రంగమార్తాండ ఎక్కడ విఫలమయ్యాడు?

by Disha edit |
రంగమార్తాండ ఎక్కడ విఫలమయ్యాడు?
X

నికీ, ఉత్పత్తి కార్యకలాపాలకు దూరమైన వృద్ధతరం.. కొత్త తరం ఆలోచనలు, వైఖరులను అర్థం చేసుకోలేకపోతే, తమ అభిప్రాయాలే సత్యమనే భ్రమకు గురైతే దాని అంతిమ పర్యవసానం వీక్షకులకు విలాపం, పాత్రధారులకు కపాలమోక్షంగా తప్ప మరొకలా ముగియదు. తాము కోల్పోయిన బంధాలు విలువల పట్ల మనుషుల విలాపాల వెనుక పరమ సత్యాన్ని రంగమార్తాండ సినిమా విస్పష్టంగా తెరకెక్కించింది.

ప్రతిదీ వైరుద్యమే..

ఈ సినిమా కథలోకి వస్తే.. రంగస్థలంపై మహారాజులాగా వెలిగిన రాఘవరావు సన్మాన సభలోనే నటనకు వీడ్కోలు ప్రకటించి, ఇంటికి వచ్చి ఇంటిని, డిపాజిట్లు, షేర్లను కోడలు పేరుతో, కూతురు పేరుతో రాసి ఇచ్చేస్తాడు. మనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా ఇచ్చేస్తున్నావేంటయ్యా అని భార్య ప్రశ్నించినా సర్దిచెబుతాడు. తన పిల్లలే కదా తన ఆస్తికి వారసులు.. ఎప్పుడు ఇచ్చేస్తేనేం, ఇవ్వాల్సిందే కదా అంటూ సమర్థించుకున్న రాఘవరావు ఆ ఆస్తిమారకం ద్వారా కొత్త తరం ఆలోచనల్లో వచ్చే మార్పులను అర్థం చేసుకోవడంలో విఫలమవుతాడు.

కొడుకు, కోడలు పంచన ఉండాల్సి వచ్చిన ప్రకాష్ రాజ్ తన ఇంటిరూపంలోని ఆస్తిపై పెత్తనం కోడలి చేతికి ఇచ్చిన తర్వాత కూడా మారిన సంబంధాలు, ప్రవర్తనలను పట్టించుకోకుండా తన ఆలోచనల్లోనే తానుంటాడు. తాను నమ్మిందే కరెక్ట్ అనే వైఖరికి కట్టుబడి ఉంటాడు. అది వారి జీవితంపై కలిగించే ప్రభావాన్ని అర్థం చేసుకోడు. వాళ్లేమో జీవితంలో అన్నింటితో రాజీపడిపోతుంటారు. తెలుగు భాషకు స్థానం లేదు అన్న స్కూల్ పెద్దను కొట్టినంత పని చేసి తెలుగు గొప్పతనం గురించి డైలాగ్ దంచి మనవరాలిని స్కూల్ నుంచి తీసుకొచ్చేసిన రాఘవరావు తన చర్య... కూతురు చదువుకోసం రాజీపడిపోయిన కొడుకు, కోడలికి తలనొప్పి తెస్తుందని గ్రహించలేకపోతాడు. అక్కడి నుంచి ప్రతిదీ వైరుధ్యమే. జీవిత విలువలే రెండు తరాల మధ్య పూర్తిగా మారిపోతాయి. రంగస్థలంలో అన్ని పాత్రల్లో నటించిన రాఘవరావు ఇంట్లో కూడా తాను నమ్మిన విలువలతో నటించాల్సి రావడం భరించలేకపోతాడు.

తరాల మధ్య ఆలోచనల్లో ఈ మార్పుల క్రమంలోనే కొడుకు కోడలు ఇంటి నుంచి కూతురు అల్లుడు ఇంటికి మారాక అక్కడా ఘర్షణ, మనస్తాపాలు తప్పవు. తాగినప్పుడు ప్రతి మనిషీ కంట్రోల్ తప్పినప్పుడు ఏం చేస్తాడో, వాతావరణాన్ని ఎంత రచ్చ రచ్చ చేస్తాడో ప్రకాశ్ రాజ్ కూడా అదే చేస్తాడు. ఇది తమ ఇల్లు కాదు.. కొడుకు ఇల్లు, కూతురు ఇల్లు అనే దూరం ఎప్పుడైతే పెరుగుతుందో, దాని పరాకాష్టగా కన్నకూతురే తనను దొంగతనం చేశావని పొరపాటుగా ఆరోపించినప్పుడు తట్టుకోలేక భార్యతో సహా ఇల్లు విడిచి వెళ్లిపోతాడు. ఆస్తిలేని, నీడలేని ఆత్మాభిమానం మాత్రమే మిగిలిన ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణల జీవితం చివరకు శ్మశానయాత్రతోనే ముగుస్తుంది. ప్రకాష్ రాజ్ రంగస్థలంపై నటనకు వీడ్కోలు పలికాక సొంత ఇంటిని కూడా కోడలుకు, నగలు షేర్లను కూతురుకూ రాసి ఇవ్వకపోయి ఉంటే అతడి మాట ఇంట్లో చెల్లకపోయి ఉండేదా అనేది మరొక ప్రశ్న.

