సామాజికం: జీవిత నాశిని పోర్నోగ్రఫీ

by Disha edit |
సామాజికం: జీవిత నాశిని పోర్నోగ్రఫీ
X

'పోర్న్ చిత్రాలు చూసేవారు తమవారికి క్రమంగా దూరమవుతూ ఒంటరితనానికి అలవాటు పడతారు. ఎక్కువ సమయం పోర్న్ చూడటానికే వెచ్చిస్తారు. జీవిత భాగస్వామిపై అభిమానం, ఆప్యాయతకి బదులుగా అనుమానం పెంచుకుంటారు. పదే పదే గొడవలు, గాయపరిచే సంఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువ. దీనిని మాన్పించకపోతే మరింత క్రూరంగా, జుగుప్సాకరంగా నిర్ఘాంతపోయేంత అమానవీయంగామారుతూ ఎందుకూ కొరగాకుండాపోతారు. వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, వృత్తి జీవితం దెబ్బతింటుంది.'

పోర్న్ పురుషులను విచక్షణ లేని కాముకులుగా మార్చి మహిళలకు మాత్రం నరకం చూపుతున్నది. దాంపత్య జీవితాలను ధ్వంసం చేస్తున్నది. వివాహేతర సంబంధాలకు దారితీసి సంసారాలకు హాని చేస్తున్నది. సెక్స్ అనేది సహజ కోరిక. అలాగని దానిని పరిమితం చేయలేం. వయస్సు, హార్మోనుల ప్రభావాన్నీ కాదనలేం. మహిళలు, పురుషుల సంబంధాల సాధారణ జీవ చక్రానికి విఘాతం కలిగిన సమాజంలో మనం ఇప్పుడు జీవిస్తున్నాము. గతంలో పురుషులు 21-22 సంవత్సరాలలో వివాహం చేసుకునేవారు, ఇప్పుడు 30 యేళ్ల ప్రారంభంలో చేసుకుంటున్నారు.

ఆడపిల్లలకు 18 యేళ్లకే పెళ్లిళ్లు జరిగేవి, ఇప్పుడు 25 యేళ్ల తర్వాతనే జరుగుతున్నాయి. సహజ ప్రవర్తన మారదు కదా! అశ్లీలం, హింస పెరగడానికి ఇలాంటి ఆధునిక మార్పులు చేర్పులు కూడా తోడవుతున్నాయి. టీనేజర్లు, యువతీ, యువకులు, మధ్యవయస్సులు, ముసలివారు, ఇలా స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న కోట్లాది మంది పోర్న్ వీడియోలను నిస్సిగ్గుగా వీక్షిస్తున్నారు. నెట్ ఓపెన్ చేయగానే కొన్ని వందల సైట్లు కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి.

చాలా దేశాలలో వీటి మీద నిషేధం, నియంత్రణలు లేవు. కొన్ని దేశాలు వయసు నియంత్రణ విధించగా, మరికొన్ని దేశాలు వాటికి ఫైర్ పాల్స్ నిర్మించుకొని అనుమతులు ఇస్తున్నాయి. నేడు పోర్నోగ్రఫీ ఇంటర్‌నెట్‌లో మిలియన్ డాలర్‌ల భారీ వ్యాపారంగా విరాజిల్లుతోంది. సెక్స్ కోరికలను సంతృప్తి పరిచే విధంగా మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది.

టాప్ దిశగా భారత్ అడుగులు

పోర్న్‌హబ్‌ను సందర్శించడంలో యూఎస్, బ్రిటన్ తర్వాత కెనడాను వెనుకకు నెట్టి భారత్ మూడో స్థానానికి చేరుకుంది. ఈ వీడియోలు చూసే యూఎస్, బ్రిటన్‌వాసుల సగటు సమయం 11 సెకన్లు కాగా, భారత్‌లో 9.30 నిమిషాలుగా ఉంది. ఆగస్ట్ 2022లో భారతీయులు ఈ సైట్‌లను మూడు బిలియన్ల కంటే ఎక్కువ మంది సందర్శించారు. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఈ సంఖ్య 73 శాతం అధికం. నెట్‌ వెబ్‌సైట్‌ ట్రాఫిక్‌లో పోర్నోగ్రఫీ ట్రాపిక్ 30 శాతం నుంచి 70 వరకు ఉంటోంది.

