ఉన్నది ఉన్నట్టు:ధరలను గాలికి వదిలి..

by Viswanth |
ఉన్నది ఉన్నట్టు:ధరలను గాలికి వదిలి..
X

పొద్దున్నే నిద్ర లేవగానే టీ తాగుదామని వంటింట్లోకి వెళ్తే, గ్యాస్ ధర, కంటికి తెలియకుండా పాల ధర, టీపొడి, చక్కెర ధరలు భయపెడుతున్నాయి. టిఫిన్ చేసుకుందామనుకుంటే నిత్యావసర వస్తువుల ధరలు, కూర వండుకుందామనుకుంటే కూరగాయలు, కందిపప్పు, చింతపండు, వంట నూనె, కోడిగుడ్లు, చికెన్, మటన్ ధరలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పిల్లలను స్కూలుకు పంపిద్దామంటే ఫీజులు, పుస్తకాలు, యూనిఫారం ధరలు టెర్రర్ చేస్తున్నాయి. స్కూలు బస్సు కిరాయీ పెరిగింది. అన్నీ చక్కదిద్దుకుని ఆఫీసుకు పోదామంటే పెట్రోలు ధర మండిపోతున్నది. ఆటో ఎక్కుదామనుకుంటే రేటు డబుల్ అయింది. క్యాబ్ పరిస్థితీ అంతే. చివరకు ఆర్టీసీ బస్సు టికెట్ చార్జీలూ పెరిగాయి. ఎండ వేడికి చల్లగా నిమ్మకాయ సోడా తాగుదామనుకుంటే అదీ మూడు రెట్లు పెరిగింది. ఒక్క నిమ్మకాయ రేటే రూ. 15 పలుకుతుంటే ఇక సోడా, ఐస్ కలిపేసరికి పాతిక దాటుతున్నది. రాత్రి ఇంటికొచ్చి కాస్సేపు ఫ్యాన్ వేసుకుని ప్రశాంతంగా పడుకుందామనుకుంటే కరెంటు చార్జీలూ బెంబేలెత్తిస్తున్నాయి.

పొలిటికల్ పార్టీలకు రాజకీయాలే ఆక్సిజన్. అధికారమే పరమావధి. ఏం చేస్తే నాలుగు ఓట్లు ఎక్కువ పడతాయనేదే వారికి ముఖ్యం. ప్రజలు వాటికి ఓటర్లు మాత్రమే. జాబ్‌లు చూపడం మాని హిజాబ్‌ను తెరపైకి తెస్తుంది ఒక పార్టీ. వడ్లు కొనే పని మానుకుని బాయిల్డ్ రైస్ ప్రస్తావన తెస్తుంది మరో పార్టీ. ఎన్నికలకు ఇంకా రెండేండ్లు ఉన్నా ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెడుతుంది ఇంకో పార్టీ. ప్రజలు పడుతున్న కష్టాలు, బాధలు మాత్రం ఏ పార్టీకీ పట్టవు. 'ఎవరితో కలుద్దాం, ఎవరిని వ్యూహకర్తగా పెట్టుకుందాం. మళ్లీ అధికారంలోకి రావాలంటే ఏం చేద్దాం' ఇవే పార్టీలకు ప్రధానం.

ఒకప్పుడు గ్యాస్ సిలిండర్‌పై యాభై రూపాయలు ధర పెంచితే దేశమంతా గగ్గోలు పెట్టి రోడ్డెక్కిన పార్టీయే ఇప్పుడు ఏకంగా రూ. 500 పెంచింది. సబ్సిడీని ఎత్తేసింది. అధికారంలోకి రాకముందు నానా యాగీ చేసిన ఆ పార్టీ ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. పైగా అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నది. పెట్రోలు, డీజిల్ ధరలు ఊహించనంతగా పెరిగిపోయాయి. దాని సాకుతో అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలూ పెరిగిపోయాయి. వీటిని ఏ పార్టీ పట్టించుకోదు. నియంత్రించాల్సిన ప్రభుత్వాలూ నిమ్మకు నీరెత్తినట్లుగానే ఉన్నాయి.

