- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంద్రలోకం చేరిన ఇంద్రజాలం
లోకాన్ని తలపించేలా... అబ్రకదబ్ర అంటూ మనసులను కట్టిపడేసేది ఇంద్రజాలం. అలాగే అనేక సమస్యలకు హిప్నటిజం దివ్యౌషధం.

లోకాన్ని తలపించేలా... అబ్రకదబ్ర అంటూ మనసులను కట్టిపడేసేది ఇంద్రజాలం. అలాగే అనేక సమస్యలకు హిప్నటిజం దివ్యౌషధం. ఆ మాయాజాలం ప్రేక్షకుడి మస్తిష్కాన్ని తాకి, కాలాన్ని మరిచిపోయేలా చేస్తుంది. ఈ అద్భుతాలను ఆవిష్కరించిన వారిలో ముందున్న పేరే బీవీ పట్టాభిరామ్. ఈయన కేవలం వ్యక్తిత్వ వికాస నిపుణుడిగానే కాకుండా, పేరుగాంచిన ఇంద్రజాలికుడిగా, మానసిక నిపుణుడిగా తెలుగు ప్రజలకు సుపరిచితులు.. మానసిక శాస్త్రంలోని క్లిష్టాంశాలను సామాన్యులకు సుల భంగా అర్థమయ్యేలా వివరిస్తూ, సమాజంలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించేందుకు విశేష కృషి చేశారు. పుస్తకాలు, ప్రసంగాలు, టెలివిజన్ కార్యక్రమాల ద్వారా లక్షల మందిని ఉత్తేజపరిచారు. క్లిష్టమైన మానసిక శాస్త్ర అంశాలను సైతం సామాన్యులకు అర్థమయ్యేలా సుల భమైన శైలిలో వివరించడం ఆయన ప్రత్యేకత.
ఊరిలోంచి ఊహల ప్రపంచానికి..
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 'రావ్ సాహెబ్' భావరాజు సత్యనారాయణ సంతానంలోని పదిహేను మందిలో బీవీ పట్టాభిరామ్ ఒకరు.. కాకినాడలో ఉన్నత విద్య చదువుతున్న రోజుల్లో ఎంబేర్ రావు అనే ఇంద్రజాలికుడి నుంచి ఆ విద్యను నేర్చుకున్నారు. ఆత్మన్యూనతను విడిచి సమతుల్యంతో వైకల్యాన్ని జయించి సానుకూల దృక్పథాన్ని తాను అలవరుచుకొని జయించి తనని తాను ఇంద్రజాలికుడిగా, రచయితగా తీర్చిద్దుకున్నారు. ఇతరులలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించేందుకు విశేష కృషి చేశారు బీవీ పట్టాభిరామ్.. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఆహార సంస్థలో ఉద్యోగం చేసే రోజుల్లోనూ సాధన చేసేవారు.. 1970 దశకం నాటికి స్వతంత్రంగా రెండుమూడు గంటలపాటు ప్రేక్షకులను కదలనీయకుండా ఇంద్రజాలం ప్రదర్శించే స్థాయికి పట్టాభిరామ్ ఎదిగారు. చేతబడి వంటి మూఢనమ్మకాలపై ప్రజలను జాగృతం చేసే కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు. హిప్నాటిజాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చి పలు రుగ్మతలను పోగొట్టవచ్చని నిరూపించారు..
మానవతా మాంత్రికుడు..
అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ప్రోద్బలం, ప్రోత్సాహంతో ఇంద్ర జాలాన్ని జోడించి ప్రభుత్వ పథకాలకు, మద్యపాన నిషేధం వంటి కార్యక్రమాలకు ప్రచారం కల్పించారు.. గోదావరి వరద బాధితుల కోసం ప్రదర్శనలు ఇచ్చి తన మానవత్వాన్ని చాటుకున్నారు. 1984లో కళ్లకు గంతలు కట్టుకుని రవీంద్రభారతి నుండి చార్మినార్ వరకు స్కూటర్ నడిపిన ఘనత ఆయనదే. ఇది తెలుగు నాట మానసిక శాస్త్రాన్ని ప్రజల హృదయాలకు చేరువ చేసిన మైలురాయిగా నిలిచింది. ఆయన తెలుగుతో పాటు ఇంగ్లీష్, కన్నడ, తమిళ భాషల్లో కూడా రచనలు చేశారు. ఆయన విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహించడంతో పాటు, తల్లిదండ్రుల అవగాహనా సదస్సులు కూడా నిర్వహించారు..
ఎంతోమందిలో మానసిక స్థైర్యాన్ని నింపి..
బీవీ పట్టాభిరామ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పీహెచ్‌డీ పట్టా పొందిన తరువాత సైకాలజీ, ఫిలాసఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో స్నాతకోత్తర పట్టా అందుకున్నారు. ఇండియాలోనే కాకుండా.. అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, థాయ్‌లాండ్, సింగపూర్, అరబ్ దేశాలలో అనేక వర్క్ షాపులు నిర్వహించారు. ఫిలాసఫీ గైడెన్స్ కౌన్సెలింగ్, హిప్నోథెరపీలలో అమెరికా నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా పొందారు.. హిప్నోసిస్‌పై పట్టాభి రామ్ చేసిన కృషికి గానూ1983లో ఫ్లోరిడా విశ్వవిద్యాలయం ఈయనకు డాక్టరేట్ ప్రదానం చేసి సత్కరించింది. ‘ప్రశాంతి కౌన్సిలింగ్ అండ్ హెచ్.ఆర్.డి సెంటర్’ పేరుతో ఆయన ఎంతోమందిలో మానసిక స్థైర్యాన్ని నింపారు. అలాగే దూరదర్శన్‌లో కొన్ని సీరియళ్లతో పాటు పలు సినిమాల్లో నటించారు. సోమవారం ఆయన అనారోగ్యంతో మరణించడం విచారకరం. ఆయన శరీరాన్ని వదిలినా మనలో మానసిక విజ్ఞానాన్ని అజరామరంగా చేసిన మహానుభావుడు..
- వాడవల్లి శ్రీధర్
99898 55445