ఇది టెలికాం కంపెనీలకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది. కొవిడ్ కాలంలో మొదలైన పెరుగుదల ఎంతవరకు దారి తీస్తుందో చెప్పడం అసాధ్యం. అత్యాచారం, పిల్లలపై వేధింపుల వీడియోలను తీసివేయడానికి పోర్న్‌హబ్ నిరాకరించడాన్ని బహిర్గతం చేస్తూ నికోలస్ క్రిస్టోఫ్ డిసెంబర్ 2020లో 'న్యూయార్క్ టైమ్స్‌'లో రాసిన కథనం అంతర్జాతీయగా సంచలనం రేకెత్తించింది.

అప్పటి నుండి, మాస్టర్, వీసా వంటి క్రెడిట్ కార్డ్ కంపెనీలు మాంట్రియల్ ఆధారిత సైట్‌తో సంబంధాలను తెంచుకున్నాయి. పోర్న్‌ను పూర్తిగా ప్రభుత్వాలు నిషేధించాలా వద్దా అనే చర్చలో ఆర్థిక సంస్థలు భాగమయ్యాయి. వాస్తవానికి 93 శాతం పురుషులు, 62 శాతం విద్యార్థినులు 18 యేళ్లు నిండకముందే పోర్న్ చూస్తున్నారు.

లేత శరీరాల మీ భారీ పెట్టుబడి

పోర్నోగ్రఫీకి మొదటగా బలవుతున్నది అమాయక చిన్నారులు. సెక్స్ వర్కర్లు, డ్రగ్స్‌కు అలవాటుపడిన యువతను బలవంతంగా ఈ కూపంలోకి దించుతున్నరు. పిల్లలు పాత్రధారులు మాత్రమే. భారీగా డబ్బులు ఆశ చూపి వ్యభిచార రొంపిలోకి చేర్చడం అనాగరిక సంస్కృతిని సమర్థించేలా ఉంది. దీన్నంతా భావ ప్రకటనా స్వేచ్ఛగా, వ్యక్తిగతంగా ఎంపిక చేసుకొనే అవకాశంగానే చూడాలనడం ఎంతవరకు సబబో ప్రజాస్వామ్య ప్రియులు ఆలోచించాలి.

పిల్లలతో లైంగిక చర్యలు, వావి వరుసలు లేకుండా, సమాజం తలదించుకునే విధంగా రక్త సంబంధీకుల మధ్య శారీరక సంబంధాల చిత్రాలు, భిన్న వయసులవారి మధ్య సంబంధాలు, సేమ్ జెండర్‌లో సంబంధాలు, ట్రాన్స్‌జెండర్ మధ్య సంబంధాలు, రక్త సిక్త అత్యాచారాల చిత్రాలు, సామూహిక లైంగిక చర్యలు, శవాలు, జంతువులతో అనైతిక అనాగరిక చిత్రాలు ఉంటున్నాయని 'పోర్న్ దాని ఫలితాలు' అనే అధ్యయనం విశదీకరించింది.

ఇంకొందరు తమ తొలి రాత్రిని, ఇతరులతో పెట్టుకున్న సంబంధాలను కూడా అప్‌లోడ్ చేస్తూ వికృతానందాన్ని పొందుతున్నారు. మియా ఖలీఫా అనే ఒక మాజీ 'పోర్న్ స్టార్' అందమైన అమ్మాయిలను అశ్లీల పరిశ్రమ ఏ విధంగా నియంత్రిస్తుందో వివరించారు. 'యువతులను వేటాడి పట్టుకొని, వాళ్ల అవసరాలను ఆసరాగా చేసుకొని, ఉహించని విధంగా డబ్బులిచ్చి చట్టబద్దంగా లోబరచుకుంటారు. బయటపడటం కష్టతర వ్యవహారం' అని ఆయన వెల్లడించారు.

