108 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ.. గతం నుండి వర్తమానం దాకా

by Ravi |   (  Updated:2025-04-26 01:00:31  IST  )

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏప్రిల్ 26 నాటికి 107 వసంతాలు పూర్తి చేసుకుని, 108

108 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ.. గతం నుండి వర్తమానం దాకా
X

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏప్రిల్ 26 నాటికి 107 వసంతాలు పూర్తి చేసుకుని, 108 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న వేళ విశ్వ విద్యాలయ గమనాన్ని గతం నుండి వర్తమానం వరకు అవలోకనం చేసుకొని, భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించాల్సిన ఒక చారిత్రక సందర్భం నేడుంది. హైదరాబాద్ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1917 సంవత్సరంలో ఉదాత్తమైన ఆశయంతో, అత్యంత దూరదృష్టితో ఈ విశ్వవిద్యాలయా న్ని స్థాపించారు. దీనికి సంబంధించిన ఫర్మానాను 1917 ఏప్రిల్ 26న జారీ చేశారు. ఇంటర్మీడియట్ తరగతులతో ప్రారంభమైన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1921 నాటికి డిగ్రీ తరగతులు, 1923 నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరగతులు ప్రారంభమయ్యాయి.

నాటి నుండి నేటి దాకా నిరంతరాయంగా అభివృద్ధి చెందుతూ, భారతదేశ ఉన్నత విద్యారంగంలో 7వ ప్రాచీన విశ్వవిద్యాలయంగా, దక్షిణ భారతదేశంలో 3వ ప్రాచీన ఉన్నత విద్యాసంస్థగా సమున్నతమైన స్థానాన్ని పొందిన ఓయూ, నేడు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా రంగంలో తలమానికంగా నిలిచింది. ఉమ్మడి రాష్ట్రంలో మొదటి ఉన్నత విద్యా సంస్థగా తన సుదీర్ఘ ప్రయాణంలో అనేక ఎత్తు, పల్లాలను ఎదుర్కొని నేడు 108వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న వేళ, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇటీవలి ప్రగతిని గమనించాల్సి వుంది.

న్యాక్ గ్రేడ్ కోసం..

ఇంత గొప్ప విద్యా వారసత్వం ఉన్న విశ్వవిద్యాలయానికి 26వ ఉపకులపతిగా 2024 అక్టోబర్ 19 నుండి నేను బాధ్యతలు స్వీకరించి ఏప్రిల్ 19 నాటికి ఆరు నెలలు పూర్తయింది. ఈ ఆరు మాసాల కాలంలో విశ్వ విద్యాలయ పురోభివృద్ధికి తీసుకున్న చర్యలు, భవిష్యత్ కార్యచరణ ఉన్నత విద్యను మరింత బలోపేతం చేస్తున్నాయని ఆశించాలి. ఏ విశ్వవిద్యాలయానికైనా న్యాక్‌ గుర్తింపు అవసరం. అందుకే న్యాక్ నాలుగవ సైకిల్లో భాగంగా అత్యున్నతమైన గ్రేడ్ పొందటం కోసం పూర్తి స్థాయిలో సిద్ధం అవుతున్నాం. ఇక విశ్వవిద్యాలయంలో డిజిటల్ సేవలు, ఆన్‌లైన్ చెల్లింపులు, కాగిత రహిత సేవలు ప్రవేశపెట్టి పరిపాలనను వేగవంతం చేశాం. క్యాంపస్, అనుబంధ కళాశాలల్లో హాజరు శాతం పెంచడం ద్వారా తరగతుల నిర్వహణ సకాలంలో పరీక్షల నిర్వహణలో పురోగతి సాధించాం.

గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కోసం..

