- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐదేళ్ల సేవకు జీవితాంతం పెన్షన్.. న్యాయమేనా?
ప్రజాప్రతినిధుల పెన్షన్లు, జీతభత్యాలు, ప్రజాధన వినియోగంపై శ్రీలంక నిర్ణయం నేపథ్యంలో భారత్‌లో మళ్లీ చర్చ మొదలైంది. ఈ వ్యాసం పెన్షన్ వ్యవస్థ హేతుబద్ధత, ఆర్థిక భారం, సంస్కరణ అవసరాన్ని విశ్లేషిస్తుంది.

ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ప్రజల తరఫున పాలన నిర్వహించే బాధ్యతను స్వీకరిస్తారు. అందుకే వారికి తగిన వేతనాలు, సౌకర్యాలు కల్పించడం అవసరమే. అయితే ప్రజాధనంతో కల్పిస్తున్న ఈ ప్రయోజనాలు ఎంతవరకు సమంజసం, వాటి పరిమితి ఏమిటి? అనే ప్రశ్న కాలక్రమేణా మరింత ప్రాధాన్యం సంతరించుకుంటోంది.
ఇటీవల శ్రీలంక ప్రభుత్వం పార్లమెంటు సభ్యుల జీవితకాల పెన్షన్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం దక్షిణాసియాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ప్రజాప్రతినిధుల ప్రత్యేక హక్కులపై చర్చకు తెరతీసింది. ఈ నేపథ్యంలో భారత దేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులకు అందుతున్న పెన్షన్లు, ఇతర పదవీ విరమణ ప్రయోజనాల అవసరం, హేతుబద్ధత, ప్రజాధన వినియోగంపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పెన్షన్లను సమీక్షించాలి..
శ్రీలంక ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వ ఖర్చులు తగ్గించే చర్యలు చేపట్టింది. దీంతో భారతదేశంలో కూడా ఎంపీల జీతాలు, పెన్షన్లు, ప్రత్యేక సౌకర్యాలను సమీక్షించాలనే అనే చర్చ మొదలైంది. భారతదేశంలో ఎంపీల జీత భత్యాలు, పెన్షన్లు చట్టబద్ధంగానే అమలవుతున్నాయి. ప్రస్తుతం ఒక ఎంపీకి నెలకు రూ.1.24 లక్షల జీతంతో పాటు ఇతర సౌకర్యాలు కలిపితే దాదాపు రెండు లక్షలకు పైగా ముడుతోంది. పదవీ కాలం పూర్తయిన తర్వాత నెలకు రూ. 31 వేల పెన్షన్, అదనపు సేవా కాలానికి ప్రతీ సంవత్సరానికి మరో రెండున్నర వేల రూపాయలు అదనపు పెన్షన్ కూడా లభిస్తుంది.
ప్రశ్న పెన్షన్‌పై కాదు... దాని తత్వంపైనే
ప్రభుత్వ ఉద్యోగులు దశాబ్దాల పాటు సేవలందించి, తమ వేతనంలో భాగాన్ని పెన్షన్ నిధులకు చెల్లిస్తారు. కానీ ప్రజాప్రతినిధుల విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఒక్కసారి ఎన్నికై ఐదేళ్లు పదవిలో ఉన్నా జీవితాంతం పెన్షన్ పొందుతున్నారు. కొన్ని చోట్ల బహుళ పెన్షన్లు కూడా పొందుతున్న ఉదాహరణలు ఉన్నాయి. నిజానికి ప్రజా ప్రతినిధి పదవి శాశ్వత ఉద్యోగం కాదు. ప్రజలు అప్పగించే తాత్కాలిక బాధ్యత. కాబట్టి, పదవీ విరమణ తర్వాత వారికి ప్రత్యేక హక్కులు, జీవితకాల ఆర్థిక భద్రతను హామీగా మార్చడం ఎంతవరకు సమంజసం అనేదే అసలు ప్రశ్న. ప్రపంచంలోని అనేక ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజాప్రతి నిధులకు పెన్షన్లు ఉన్నప్పటికీ, అవి సభ్యుల విరాళాలు, సేవా కాలం, వయోపరిమితి వంటి ప్రమాణాల ఆధారంగా అమల వుతున్నాయి. అయితే భారతదేశంలో పెన్షన్ వ్యవస్థ పూర్తిగా ప్రజాధనంపై ఆధారపడుతోందనే విమర్శలు ఉన్నాయి. మాజీ ప్రజాప్రతినిధుల పెన్షన్ల కోసం దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు ఏడాదికి సుమారు ₹1,000–₹1,200 కోట్లు ఖర్చు చేస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాబట్టి మన దేశంలో కూడా ఈ అంశాన్ని రాజకీయ కోణంలో కాకుండా ఆర్థిక, నైతిక కోణాల్లో పరిశీలించాలి.
