ఆదర్శ నాయకుడు పల్లెర్ల

by Disha edit |
ఆదర్శ నాయకుడు పల్లెర్ల
X

పాలమూరు జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ నాయకులలో ప్రముఖులైన వ్యక్తి పల్లెర్ల హన్మంతరావు. ఆయన 1908 మే 27న మహబూబ్‌నగర్‌లో జన్మించారు. న్యాయవిద్యను అభ్యసించి న్యాయవాద వృత్తిని చేపట్టారు. బూర్గుల రామకృష్ణారావు, మాడపాటి హనుమంతరావు తదితర ప్రముఖులతో కలిసి ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్నారు. పాలమూర్‌లో జరిగే అన్ని ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఈ జిల్లాలో ఆంధ్రమహాసభలను పటిష్టం చేయడమే కాకుండా గ్రామ గ్రామాన గ్రంథాలయాలు స్థాపించడానికి కృషిచేశారు. ఆయన 1938 నుండి 1954 వరకు పాలమూర్ డీసీసీగా పనిచేస్తూ, వందేమాతరం ఉద్యమం, నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం చేసి జైలుకు వెళ్ళి హైదరాబాదు సంస్థానం భారత యూనియన్‌లో కలిసిన తర్వాత జైలు నుంచి విడుదలైనారు.

తెలంగాణ గాంధీగా..

గాంధీజీ ప్రభావం వీరి వ్యక్తిగత జీవితంలోనూ, సమాజ సేవలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. క్రమశిక్షణకు వారు పెట్టింది పేరు. గాంధీజీ పిలుపు మేరకు జిల్లాలో ‘వ్యక్తి సత్యాగ్రహం’ చేసి అరెస్టయిన మొదటి వ్యక్తి వీరే. 1952లో జరిగిన తొలి శాసనసభ ఎన్నికలలో మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు ఎన్నికై బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో స్థానం పొందారు. ఆయనను దక్కన్ గాంధీ, మహబూబ్‌నగర్ గాంధీ అని ప్రజలు అప్యాయంగా పిలిచేవారు. హరిజనోద్ధరణలో భాగంగా పాత పాలమూరులోని ఆంజనేయ స్వామి దేవాలయంలోకి 1926లో హరిజన ప్రవేశం చేయించారు, వారితో సహపంక్తి భోజనాలు చేసేవారు. అలాగే ఆయనకు కుల, మత పట్టింపు లేదు. కొన్నిసార్లు మహమ్మదీయులతో, ఇతరులతో నీళ్లు తప్పించుకొని త్రికాల సంధ్యావందనాన్ని సైతం చేసేవారు. భూదానోద్యమం కోసం జిల్లా నుంచి 50వేల ఎకరాల భూమిని సేకరించిన ఘనత ఆయనకి చెందుతుంది.

వారసత్వ వ్యతిరేకి

తెలంగాణ కేసరిగా ప్రసిద్ధి చెందిన పల్లెర్ల హన్మంతరావు మహబూబ్‌నగర్ లోకసభ స్థానాన్ని రాజా రామేశ్వరరావు కోసం త్యాగం చేసి మెదక్ నుంచి రెండుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. 1957లో మెదక్ నుంచి హన్మంతరావుపై మఖ్దూం మొహియుద్దీన్ పోటీచేస్తే ఆ ప్రచారంలో వీరిరువురూ కలిసే భోజనాలు చేయడం, ఒకే వేదికపై నుంచి ప్రసంగించడం ప్రజలను విస్మయపర్చింది. పోటీ ఎన్నికలలో కానీ మా మధ్య వ్యక్తిగత వైషమ్యాలు లేవని చెప్పేవారు. అలాగే జనవరి 30న పల్లెర్ల పెద్దకుమారుడి వివాహం రోజున పెండ్లి తంతు ఆపించి మరీ గాంధీజీకి నివాళులు అర్పించారు పల్లెర్ల. గాంధీపై ఆయనకు అంత భక్తి ఉండేది. పాలమూరు పట్టణంలో హన్మంతరావు నెలకొల్పిన ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ఇప్పటికీ విద్యాకుసుమాలు వెదజల్లుతూనే ఉంది. 1967లో స్వచ్ఛందంగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలిగే సమయంలో వీరి కుమారుడిని వారసుడిగా ప్రకటించమని కోరితే ‘నేనలా ప్రకటించను, అతను స్వయంగా పైకి రావాల్సిందే’నని ప్రకటించిన నిష్పక్షపాతి హన్మంతరావు. 1972 లో భారత ప్రభుత్వంచే స్వాతంత్ర్య సమరయోధులకు ప్రధానం చేసే తామ్రపత్రాన్ని స్వీకరించారు. వీరి సేవలకు గుర్తింపుగా 2009 లో మహబూబ్‌నగర్ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడలిలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. 1979 సెప్టెంబరు 19న 71 సంవత్సరాల వయస్సులో పల్లెర్ల హన్మంతరావు మరణించారు.

(రేపు పల్లెర్ల హన్మంతరావు జయంతి)

సుధాకర్.ఏ.వి

అసోసియేట్ అధ్యక్షులు, STUTS

90006 74747

Next Story