పరిశోధనలో ఉస్మానియా విశ్వవిద్యాలయం అగ్రగామిగా ఉంది. ఇప్పటికే విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఆచార్యులు సుమారుగా 300 కోట్ల రూపాయల విలువైన పరిశోధన ప్రాజెక్టులను నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయంగా పేరుగాంచిన యూనివర్సిటీల ద్వారా సుమారు 20కి పైగా అవగాహన ఒప్పందాలు చేసుకుని రానున్న కాలంలో విద్యార్థులు, ఆచార్యులతో కలిపి ‘ఫ్యాకల్టీ ఎక్చేంజ్’ కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఈ ఏడాది నుండి ఒకే యూనిక్ ఐడీ ద్వారా విద్యార్థులకు సంబంధించిన ప్రతి సమాచారం ఒకే నంబర్‌పై కొనసాగించేలా చేస్తున్నాం. అలాగే రానున్న కాలంలో పీహెచ్‌డీ చదువుతున్న రీసెర్చ్ స్కాలర్స్‌కు ప్రత్యేకమైన ‘ఫెలోషిప్’ అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన విద్యార్థుల కోసం CELT (సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్) ద్వారా ప్రతి 45 రోజులకు ఒకసారి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి ఇంగ్లీష్ భాష పట్ల విద్యార్థులలో ఉన్న భయాన్ని పోగొడుతున్నాం. తరగతి గదులను కేవలం 'లెర్నింగ్' ప్రదేశాల లాగానే కాకుండా 'పరిశోధన' స్థలాలుగా, నైపుణ్య కేంద్రాలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నాం. యూనివర్సిటీలో ఉన్న వివిధ పరిపాలన పదవులలో వారి సమర్ధత, సామాజిక న్యాయం ఆధారంగా అన్ని వర్గాల ఆచార్యులకు పరిపాలనలో భాగస్వామ్యం చేశాం.

వందలాది సబ్జెక్టుల గని

ఈ వర్సిటీలో 66 రకాల అకడమిక్ సబ్జెక్ట్స్, 56 విభాగాలు, ఎనిమిది క్యాంపస్ కళాశాలలు, ఆరు అనుబంధ కళాశాలలు, ఐదు జిల్లా పీజీ కేంద్రాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద విశ్వవిద్యాలయంగా ఉన్న ఓయూ 125 రకాల సబ్జెక్ట్స్, 69 డిగ్రీ స్థాయి కోర్సులు, 114 పీజీ కోర్సులు, 66 సబ్జెక్ట్స్‌లో పీహెచ్‌డీ పోగ్రాంలు నిర్వహిస్తుంది. దీంతో పాటుగా ప్రొఫెసర్ జి. రామిరెడ్డి దూర విద్యా కేంద్రం ద్వారా 72 రకాల డిగ్రీ, పీజీ కోర్సుల ద్వారా ప్రతి ఏటా 50 వేల మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తున్నాం.

3.5 లక్షల మంది విద్యార్థులు..

ఉస్మానియా విశ్వవిద్యాలయం బోధన, పరిశోధన రంగంలో CBCS ఛాయిస్ బేస్డ్ (క్రెడిట్ సిస్టం) ఇంటర్నల్ పరీక్షలు లాంటి నూతన పద్ధతులను కల్గి ఉండటంతో పాటు డేటా సైన్సు, సైబర్ సెక్యూరిటీ, బిజినెస్ ఎనాలసీస్ లాంటి నూతన కోర్సులను ప్రవేశపెట్టింది. వీటితో పాటు CFRD, NCAM, O-TBT వంటి పరిశోధన సౌకర్యాలను కల్గి ఉన్నది. విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, జాబ్ మేళాలు, హెల్త్ కేర్, మానసిక కౌన్సిలింగ్, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను నెలకొల్పింది. ప్రస్తుతం 735 అనుబంధ కళాశాలలలో 3.5 లక్షల మంది ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో చదువుతున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తన భవిష్యత్తు గమనాన్ని రూపొందించుకునే క్రమంలో ఈ 108వ ఆవిర్భావ దినోత్సవాలు నూతనొత్తేజాన్ని ఇవ్వాలని కోరుకుందాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తమ ప్రత్యేక శ్రద్ధ ద్వారా విశ్వవిద్యాలయాలను పర్యవేక్షిస్తున్నారు. వారి ప్రోత్సాహం, ఆర్ధికపరమైన సహకారం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి పునర్వై భవం తప్పక తెస్తుందని భావిస్తున్నాం. దేశ ఉన్నత విద్యా రంగానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం తలమానికంగా ఉంటుందని, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యకు దశ - దిశ చూపించటంలో తన పాత్ర క్రియాశీలకంగా అగ్రగామిగా ఉంటుందని విశ్వసిస్తున్నాం.

(నేడు ఉస్మానియా యూనివర్సిటీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా)

- ప్రొఫెసర్ కుమార్ మొలుగరం

(వైస్ ఛాన్సలర్, ఉస్మానియా యూనివర్సిటీ)

Next Story