ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలు ఫెయిల్

by Disha edit |
ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలు ఫెయిల్
X

సామాజికంగా వెనుకబాటుకు గురవుతున్న ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి వారి జనాభా దామాషా ప్రకారం వారి నిధులను వారికే కేటాయించి ఇతర వర్గాలతో అభివృద్ధి సూచీలలో ఉన్న వ్యత్యాసాలను తగ్గించడం కోసం దోహదపడేందుకు ఉద్దేశించిన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్‌కు 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. ఈ చట్టాలను రాష్ట్ర విభజన అనంతరం ఇరు రాష్ట్రాలకూ వర్తించడం జరిగింది. దీని ప్రకారం మారిన జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి వారి దామాషా ప్రకారం వార్షిక బడ్జెట్లలో నిధుల కేటాయింపులు చేయడం జరుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం తన ప్రాధాన్యతా పథకాలకు నిధులను మళ్ళించి, వాటిని ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఖర్చుల్లో చూపించడం వలన దళిత గిరిజన వర్గాల వారికి అవసరమైన పథకాలు అలక్ష్యానికి గురవుతున్నాయి. దళిత గిరిజనులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్న రాజకీయ పార్టీలు వారి అభ్యున్నతికి ఉద్దేశించిన చట్టాల విషయంలో మరింత శ్రద్ధతో వ్యవహరించాలి.

దేళ్ల క్రితం తూర్పు ఏజెన్సీలో కాళ్లవాపు వ్యాధితో పదుల సంఖ్యలో గిరిజనులు మృత్యువాత పడుతుండంతో అక్కడ పరిస్థితులపై సమీక్షించేందుకు ఐటీడీఏ అధికారులతో పాటు ఆ ప్రాంతాల్లో పర్యటించే ప్రయత్నం చేశాను. గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కమిటీ సభ్యునిగా పని చేసిన నేను, ఆ సందర్భంలో అధికారులను సమన్వయం చేస్తూ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనుల జీవన స్థితిగతులపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపడం జరిగింది. కాళ్ళ వాపు వ్యాధికి కారణాలను వైద్య బృందాలు పర్యవేక్షించారు. ఆ సమయంలో అనేక నమ్మలేని వాస్తవాలు బయటపడ్డాయి. వారి రక్త నమూనాలను సేకరించిన వైద్య బృందాలు హిమోగ్లోబిన్ శాతం రెండు నుండి ఆరుగా నిర్ధారించారు.

రక్తహీనత, పౌష్టికాహార లోపాలతో పాటు ఆహారపు అలవాట్లు లోనూ సగటు మనిషి కంటే ఎంతో వెనుకబాటుతనం కనిపించింది. మనుషులుగా జీవించడానికి అవసరమైన ప్రాథమిక వసతులు సైతం లేక వారు పడుతున్న అవస్థలు ఎంతగానో బాధించాయి. అప్పటి రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి చక్రధర్ బాబుతో మాట్లాడి ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల నుండి పౌష్టికాహార కిట్లు, వైద్య సదుపాయాలు, మౌలిక వసతుల కల్పన కోసం ప్రతిపాదనలను సబ్ ప్లాన్ నోడల్ ఏజెన్సీకి పంపించి వాటి విడుదలకు కృషి చేయడం జరిగింది.

70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎంతగానో అభివృద్ధి చెందామంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వాలకు మన సమాజంలో ఇంకా ఎంత వెనుకబాటుతనం ఉన్నదనే విషయం తెలపడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పక తప్పదు. సామాజికంగా వెనుకబాటుకు గురవుతున్న ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి వారి జనాభా దామాషా ప్రకారం వారి నిధులను వారికే కేటాయించి ఇతర వర్గాలతో అభివృద్ధి సూచీలలో ఉన్న వ్యత్యాసాలను తగ్గించడం కోసం దోహదపడేందుకు ఉద్దేశించిన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్‌కు 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రూపొందించిన చట్టాలు రాష్ట్ర విభజన అనంతరం ఇరు రాష్ట్రాలకు వర్తించడం జరిగింది. దీని ప్రకారం మారిన జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి వారి దామాషా ప్రకారం వార్షిక బడ్జెట్లలో నిధుల కేటాయింపులు చేయడం జరుగుతుంది.

