- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

చింతాడ ఆనంద్ పాల్ కేసు తీర్పు విషయంలో సుప్రీంకోర్టు సామాజిక కోణాన్ని,రాజ్యాంగ నైతికతను విస్మరించింది. అయితే అత్యంత అణగారిన సామాజిక వర్గాల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించే విషయంలో న్యాయవ్యవస్థ భవిష్యత్తు దర్శనం చేసి, సానుకూలంగా తీర్పుని ఇవ్వవలసి ఉంటుంది. ఆనంద్ పాల్ (మాదిగ క్రైస్తవుడి) కేసు విషయంలో సుప్రీమ్ కోర్టు ఈ వైఖరి తీసుకోకపోవడం విచారకరం. ఇందుకు మూల కారణం 1950లో రాష్ట్రపతి జారీ చేసిన షెడ్యూల్డు కులాల జాబితాకు సంబంధించిన రాజ్యాంగ ఉత్తర్వులోని ఐడెంటిటీ ప్రాతిపదికలు కావొచ్చు.
వివక్షల నుంచి రాజ్యమే రక్షించాలి
షెడ్యూల్డ్ కులాల వారిని గుర్తించడానికి 1950ల నాటి రాష్ట్రపతి రాజ్యాంగ ఉత్తర్వు, 1936 నాటి బ్రిటీషు పాలకులు ఏర్పరిచిన ప్రాతిపదికలను అనుసరించింది. హిందువుల్లో అంటరానితనాన్ని ఎదుర్కొంటూ, అభివృద్ధిలో వెనకబడి పోయిన వారినే నాడు ఎస్సీలుగా గుర్తించారు.
ఇతర మతాల్లోనూ అంటరానితనం
చలనశీలత కలిగిన రాజ్యాంగం హిందూ మతంలోనే గాక అంటరాని కులాల వారు ఇతర మతాల్లోనూ ఉన్నారని కాలక్రమేణా గుర్తించడం స్వాగతించదగిన పరిణామం. ఈ విధంగా 1956లో శిక్కు మతాన్ని అవలంబిస్తున్న అంటరాని సమూహాలను, 1990లో బౌద్ధాన్ని అనుసరిస్తున్న అంటరాని సమూహాలను కూడా రాజ్యాంగ సవరణల ద్వారా షెడ్యూల్డ్ కులాలుగా గుర్తించే విధంగా రాష్ట్రపతి రాజ్యాంగ ఉత్తర్వులను సవరించారు. ఇది సరియైనది. స్వాగతించదగినది. కాగా, ఇదే ప్రాతిపదికలపై క్రైస్తవాన్ని, ఇస్లాం మతాలను అనుసరిస్తున్న అంటరాని సమూహాలకు కూడా షెడ్యూల్డు కులాల హోదా ఇవ్వవలసిన అవసరం ఎంతో ఉన్నది. అలా ఇవ్వకపోవడం వల్లనే చింతాడ ఆనంద్ పాల్ లాంటి లక్షలాది మంది రాజ్యాంగ సంరక్షణలు లేని కుల వివక్షలు, దాడులకు గురయ్యే పరిస్థితులు నేటికీ కొనసాగుతుండటం తీవ్ర ఆందోళనకరం.
మతస్వేచ్ఛ... రాజ్యాంగ ఉల్లంఘనే
క్రైస్తవం,ఇస్లాం తీసుకున్న త్రి వర్ణాల,శూద్ర ఆధిపత్య కులాల వారి సాంఘిక స్థాయిని వారు కోల్పోవడం లేదు లేదా మారడం లేదు. వెనకబడిన తరగతుల వారు, ఆదివాసులు కూడా క్రైస్తవం, ఇస్లాం మతాలలోకి వెళ్ళినపుడు ఈ సమూహాల సాంఘిక హోదాలు కూడా ఎటువంటి మార్పులకు గురికావడం లేదు. కానీ, షెడ్యూల్డ్ కులాల వారు క్రైస్తవం లేదా ఇస్లాం లోకి మారగానే వాస్తవంలో వారి సాంఘిక హోదా, పేదరికం, వివక్షా పరిస్థితులు మెరుగుపడనప్పటికీ, వారికి రాజ్యాంగం గుర్తించిన, కల్పించిన మునుపటి ఎస్సీ సాంఘిక హోదా రద్దయిపోతున్నది. బిసి(సి)గా మారిపోతున్నది. ఇందువల్ల, రాజ్యాంగం ద్వారా ఎస్సీలకు ఇవ్వబడిన విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ, సంరక్షణలను వారు కోల్పోతున్నారు. ఇలా ఎస్సీలకు ఉన్న మతస్వేచ్ఛను, రాజ్యాంగ సంరక్షణలను నిరాకరించడం అంటే, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుంది.
మతం మారినా కుల వివక్ష పోదు
హిందూ, సిక్కు, బౌద్ధం మతాలలోని వారికి షెడ్యూల్డ్ కులాల హోదా, రాజ్యాంగ సంరక్షణలు కల్పించడానికి వీలుగా, 1950 నాటి రాష్ట్రపతి (షెడ్యూల్డ్ కులాల) రాజ్యాంగ ఉత్తర్వులో క్రైస్తవం తీసుకున్న ప్రస్తుత ఎస్సీ కులాల వారిని కూడా చేర్చాలి. అప్పుడు మాత్రమే క్రైస్తవం తీసుకున్న మాదిగ కులస్తుడైన చింతాడ ఆనంద్ పాల్ లాంటి వారికి కులం పేరుతో జరుగుతున్న వివక్షలకు తగిన రాజ్యాంగ సంరక్షణలు కనీసం కాగితాల మీద నైనా గ్యారంటీ చెయ్యబడతాయి. 1950 రాష్ట్రపతి ఎస్సీల ఉత్తర్వు షెడ్యూల్డు కులాల వారికి ఉన్న మత స్వేచ్ఛను పరోక్షంగా పరిమితం చేస్తున్నది. నిరోధిస్తున్నది. మతం మారినా, కులం వివక్ష ఏమాత్రం పోని ఆనంద్ పాల్ లాంటి లక్షలాది మంది ఎస్సీ క్రైస్తవులకు, ఎస్సీ ముస్లింలకు ఇప్పటికైనా, వివక్షల నుంచి రక్షించే గతిశీలతతో రాజ్యాంగబద్ద సామాజిక న్యాయం కల్పించే దిశగా ఆలోచించాలి. అందుకు తగిన చర్యలు వేగంగా తీసుకోవాలి.
- కృపాకర్ మాదిగ
99483 11667