అంతా మాయాబజార్

పోర్న్ చిత్రాలు, సినిమాలలో కనిపించే దృశ్యాలు చాలావరకు ఫేక్ అనే విషయం ఎక్కువ మందికి తెలియనే తెలియదు. అదంతా భ్రమ. మాయాబజార్. మన మగ మహారాజులు వాటిని బాగా ఊహించుకొని బాధితులుగా మారుతున్నారు. మార్కెట్‌లో దొరికే అడ్డమైన, ఖరీదైన జెల్‌లు, మందులు వాడుతుంటారు. పోర్న్ చిత్రాల పరిశ్రమ అపార వ్యాపారం. కేవలం యునైటెడ్ స్టేట్స్‌లోనే యేటా 16.9 బిలియన్ డాలర్ ల ఆదాయం సమకూరుతోందనీ అంచనా.

కంప్యూటర్‌ ఉపయోగించే 28 శాతం మంది లైంగిక వెబ్ పేజీలను సందర్శిస్తారు. లైంగిక. అసభ్యకర, అశ్లీల చిత్రాలు ప్రసారం చేయడం, చూడడం భారతీయ చట్టాల ప్రకారం శిక్షార్హం, 1860-IPC, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) చట్టం- 2000, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (POCSO)-2012, మహిళల అసభ్య ప్రాతినిధ్యం (నిషేధం) చట్టం 1986 (IRWA)

సెక్షన్ 292 ప్రకారం వీటిని నిషేధించారు. సెక్షన్ 293, IT చట్టం-67B ప్రకారం 20 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి అశ్లీల పదార్థాల పంపిణీ, అమ్మకం శిక్షార్హంమే. చట్టవిరుద్ధం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం-2000 సెక్షన్ 67B ప్రకారం దేశవ్యాప్తంగా చైల్డ్ పోర్నోగ్రఫీ నిషేధించబడింది. సెక్షన్ 292, 293 ప్రకారం అశ్లీల చిత్రాల తయారీ, ప్రచురణ, పంపిణీ చట్టవిరుద్ధం .

జీవితం సర్వనాశనం

పోర్న్ చిత్రాలు చూసేవారు తమవారికి క్రమంగా దూరమవుతూ ఒంటరితనానికి అలవాటు పడతారు. ఎక్కువ సమయం పోర్న్ చూడటానికే వెచ్చిస్తారు. జీవిత భాగస్వామిపై అభిమానం, ఆప్యాయతకి బదులుగా అనుమానం పెంచుకుంటారు. పదే పదే గొడవలు, గాయపరిచే సంఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువ. దీనిని మాన్పించకపోతే మరింత క్రూరంగా, జుగుప్సాకరంగా నిర్ఘాంతపోయేంత అమానవీయంగామారుతూ ఎందుకూ కొరగాకుండాపోతారు.

వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, వృత్తి జీవితం దెబ్బతింటుంది. అందుకే ప్రభుత్వాలు పోర్న్ చిత్రాల సైట్లను సంపూర్ణంగా నిషేధించాలి. మత్తు పదార్థాల తయారీ, వినియోగం, రవాణాపై పూర్తి స్థాయి నియంత్రణ కఠినంగా అమలు చేయాలి. శాస్త్రీయ దృక్పథంతో కూడిన అవగాహన కల్గించడం అత్యవసరం. స్కూల్, కాలేజ్, విశ్వవిద్యాలయ ప్రాంగణాలలో మొబైల్ ఫోన్లు వాడకాన్ని తగ్గించాలి. తల్లిదండ్రులు పిల్లల ఎదుగుదల సమయాలలో ఆదర్శప్రాయంగా తాము మెలిగేలా చూసుకోవాలి.

డా. బి. కేశవులు. ఎండీ. ( సైకియాట్రీ )

చైర్మన్: తెలంగాణ మేధావుల సంఘం

జాతీయ యాంటీ డ్రగ్స్ సంస్థ.

99496 95189

Next Story

Most Viewed