పరస్పరం నిందలు వేసుకుంటూ

ఒక ప్రభుత్వంపై మరో ప్రభుత్వం విమర్శలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాయి. ఎక్సయిజ్ టాక్స్ పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నదంటూ కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర సర్కారు విమర్శలు చేస్తున్నది. తప్పును కేంద్రంపైకి నెడుతున్నది. ప్రజల బాధలను తామే పట్టించుకున్నాం అనే కలరింగ్ ఇస్తున్నది. అదే నిజమైతే రాష్ట్ర సర్కారు వసూలు చేస్తున్న వ్యాట్‌ను తగ్గించి ఉపశమనం కలిగించవచ్చు. కానీ, కేంద్రాన్ని దోషిగా చూపెడుతూనే రాష్ట్రమూ అదే పనిచేస్తున్నది. ధరల నియంత్రణలో అన్ని ప్రభుత్వాలూ చేతులెత్తేశాయి. ప్రజలపై పడే భారాన్ని తగ్గించడంలో విఫలమయ్యాయి.

ఉక్రెయిన్ యుద్ధం పేరుతో సన్ ఫ్లవర్ ఆయిల్ ధర అమాంతంగా రెండింతలైంది. డీజిల్ ధరల పెంపు పేరుతో ఆర్టీసీ బస్సు చార్జీలు పెరిగాయి. ఐదేండ్ల నుంచి టారిఫ్ పెంచలేదంటూ డిస్కంలు కూడా కరెంటు చార్జీలను పెంచేశాయి. పిల్లల చదువులూ భారమయ్యాయి. అగ్గిపెట్టె మొదలు ఆర్టీసీ టికెట్ల దాకా అన్నీ పెరుగుతూనే ఉన్నాయి. నెలవారీ బడ్జెట్‌ సామాన్యులకు మోయలేని భారంగా మారింది. ఇంట్లో ఉన్నా, బైటకు పోయినా పెరిగిన ధరలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జీతాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి తరహాలోనే ఉండిపోయాయి.

బెంబేలెత్తిస్తున్న రేట్లు

జీడీపీ గ్రోత్ రేట్, ద్రవ్యోల్బణంలాంటి పెద్దపెద్ద పదాలను కాస్సేపు పక్కన పెడదాం. పొద్దున్నే నిద్ర లేవగానే టీ తాగుదామని వంటింట్లోకి వెళ్తే, గ్యాస్ ధర, కంటికి తెలియకుండా పాల ధర, టీపొడి, చక్కెర ధరలు భయపెడుతున్నాయి. టిఫిన్ చేసుకుందామనుకుంటే నిత్యావసర వస్తువుల ధరలు, కూర వండుకుందామనుకుంటే కూరగాయలు, కందిపప్పు, చింతపండు, వంట నూనె, కోడిగుడ్లు, చికెన్, మటన్ ధరలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పిల్లలను స్కూలుకు పంపిద్దామంటే ఫీజులు, పుస్తకాలు, యూనిఫారం ధరలు టెర్రర్ చేస్తున్నాయి.

స్కూలు బస్సు కిరాయీ పెరిగింది. అన్నీ చక్కదిద్దుకుని ఆఫీసుకు పోదామంటే పెట్రోలు ధర మండిపోతున్నది. ఆటో ఎక్కుదామనుకుంటే రేటు డబుల్ అయింది. క్యాబ్ పరిస్థితీ అంతే. చివరకు ఆర్టీసీ బస్సు టికెట్ చార్జీలూ పెరిగాయి. ఎండ వేడికి చల్లగా నిమ్మకాయ సోడా తాగుదామనుకుంటే అదీ మూడు రెట్లు పెరిగింది. ఒక్క నిమ్మకాయ రేటే రూ. 15 పలుకుతుంటే ఇక సోడా, ఐస్ కలిపేసరికి పాతిక దాటుతున్నది. రాత్రి ఇంటికొచ్చి కాస్సేపు ఫ్యాన్ వేసుకుని ప్రశాంతంగా పడుకుందామనుకుంటే కరెంటు చార్జీలూ బెంబేలెత్తిస్తున్నాయి. ఇంతచేసినా ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, చిరు వ్యాపారులు లాభపడిందేమీ లేదు. వారూ దారిద్ర్య రేఖలోనే ఉండిపోతున్నారు.

