కరుణామయుడు కాకా

by Disha edit |
కరుణామయుడు కాకా
X

ఆయన భారత స్వతంత్ర సంగ్రామంలో నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరుకు ఎన్నో లాఠీ దెబ్బలు తట్టుకొని, నిరోధాలు నిర్బంధాలను చవిచూసి తుపాకి గుండ్లకు ఎదురు నిలిచి జైలు గోడలను తరగతి గదులుగా భావించి, కష్టనష్టాలు ఓర్చి పేదలకు పెద్ద దిక్కుగా నిలిచారు. చిన్న వయసులో తండ్రి మరణంతో కుటుంబ బాధ్యత చేపట్టారు. భవన నిర్మాణ కూలీగా పనులు చేస్తూ, కాంట్రాక్టులు పట్టుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ అపారమైన సామాజిక స్పృహతో అనేక ఉద్యమాల్లో పాలుపంచుకుంటూ సమాజ నిర్మాణానికి ఇటుకలుగా మారారు. అట్టడుగు స్థాయిలో ఆరని ఆకలితో దుర్భర జీవితం గడిపిన నీడలేని నిరుపేదలకు కార్మికులకు కర్షకులకు గూడును నిర్మించి వారి గుండెల్లో కొలువైన మనసున్న మహావీర నేతగా గడ్డం వెంకటస్వామి అలియాస్ గుడిసెల వెంకటస్వామి, కాకాగా నిలిచిపోయారు.

ఆయన 1929 అక్టోబర్ 5న జన్మించారు. తన 12 ఏళ్ల వయసులో జాతిపిత మహాత్మా గాంధీని చూసి నిరాడంబరంగా బ్రతకాలని నిర్ణయించుకున్నారు. నిజాం సంస్థానంలో మొదటిసారి కాంగ్రెస్ విభాగాన్ని స్థాపించిన రామానంద తీర్ధ వంటి వ్యక్తులు తనకు ఆదర్శప్రాయం అని, కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా మారడానికి ప్రేరణ అని అనేక సందర్భాల్లో చెబుతుండేవారు కాకా. స్టేట్ యూత్ కాంగ్రెస్‌లో చేరి అనంతరం జరిగిన స్టేట్ కాంగ్రెస్ మొదటి సమావేశంలో పాల్గొని నిజాంకు వ్యతిరేకంగా జరిగిన సత్యాగ్రహ ఉద్యమంలో పాలుపంచుకున్నారు. ఆ ధైర్య సాహసాలు చూసిన కాంగ్రెస్ పెద్దలు యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమించారు.

పేదలకు బాసటగా నిలిచి..

నిజాం కాలంలో గ్రామాల్లో జాగీర్దార్లు, భూస్వామ్య శక్తుల దౌర్జన్యాలు, పెత్తనం పెరిగిపోయి ప్రజలు గ్రామాల్లో బ్రతకలేక హైదరాబాద్ నగరానికి వలసలు వెళ్లే వారి సంఖ్య పెరుగుతుపోయింది. గ్రామాల్లో వ్యవసాయంపై ఆధారపడిన పేదలు.. మహానగరంలో రిక్షాలు తోపుడు బండ్లు గుర్రపు బండ్ల పై ఆధారపడటం అత్యధికులు కూలీలుగా జీవించడం కనిపించేది. ప్రభుత్వ భూములు, పలువురు ఆక్రమించిన భూముల్లో గుడిసెలు వేసుకున్న నోరులేని నిరుపేదలను అదిరించి బెదిరించి అందినకాడికి దోచుకునే గుండాల సంఖ్య రోజురోజుకు పెరగడం డబ్బులు ఇవ్వాలని పేదలపై దాడులు చేయడం గుడిసెలను కూల్చడం అగ్నికి ఆహుతి చేయడం సర్వసాధారణంగా మారిపోయిన పరిస్థితులలో కాంగ్రెస్ నాయకుడిగా పేరున్న కాకా నిరుపేదలకు కనిపించారు. నిరుపేదల సమస్యలు విన్న కాకా పేదలకు అండగా నిలిచి కొండంత ధైర్యాన్నిచ్చి జులుం చేసే వారిపై దాడికి ప్రతిదాడి చేయడంలో ప్రేరణ ఇచ్చారు. నగరంలోని పలు ప్రాంతాల్లో నిరుపేదలు నివసించడానికి నిజాం వారసులతో, ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి బీద బిక్కి జనాలకు బాసటగా నిలిచి నీడ కల్పించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదల కోసం 1949లో మొదటిసారి జాతీయ గుడిసెల సంఘం స్థాపించి హైదరాబాద్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన బషీర్ బాగ్ పోరాటాన్ని మూడు లక్షల మందితో నిర్వహించి వేలాది ఎకరాల భూమిని నాలుగు లక్షలకు పైగా నిరుపేద కుటుంబాలకు అందించారు. అంతకుముందే పేదల ఉద్యమం ఉధృతం అవుతు జరిగిన పోరాట సమయంలో జరిగిన కాల్పుల్లో కొందరు మృతి చెందగా కాకా తీవ్రమైన గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. భూస్వామ్య గుండాలు కిరాయి హంతకులు కాకా పై కక్ష పెంచుకొని కక్ష సాధింపు చర్యలకు పాలుపడడం నిత్యకృత్యంగా మారిపోయినా.. ఎవరికీ తలవంచక తను నమ్మిన సిద్ధాంతం కోసమే నిజాయితీగా కృషి చేశారు.