వానప్రస్థాశ్రమం అంటే ఇదేనా?

ఏ కాలంలో అయినా సరే, అధికారం, సంపద వారసులకు రాసిచ్చేశాక. రాసివ్వక తప్పని పరిస్థితులు ఎదురయ్యాక, వయసు మీద పడ్డాక ఎవరికైనా మిగిలేది వానప్రస్థాశ్రమమే.. అన్నీ పోగొట్టుకుని విలువ తగ్గిపోయిన కాలంలో కూడా మనిషి ఉన్నచోటే, తన ఇంటిలోనే కొడుకుతోనో, కూతురితోనో ఉండవలసి రావడం తటస్థిస్తే... చేయవలసిన పని, ఈ సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్లు ‘అన్నీ మూసుకుని మూలన పడి ఉండటమే..’. అది చేతకానప్పుడు కొడుకు, కూతురు జీవితాల్లో వేలుపెడితే, వారి పిల్లలకు తెలుగు పద్యాలు చదివి వినిపిస్తే, తెలుగు భాష చాలా గొప్పది అని పాట పాడితే చివరకు మిగిలేది.. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ అనే రాఘవరావు లాంటి వారి అంతిమ జీవనయాత్రే.

అందుకే దశాబ్దానికి ఒకసారి మాత్రమే వచ్చే బలగం, రంగమార్తాండ వంటి అరుదైన సినిమాలు చూసి గుండె బద్దలై ఏడుస్తున్నవారు. దూరమైపోయిన తమ అమ్మ నాన్నలను, తమ బావ, చెల్లెళ్లను తలుచుకుని విలపిస్తున్న వారు... సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చాక కొన్ని రోజులకు అన్నీ మర్చిపోయి యధావిధిగా బతికేయడం ఖాయం. అలాగని తప్పు చేసామని, పాపం చేశామని మనస్ఫూర్తిగా బాధపడుతూ మళ్లీ కలిసుందామని ఐక్యతా రాగాలు పలికేవారి నిజాయితీని శంకించాల్సిన పనిలేదు కానీ, కొద్ది రోజుల తర్వాతో, కొద్దినెలల తర్వాతో మళ్లీ ఆ ఐక్యతా బంధాలు తెంచుకుని విడిగా బతకడమూ ఖాయమే. దీనికి ఎవరినీ ఎవరూ తప్పు పట్టాల్సిన పనిలేదు.

కనుమరుగైపోయిన ఉమ్మడి తనం...

నేనూ, నా కుటుంబమూ, నా పిల్లలూ, నా ఆస్తీ, నా హోదా అనే కొత్త విలువలు ఉనికిలోకి వచ్చేశాక, ప్రతి కుటుంబాన్నీ ప్రభావితం చేశాక వాటిలోని అమానుషత్వాన్ని తల్చుకుని బాధపడుతూ పాతబంధాలను గుర్తుకు చేసుకునే ప్రతి కళా, ప్రతి అంతరంగమూ, ప్రతి జీవితమూ ఎలాంటి ఫలితాన్నీ ఇవ్వని మహా విషాదంగానూ, మహా విలాపంగానూ మాత్రమే మిగిలిపోతుంది. ఔనన్నా కాదన్నా ఇప్పుడు మనుషులు ఉమ్మడి కుటుంబాలుగా కలిసి బతకలేరు. విడివిడి కుటుంబాలుగా మాత్రమే ఉంటూ కొత్తతరం అనుబంధాలను సెపరేషన్ ద్వారానే కొనసాగించగలరు.