ప్రజల మౌనం దేనికి సంకేతం?

పెరిగిన ధరలకు వ్యతిరేకంగా గతంలో రోడ్డెక్కి ధర్నాలు జరిగేవి. ఇప్పుడా పరిస్థితులు లేవు. మౌనంగా భరించడానికి జనం అలవాటు పడ్డారు. ఒకప్పుడు ఎర్ర జెండాలతో రాస్తారోకో, నిరసనలు జరిగేవి. ఇప్పుడా ఆందోళనలేవీ లేవు. పార్టీలు పిలుపు ఇచ్చినా కదలడానికి జనం సిద్ధంగా లేరు. మౌనంగా దిగమింగుకోవడం దేనికి సంకేతం? ఓట్లప్పుడు పార్టీలకు తగిన బుద్ధి చెప్తామనే వ్యూహాత్మక మౌనమా? నూతన ఆర్థిక సంస్కరణల పేరుతో ఏదో ఒక రూపంలో ఆదాయ వనరులను సమకూర్చుకునే మార్గాలు అందుబాటులోకి రావడమా? ఏం చేసినా ధరలు తగ్గేది లేదనే నిస్సహాయతా?

కరోనా కాలంలో పరిశ్రమలు మూతపడ్డాయి. ఉత్పత్తి ఆగిపోయింది. ఉద్యోగాలూ ఊడిపోయాయి. బతుకు జీవుడా అంటూ దొరికింది తిని కడుపు నింపుకున్నారు. రెండేళ్ల కరోనా సంక్షోభంతో ఆర్థికంగా కుదేలయ్యామంటూ పరిశ్రమల యజమానులు అన్ని ఉత్పత్తుల రేట్లనూ పెంచేశాయి. నష్టాన్ని భర్తీ చేసుకునే పేరుతో మరింత ఆదాయాన్ని ఆర్జించడానికి ప్రయత్నించాయి. పేదలు మరింత పేదరికంలోకి, దరిద్రంలోకి కూరుకుపోయారు. అదానీ, అంబానీ లాంటి సంపన్నుల సంపద మాత్రం శిఖరంలాగా పెరిగిపోయింది. ఉన్న ఉద్యోగాలు ఊడిపోవడంతో చిన్నా చితకా పనులు, వ్యాపారాలు చేసుకోవడమే దిక్కయింది.

పెరిగిన చిరు వ్యాపారాలు

అందుకే మన ఇండ్ల ముందు గతంలో ఎన్నడూ కనిపించని బైక్‌ దుకాణాలు, తోపుడుబండ్లు, శివారు ప్రాంతాలలో మారుతీ వ్యాన్లలో మొబైల్ క్యాంటీన్లు, సాయంత్రం వేళ ఇడ్లీ, దోసె పాయింట్లు పుట్టుకొచ్చాయి. ఇక నిన్నమొన్నటిదాకా ప్రైవేటు ఉద్యోగాలు చేసుకున్న యువత ఇప్పుడు స్విగ్గీ, జొమాటో లాంటి డెలివరీ బాయ్ ఉపాధిని వెతుక్కున్నది. పరిశ్రమాధిపతులు, వ్యాపారవేత్తలు కరోనా టైమ్‌లో ఏర్పడిన నష్టాన్ని, పెరిగిన డీజిల్, ముడిసరుకుల ధరలతో ఏర్పడిన నష్టాన్ని ఉత్పత్తుల ధరలను పెంచి అంతకు రెండింతలు వసూలు చేస్తున్నారు.

