ఓడిన అభ్యర్థి ఇప్పుడు మేకు అయ్యి కూర్చోవడం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. నేతలారా.. ప్రజా తీర్పును గౌరవించండి.... ఓటు విలువను చంపేయకండి.. ఇది ప్రజాస్వామ్యానికి అసలు మంచిది కాదు.

ఓడిన అభ్యర్థి ఇప్పుడు విన్నర్... గెలిచిన అభ్యర్థి లూజర్.. రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త సంస్కృతి ఏర్పడింది. ఈ నూతన సంప్రదాయంతో ఓటు కన్నీరు పెట్టుకుంటుంది. ఇక ఓటర్లు మాత్రం చాలా పరేషాన్‌లో పడ్డారు.

ఓడిన అభ్యర్థి అధికారం చెలాయించటమా?

అంబేద్కర్ ప్రజాస్వామ్యంలో ప్రజలకు సత్వర న్యాయం, సంక్షేమం, భద్రత అందించడానికి ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చారు. ఈ ఓటు ద్వారా ప్రజలు వారికి కావాల్సిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించారు. అయితే ఇప్పుడు ఏర్పడుతున్న ప్రభుత్వాలు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండాలి. ప్రజలు తమ ఓటుతో ఇచ్చిన తీర్పును తృణీకరించడం ప్రజలను అవమానానికి గురి చేయడమే.

2023 ఎలక్షన్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయిన చోట కూడా తమ అధికారమే నడిచేలా, ప్రజా తీర్పులో ఓటమి పాలైన అభ్యర్థి ఇప్పుడు అధికారం చలాయిస్తున్నారు. దీంతో ప్రజా తీర్పుతో గెలిచిన ఎంఎల్ఏకు అధికారులు ఎవరూ మర్యాద ఇవ్వడం లేదు. గెలిచిన ఎంఎల్ఏ ప్రజా సమస్యలకు సంబంధించి ఫిర్యాదు చేస్తే వాటిని పట్టించుకోకుండా ఓడిపోయిన అధికార పార్టీ అభ్యర్థి మాటకు విలువను ఇస్తూ చాలా సందర్భాల్లో అధికారులు ప్రజా తీర్పును అవమాన పరుస్తున్నారు.

ఆయన చెప్పితే అక్రమూ సక్రమమే...

హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఓ నియోజకవర్గంలో కాలనీ వాసుల సమస్యలఫై స్థానిక ఎంఎల్ఏ అధికారులను కోరినా పట్టించుకోలేదు, ఓడిపోయిన అభ్యర్థితో ఫోన్ చేయించాలని అధికారులు చెప్పడంతో వారు షాక్ తిన్నారు. మరో నియోజకవర్గంలో - ఓ సందర్భంలో ఓడిపోయిన అభ్యర్థి కాలనీ వాసులకు ఎదురుపడి మీరు నాకు ఓట్లు వేయలేదు, మీ కాలనీ సమస్యలు ఎలా తీరుతాయో అని బహిరంగంగా చెప్పడం స్థానికులను భయాందోళనకు గురి చేసింది.

ఇంకో శివారు నియోజకవర్గంలో ఓడిపోయిన పార్టీ అభ్యర్థి ఫోన్ చేస్తే చాలు అక్రమాలు కూడా సక్రమం అవుతున్నాయి. ఆయన ఫోన్ చేస్తే అధికారులు ఎనీ టైం జీ హుజుర్ అంటున్నారు. దీంతో నియోజక ప్రజలు మనం తీర్పు ఇస్తే గెలిచిన అభ్యర్థి డమ్మీ అయ్యాడు, ఓడిన అభ్యర్థి పవర్ ఫుల్ అయ్యాడని తలలు పట్టుకుంటున్నారు.

ఈ సంస్కృతి పాపం గత ప్రభుత్వానిదే

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల ఎంఎల్ఏలకు పనులు చేయొద్దని అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారనే ఆరోపణలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఆ విష సంస్కృతిని ఫాలో కాకుండా జాగ్రత్త పడాలి. రాజకీయాలు పక్కన పెడితే ఓటు వేసిన ప్రజలు ప్రజాస్వామ్య స్వేచ్ఛను కోల్పోతున్నారు. సరైన నిర్ణయం తీసుకున్నామనే సంతృప్తిని పొందలేకపోతున్నారు. ప్రజా తీర్పును గౌరవించండి.... ఓటు విలువను చంపేయకండి.. ఇది ప్రజాస్వామ్యానికి అసలు మంచిది కాదు.

-గొట్టిముక్కుల సుధాకర్ గౌడ్,

సీనియర్ జర్నలిస్ట్...

90521 16459

Next Story