ఉన్మాద వేషగాళ్లు

by Disha edit |
ఉన్మాద వేషగాళ్లు
X

సినిమా కథా నాయకులారా, మీరేమి ఆకాశం నుండి దిగి రాలేదు. పంచభూతాలతో ఒకదాని నుండి స్వయంభూవులుగా ఉద్భవించిన వారు కాదు మీరు! అందరిలాగే తల్లి గర్భం నుండి పుట్టినవారే. అసలు మీరు ఎవరికంటే గొప్పవారమని ఆత్మపరిశీలన చేసుకున్నారా ఎప్పుడైనా ఒక్కసారైనా? రైతు కంటే గొప్పవారా మీరు? రైతుకూలీ కంటే గొప్పవారా? ఎవరికంటే గొప్పవారు? వినోదాన్నిచ్చే నాటక రంగం, సినిమా రంగం రెండూ కూడా నిస్సందేహంగా సమాజంలో ఒక భాగమే! అయితే వినోదం పంచే నటన మీ వృత్తి కాబట్టి మీకు అభిమానులు ఉండటం సహజం. వేషాలు వేసే మీకు గాక రైతులకూ రైతు కూలీలకూ అభిమానులుంటారా? కథకు తగ్గ వేషాలు వేసి కథానాయకులుగా మెప్పించి నంత మాత్రాన రాజ్యపాలన చేసే నాయకులుగా, పాలకులుగా ఎన్నుకోవాలా! మిమ్మల్ని పాలకులుగా ఎన్నుకోకపోతే ప్రజలెన్నుకున్న నాయకులనూ, అలా ఎన్నుకున్నందుకు ప్రజలనూ మీ నోటికొచ్చినట్టు ఎలా పడితే అలా మాట్లాడతారా? సమాజం గురించీ ఇష్టారాజ్యంగా మాట్లాడే అధికారం మీకెక్కడుంది? ఎవరు ఇచ్చారు?

రైతు అలిగితే ప్రపంచమే అతలాకుతలమౌతుంది! మరి మీరు అలిగితే ఎవరికేమవుతుంది? ఎవరికీ ఏమీ కాదు! మీరే రోడ్డున పడతారు అదీ మీ స్థానం!. మొన్న మీ వాడొకడు నా సినిమా ఆడకపోతే దేశం విడిచిపోతా అన్నాడు! ప్రజలు తిరస్కరించారు కర్రు కాల్చి వాత పెట్టారు! సినిమా ఘోరంగా పోయింది! ఇపుడు మీ వాడి పరిస్థితి ఏమిటి? ఇక్కడే ఉన్నాడుగా. మీరు ఇష్టమొచ్చినట్లు హెచ్చులు పోతే ప్రజలు హర్షించరు, సహించరు అదును చూసి రచ్చ వేస్తారు!! ఒకరు, నా పుట్టుక వేరు.. వాడెంత వీడెంత అంటాడు పిచ్చోడిలాగా. ఇంకొకడు స్టేజీ ఎక్కితే చాలు చిందులు! అరుపులు! గావుకేకలు వేసి రంపు రంపు చేస్తాడు. తన జోలికి రాని వారిని సైతం తాటతీస్తా, బట్టలూడదీస్తా అంటూ రంకె లేస్తాడు! సరే అంత సామర్థ్యం ఉందా అంటే, ఊహూ దమ్మిడీ సామర్థ్యం లేదు. రాజకీయాలలో 14 సంవత్సరాలుగా ఉన్నాడు. ప్రజలకు అది చేస్తా ఇది చేస్తా అంటాడు. కానీ ప్రభుత్వాన్ని నడపించడమంటే పాటకు డ్యాన్స్ వేసినంత సులభం అనుకుంటున్నాడా అనే అనుమానమొస్తుంది.

చిత్ర పరిశ్రమను దాటి బయటకొస్తే బాహ్య ప్రపంచంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించీ, ప్రజల అవసరాల గురించీ, వాటి పరిష్కారాల గురించీ ఏ మాత్రం అవగాహన లేని మిమ్మల్ని చూసి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా మీకు? బందెల దొడ్డి నుంచి తప్పించుకున్న పశువులు పంటచేలపై పడ్డట్టు చిత్ర పరిశ్రమ నుంచి తప్పిపోయిన వారు రెండు రాష్ట్రాల ప్రజల మీద పడ్డారు అనుకుంటున్నారు. మదపిచ్చితో మనుష్యరూప పశువుల్లా మీరెంత రెచ్చిపోతున్నా ప్రజలు మిమ్మల్ని పట్టించుకోవడం లేదెందుకంటే భారతీయులకు సహనమెక్కువ కాబట్టి! అందునా తెలుగు ప్రజలకు సహనం మరీ ఎక్కువ కాబట్టి పోనీ లెమ్మని వదిలేస్తున్నారు మిమ్మల్ని. ప్రజల సహనానికి పదే పదే పరీక్ష పెట్టకండి! వికటిస్తుంది! అపుడు తట్టుకోలేరు. ఇకనైనా కాస్త సభ్యత అలవరచుకోండి.

ఎస్. రామచంద్ర

వ్యవస్థాపక అధ్యక్షుడు

శ్రీకృష్ణదేవరాయ ధర్మ రక్షణ సమితి

9694992999

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Also Read...

Budget: కాగిత రహిత బడ్జెట్లో...కాంతల కామితాలు తీరుతాయా?



Next Story

Most Viewed