మరోవైపు ప్రభుత్వాల ఇబ్బందులూ టెంపొరరీయే. పన్నులు, చార్జీలు పెంచి వసూలు చేసుకుంటున్నాయి. నష్టాలన్నీ జనం మీద పడ్డాయి. కరోనా సమయంలో పేదలను ఆదుకున్నామంటూ కేంద్రం సొంత డబ్బా కొట్టుకుంటున్నది. సంక్షేమానికి వెచ్చించిన ఖర్చును రాబట్టుకోడానికి మరో దారిలో కసరత్తు మొదలుపెట్టింది. పెట్రోలు, డీజిల్ ధరల పెంపుతో రెట్టింపు ఆదాయాన్ని సమకూర్చుకున్నది. రైతుబంధు లాంటి పథకం దేశంలో ఎక్కడా లేదంటూ తెలంగాణ సర్కారు గొప్పగా చెప్పుకుంటున్నది. కానీ, దాని పేరుతో ఇన్‌పుట్ సబ్సిడీ, గ్రీన్‌హౌజ్, పాలీ‌హౌజ్, పంటల బీమా లాంటి పథకాలను సమాధి చేసింది. ఒక్కో ఎకరానికి సంవత్సరానికి రూ.10 వేలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వమంటూ సీఎం కేసీఆర్ చెప్పుకుంటున్నారు.

రైతులకు ఒరిగిందేమీ లేదు

పంటలను అమ్ముకోడానికి ప్రభుత్వాలు పటిష్ట మెకానిజాన్ని ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు ఎంఎస్‌పీ కంటే తక్కువకే కొంటూ రైతుల్ని ముంచేస్తున్నారు. వడ్ల విషయంలో ఒక్కో క్వింటాకు దాదాపు రూ. 500 వరకు నష్టపోతున్నారు రైతులు. ఎకరానికి వచ్చే 20 క్వింటాళ్ళ ధాన్యంతో రూ. 10 వేలు లాస్ అవుతున్నారు. రైతుబంధు పేరుతో వచ్చిన సాయం ఆ నష్టానికే సరిపోయింది. ఎంఎస్‌పీ ఉల్లంఘన జరుగుతూ ఉన్నా ప్రభుత్వ యంత్రాంగం ప్రేక్షకపాత్రకు పరిమితమైంది. రాజకీయం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాయిల్డ్ రైస్ పేరుతో నిర్లక్ష్యంగా వ్యవహరించి రైతుల నడ్డి విరిచాయి. పార్టీలకు, ప్రజా ప్రతినిధులకు ప్రజా సేవ కంటే ఓటు బ్యాంకే ముఖ్యం.

అందుకే ప్రశాంత్ కిషోర్‌ను, లేదా సునీల్‌ను వాడుకుంటే ఎన్ని ఓట్లు, సీట్లు పెంచుకోవచ్చని ఆలోచిస్తున్నాయి. రాజకీయాలలో తలమునకలయ్యాయి. అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నా పట్టింపు ఉండదు. వడ్లను ప్రభుత్వం కొనకపోవడంతో కుప్పల మీద రైతులు కుప్పకూలినా నిర్లక్ష్యమే. అధికార పార్టీ నాయకుల వేధింపులు భరించలేక కుటుంబాలు మూకుమ్మడిగా సూసైడ్ చేసుకున్నా పట్టించుకోవు. ఐదేళ్ళకోసారి జరిగే ఎన్నికలపైనే వారికి ఎక్కువ ఆసక్తి. ఏ నోట్లు ఎన్ని ఇస్తే ఓట్లు పడతాయన్నదే వారికి కావాల్సింది. ప్రజలు ఎప్పటికీ చేయి చాచేవారిగా, ఇస్తే పుచ్చుకునేవారిగా ఉండాలనే రాజకీయ పార్టీలు, నేతలు కోరుకుంటారు.

వాస్తవాలు గ్రహించాలి

ఎవరు ఎక్కువ ఇస్తే వారికి ఓటు వేయాలన్నదే ప్రజలూ ఒక పాలసీగా పెట్టుకున్నారు. ఏ పథకంతో ఎంత వస్తుందా? అని ఎదురుచూసే పరిస్థితికి పేదలు అలవాటు పడ్డారు. తమ తలరాతలు మార్చే ఓటు పెనం మీద నుంచి కుంపట్లో పడేస్తున్నదనే వాస్తవాన్ని గ్రహించి వివేచనతో ఆలోచించిననాడే పార్టీలకు బుద్ధి చెప్పడం సాధ్యం. అప్పటివరకూ ఒక పీకే, ఒక ఎస్కే వస్తూనే ఉంటారు. పార్టీలు తియ్యటి మాటలతో ప్రజలను వంచిస్తూనే ఉంటాయి.



ఎన్. విశ్వనాథ్

99714 82403


Next Story

Most Viewed