అసమానతలకు దారి తీసే పెన్షన్ వ్యవస్థ..
2023 గణాంకాల ప్రకారం దేశంలో సుమారు 4,796 మంది మాజీ ఎంపీలు పెన్షన్ పొందుతున్నారు. వారి పెన్షన్లపై ఏడాదికి సుమారు ₹70 కోట్లు ఖర్చవుతోంది. 2025లో కేంద్ర ప్రభుత్వం ఈ పెన్షన్‌ను 25 వేల నుండి 31 వేలకు పెంచింది. ఈ పెంపు తర్వాత ఈ వ్యయం ₹86–₹90 కోట్లకు, కొత్తగా చేరే సభ్యులు, అదనపు సేవా సంవత్సరాలకు పెంచిన పెన్షన్ కలిపి మొత్తంగా ₹100 కోట్ల వరకు చేరే అవకాశం ఉంది. కొందరు ప్రజాప్రతినిధులకు బహుళ పెన్షన్లు పొందే అవకాశం భారతదేశంలోనే కనిపిస్తోంది. ఇది దశాబ్దాల పాటు సేవ చేసి పదవీ విరమణ పొందే సాధారణ ఉద్యోగుల పెన్షన్ వ్యవస్థతో పోలిస్తే అసమానతలకు దారితీస్తోందనే విమర్శలు ఉన్నాయి.
లేవనెత్తిన ప్రశ్నలను విస్మరించకండి!
అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ప్రతి రూపాయి విలువైనదే. విద్య, వైద్యం, తాగునీరు, మౌలిక సదుపాయాలు, ఉపాధి వంటి రంగాలు ఇంకా భారీ పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రజాధ నం వినియోగంపై ప్రజలు ప్రశ్నించడం సహజం. ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం ప్రజాప్రతినిధులకు కూడా ఉండా లి. శ్రీలంక ప్రభుత్వ నిర్ణయాన్ని భారతదేశం అనుసరించాల్సిన అవసరం లేదు. కానీ ఆ నిర్ణయం లేవనెత్తిన ప్రశ్నలను మాత్రం విస్మరించకండి. ఆ పెన్షన్లు రద్దు కంటే వాటి అవసరం, పరిమితి, హేతుబద్ధతపై ఒక నిజాయితీతో కూడిన జాతీయ చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజల విశ్వాసమే అతిపెద్ద మూలధనం. ఆ విశ్వాసాన్ని బలపరిచే సంస్కరణలు ఎప్పుడూ స్వాగతించదగినవే. దశాబ్దాల పాటు ఉద్యోగాలు చేసి పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, అలాగే వయోధిక జర్నలిస్టులకు లభించిన పెన్షన్లు, ఇతర ప్రయోజనాలు ప్రజాప్రతినిధులకు మాత్రమే నిరాటంకంగా వర్తింపజేయడమే ఇక్కడ ప్రశ్నించదగిన ముఖ్యాంశం.
-చెన్ను పెద్దిరాజు
76599 99996