ఎస్సీ ఎస్టీలకు తీరని అన్యాయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిధులను చట్టం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఖర్చు చేయడంలో అలక్ష్యం వహిస్తున్నది. వైసీపీ ప్రభుత్వం ప్రాధాన్యత పథకాలకు నిధులను మళ్ళించి, వాటిని ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఖర్చుల్లో చూపించడం వలన దళిత గిరిజన వర్గాల వారికి అవసరమైన పథకాలు అలక్ష్యానికి గురవుతున్నాయి. వారి విద్య, వైద్యం, గృహ నిర్మాణం, వ్యక్తిగత మరుగుదొడ్లు, తాగునీటి కల్పన, రోడ్డు సౌకర్యం వంటి వాటి విషయంలో పూర్తి న్యాయం జరగడం లేదు. గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థులకు సివిల్ సర్వీసుల్లో ఎంపిక అయ్యేందుకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు దేశంలోని అత్యుత్తమ శిక్షణ సంస్థలను ఎంపిక చేసి అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వడమే కాక వారికి నెలకు పదివేల నుండి రూ. 12,000 వరకు భృతి కూడా ఇవ్వడం వలన ఆ వర్గాలకు చెందిన అభ్యర్థులు ఎంతగానో ప్రయోజనం పొందారు. ఒక గ్రామంలో లేదా దళిత వాడలో ఒక వ్యక్తి సివిల్ సర్వీసులకు గాని గ్రూపు సర్వీసులకు గాని ఎంపిక అయితే ఆయా కుటుంబాలకు మాత్రమే గాక ఆయా ప్రాంతాల్లో కూడా భావితరాల వారికి ఒక ప్రేరణగా నిలుస్తుంది. ఉన్నత చదువులు చదువుకోవాలనే తపన ఉన్న అభ్యర్థులకు ఇది ఎంతో ప్రోత్సాహంగా నిలుస్తుంది.

గతంలో ఇచ్చిన స్వయం ఉపాధి పథకాలను ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించకపోవడంతో నిరుద్యోగ యువతకు ఉపాధి దొరకక ఇబ్బందులు పడుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో నేటికీ రోడ్లు లేని తండాలు అనేక ఉన్నాయి. సరియైన ఆసుపత్రులు లేని పరిస్థితి. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రతి మండల కేంద్రాల్లోనూ కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ప్రభుత్వం అందించేందుకు చర్యలు తీసుకుంటే వారికి ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. గర్భిణీ స్త్రీలలోనూ, ఐదేళ్లలోపు పిల్లల్లోనూ పౌష్టికాహార లోపంతో చనిపోతున్న వారిని రక్షించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ రకమైన చర్యలు తీసుకునేందుకు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పటిష్ట అమలు కోసం ఉద్దేశించిన జిల్లా మానిటరింగ్ కమిటీల ఏర్పాటుతోపాటు, సంబంధిత సమావేశాలను ప్రభుత్వం నిర్వహించడం లేదు. అంతేగాక అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షించి దళిత, గిరిజన వర్గాల అవసరాలను తెలుసుకుని వాటికి కావలసిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఉద్దేశించిన నోడల్ ఏజెన్సీల ఏర్పాటు, ఎస్సీ ఎస్టీ స్టేట్ కౌన్సిల్, హై లెవెల్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయం.

ఇప్పటికీ వారు ఓటు బ్యాంకులేనా?

ఒక సమున్నత ఆశయంతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కలలు కన్న విధంగా సామాజిక అసమానతలు రూపుమాపేందుకు, కుల రహిత సమాజం నిర్మాణం చేసేందుకు, సమాజంలో అణగారిన వర్గాలకు ఇతర వర్గాలకు వ్యత్యాసాలు తొలగించేందుకు, వారిని సమాజంలో తల ఎత్తుకొని జీవించే విధంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలు నీరుగారిపోవడం బాధాకరం. కేటాయించిన నిధులను మురిగిపోకుండాను, ఇతర పథకాలకు మళ్ళించకుండా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయాలి.

ఎందరో ఉద్యమాలు, త్యాగాలు ఫలితంగా ఏర్పడ్డ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం నిరుపేద దళిత గిరిజనులకు అక్కరకు వచ్చేందుకు అధికార ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. దళిత గిరిజనులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్న రాజకీయ పార్టీలు వారి అభ్యున్నతికి ఉద్దేశించిన చట్టాల విషయంలో మరింత శ్రద్ధ తో వ్యవహరించాలి. అనాదిగా వ్యవస్థీకృతంగా ఉన్న అణిచివేతలను, వెనుకబాటుతనాన్ని పారద్రోలేందుకు ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతను అవి విస్మరించ జాలవు. తక్షణమే ఉప ప్రణాళికల నిబంధనలను అనుసరించి పాలనా వ్యవస్థలను ఏర్పాటు చేసి ఉప ప్రణాళికలను పటిష్టంగా అమలు చేయాల్సిన బాధ్యతను ప్రభుత్వం గుర్తెరగాలి.

నేలపూడి స్టాలిన్ బాబు

మాజీ సభ్యులు, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కమిటీ

8374669988

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Next Story

Most Viewed