పాత సమాజం విచ్ఛిన్నం, కొత్త సమాజ ఆవిర్భావం తన కళ్లముందే జరిగిపోతున్నప్పుడు గుండె బద్దలై విశ్వనాథ సత్యనారాయణ అనే ఒక మహా సంప్రదాయ కవి 'వేయిపడగలు' నవలలో పసరిక పాత్ర ద్వారా, ధర్మారావు పాత్ర ద్వారా ఏడ్చిన ఏడుపు, 90 ఏళ్ల తర్వాత కూడా మన జీవితాల్లో, ఆధునిక కళారూపాల్లో నేటికీ వెంటాడుతూనే ఉంది. బలగం, రంగమార్తాండ సినిమాలు చూసి లక్షలాది మంది విలపిస్తున్నారంటే తాము కోల్పోయిన పాత విలువలను తల్చుకోవడమే తప్ప మళ్లీ వాటిలోకి వెళ్లిపోవాలని కాదు. అలా వెళ్లిపోవాలన్నా సాధ్యం కాదు. ఇంటిపెద్ద మాటకు కొడుకులూ, కోడళ్లు అందరూ కట్టుబడటం, ఉమ్మడి కుటుంబంలో, ఉమ్మడి జీవితంలో సుఖదుఖాలు కలిసే పంచుకోవడం ఇక సాధ్యం కాదు. విడిపోయి బతుకుతున్న, అలా తప్ప మరోలా మనలేకపోతున్న మనలోని అపరాధ భావాన్ని ఈ రెండు సినిమాలూ చూస్తూ ఏడుపురూపంలో ప్రదర్శించడం తప్ప అంతకుమించి ఏమీ చేయలేం. జీవితంలోని అన్ని కోణాల్లో, రంగాల్లో వైయక్తిక చైతన్యమే ప్రబలమైపోయిన సమాజ పునాదికి మనం అన్నిరకాలుగా బంధితులమయ్యాం అనేది మర్చిపోకూడదు.

ఆస్తి సంబంధాల్లో కొత్తకోణం

రంగమార్తాండ చేసిన గొప్ప పని ఏమిటంటే... ఆస్తులు (చిన్నవైనా, పెద్దవైనా) బిడ్డలకు రాసిచ్చేసి సొంత ఇంటిలోనే అనాథల్లాగా బతకడం కంటే మించిన నరకం మరొకటి లేదన్న సత్యాన్ని బలంగా చాటడమే. ఆస్తి పంపకాలు ఎంత తక్కువ స్థాయిలో జరిగినా సరే కొడుకు భాగం, కూతురు భాగం (అదంటూ ఉంటే)తోపాటు తల్లిదండ్రుల భాగం కూడా పంపకం పెట్టడం ఒక్కటే ముసలితనంలో కాస్త రక్షణగా ఉంటుందనే కొత్త సత్యం ఇటీవల చాలా రచనల్లో వ్యక్తమవుతోంది.

అందుకే బ్రహ్మానందం ఈ సినిమాలో రాఘవరావు కొడుకు, కోడలితో చెప్పిన ఒక డైలాగ్ అక్షరసత్యం అనిపిస్తుంది. 'నాటకాల్లో మాత్రమే మేం మేకప్, విగ్గులు వేసుకుని నటించేవాళ్లంరా. కానీ మీరేమో అవేవీ లేకుండానే నిజజీవితంలో నటిస్తూ బతికేస్తున్నార్రా.. ఆ పిచ్చినాకొడుక్కి (రాఘవరావు) పాతకాలపు మనిషి కదా. ఆ విషయం అర్థం కావడం లేదురా.. కానీ నాకో విషయం అర్థమైందిరా.. నేను పిల్లల్లేని మహాదృష్టవంతుడిని... ఒరేయ్ చెప్పడం మర్చిపోయాను. నువ్వు పదంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటున్నావు కదా. కొంపదీసి దాన్ని పిల్లల పేరుతో రాసేస్తావేమో.. వాళ్లు రేపు మిమ్మల్ని మెడపట్టుకుని బయటకు గెంటేశారనుకో.. బాధపడతారు... బాధపడతారు.. థూ...

పనికి దూరమైతే నో వాల్యూ...

రాఘవరావు పాత్రధారి ప్రకాశ్ రాజ్ కాస్త రాజీపడి ఉంటే, ఉత్పత్తికి (అది పాదార్థిక ఉత్పత్తికావచ్చు, కళాత్మక ఉత్పత్తి కావచ్చు, మరేదైనా కావచ్చు) అన్నివిధాలుగా దూరమైపోయాక శేష జీవితాన్ని ఎలాంటి పట్టింపులూ లేకుండా నిరామయంగా బతకడం అలవాటు చేసుకుని ఉంటే ఆ దంపతుల జీవితం ఇంత విషాదంగా ముగిసి ఉండేది కాదేమో.. పని చేయలేని వాళ్లు, పనికి దూరమైన వాళ్లూ, సంపాదన లేనివాళ్ల ఆలోచనలను మన సమాజ చట్రం పట్టించుకోదు, వాటికి ఏమాత్రం విలువ ఇవ్వదు. ఈ చిన్న విషయం ఈ రంగస్థల మార్తాండుడికి అర్థం కాకపోవడమే విషాదాల్లో కెల్లా విషాదం.

ఇవి కూడా చదవండి: రాజమౌళి, శంకర్‌లలో బెస్ట్ ఎవరు?

కె. రాజశేఖరరాజు

79893 74301

Next Story

Most Viewed