సింగరేణితో ప్రత్యేక అనుబంధం

సిర్పూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం తదనంతరం ఐఎన్‌టీయుసీ వైస్ ప్రెసిడెంట్ గా, రాష్ట్ర అధ్యక్షుడిగా, కార్మిక నేతగా నిర్మాణ కార్మికులతో కలిసి పోరాటాలు చేయడం, సిద్ధిపేట నుండి ఎంపీగా గెలిచి తెలంగాణ ఇవ్వాలని పార్లమెంట్ వేదికగా గళం వినిపించారు. జెనీవాలో జరిగిన అంతర్జాతీయ కార్మిక సంస్థ సదస్సులో పాల్గొన్నారు. కేంద్ర కార్మిక పునరావాస పౌరసరఫరాల శాఖ సహాయ మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా, పెద్దపల్లి ఎంపీగా గెలిచి కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయమంత్రిగా, కేంద్ర జౌళి శాఖ మంత్రిగా (స్వతంత్ర హోదా) బాధ్యతలు చేపట్టారు. ప్రపంచంలోనే మొదటిసారిగా ప్రైవేట్ కార్మికుల కోసం పెన్షన్ పథకం అమలు చేశారు. సింగరేణి కార్మికులతో పెనవేసుకున్న పేగు బంధం కాకాది కార్మికుల కోసం కాకా ఎంతో కష్టపడ్డారు. కార్మికులు కార్మిక ప్రాంత ప్రజలు నేటికీ వారి కుటుంబాన్ని గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారు. 1990ల్లో నష్టాల్లో కూరుకుపోయిన సింగరేణి సంస్థ మూతపడే స్థితికి చేరుకుంటున్న సమయంలో కాకా ప్రత్యేక చొరవ చూపి ఎన్‌టీపీసీ ప్రతినిధులతో మాట్లాడి 400 కోట్ల రూపాయల రుణం అందించడంతో సిరుల మాగాణిగా సింగరేణి నిలిచింది. బాబా సాహెబ్ అంబేద్కర్‌తో కాకాకు నేరుగా పరిచయం, ఆయన అడుగుజాడల్లో నడిచి వారి మాటలకు అక్షర రూపం ఇస్తూ బడిపిల్లలకు బాసటగా నిలుస్తూ, కళాశాలను నిర్మించి గత ఐదు దశాబ్దాలుగా ఎంతో మందికి ఉచిత విద్యను అందించారు. ఇలా అనునిత్యం పేద ప్రజలకు చేయూతనిచ్చిన కాకా ఎనిమిది పదుల వయస్సులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చూసి 2014 డిసెంబర్ 22న తుదిశ్వాస విడిచారు. తండ్రి మరణం తర్వాత కూలీగా తన ప్రస్థానం మొదలు పెట్టి 'దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్' అని ప్రజల కోసం పనిచేసి పరితపించిన నేత దేశ చరిత్రలో చెరగని ముద్ర వేసుకునే తీరు అందరికీ ఆదర్శం కావాలి.

(నేడు గడ్డం వెంకటస్వామి జయంతి)

అనిల్ భగత్

జర్నలిస్ట్

9491743506

Next Story

Most Viewed