- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కండక్టర్ ఉద్యోగాలకు.. ప్రతిభే ప్రమాణం కావాలి!
తెలంగాణ ఆర్టీసీలో ప్రతిపాదిత కండక్టర్ నియామకాల్లో కేవలం పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక చేయడం కంటే రాత పరీక్ష నిర్వహించి మెరిట్, రిజర్వేషన్ విధానం ప్రకారం పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేయాలన్న విజ్ఞప్తి..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఆర్టీసీలో సుమారు 1,500 కండక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో, నియామక విధానంపై ప్రభుత్వం పునరాలోచించాలని రాష్ట్రంలోని నిరుద్యోగ యువత విజ్ఞప్తి చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతిభ, సామ ర్థ్యం, పోటీ తత్వానికి ప్రాధాన్యం ఉండాలి. అందుకే అర్హత కలిగిన ప్రతి అభ్యర్థికి అవకాశం కల్పించే విధంగా రాత పరీక్ష నిర్వహించి, మెరిట్ ఆధారంగా పారదర్శకంగా ఎంపికలు చేపట్టాలి. పదో తరగతి మార్కులు మాత్రమే ఒక వ్యక్తి ప్రతిభను నిర్ణయించవు. అప్పట్లో తక్కువ మార్కులు సాధించిన ఎంతోమంది విద్యార్థులు తరువాత ఉన్నత విద్యలో రాణించి, గ్రూప్-1, గ్రూప్-2, సివిల్స్ వంటి అత్యున్నత పోటీ పరీక్షల్లో విజయం సాధించి ప్రభుత్వ సేవల్లో ఉన్నారు.
శాశ్వత ప్రతిభకు ఏది కొలమానం?
జీవితంలో ఒక దశలో వచ్చిన మార్కులను శాశ్వత ప్రతిభకు కొలమానంగా చూడడం న్యాయం కాదు.. గత రెండు దశాబ్దాలుగా ప్రైవేట్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు అధిక మార్కులు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులు అదే స్థాయిలో మార్కులు సాధించడం అనేక కారణాల వల్ల కష్టసాధ్యమైంది. దీనికి కారణం వారి ప్రతిభ లోపం కాదు.. వారికి అందుబాటులో ఉన్న విద్యా వనరులు, సౌకర్యాలు, అవ కాశాల్లో ఉన్న అసమానత. ప్రభుత్వం ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని చెబుతూ, మరోవైపు కేవలం పదో తరగతి మార్కులనే ప్రమాణంగా తీసుకుంటే, పరోక్షంగా ప్రైవేట్ విద్యా వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చినట్లవుతుంది. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వేలాది మంది పేద, గ్రామీణ నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉంది.
సామాజిక న్యాయం.. పారదర్శకత కోసం..
అందువల్ల తెలంగాణ ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగాల భర్తీలో అందరికీ సమాన అవకాశాలు కల్పించే విధంగా రాత పరీక్ష నిర్వహించి, పరీక్షలో వచ్చిన మెరిట్, ప్రభుత్వ రిజర్వేషన్ విధానాన్ని అనుసరించి నియామకాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రత్యేకంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల పరిస్థితులు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బలహీన వర్గాల పిల్లల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ అంశంపై సానుకూలంగా స్పందించాలని మనవి. పదో తరగతి మార్కులు అధికంగా వచ్చిన వారు ప్రతిభావంతులు కారని కాదు. అయితే, కేవలం ఆ మార్కులనే ఏకైక ప్రమాణంగా తీసుకోవడం వల్ల నిజమైన ప్రతిభకు అవకాశం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. పోటీ పరీక్ష నిర్వహిస్తే ప్రతి అర్హుడికి తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం లభిస్తుంది. అదే సామాజిక న్యాయం, అదే పారదర్శకత, అదే రాజ్యాంగ స్ఫూర్తి.
రాత పరీక్ష, మెరిట్ నియామకాలు ఆవశ్యం!
కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగాల భర్తీలో విధానంలో కేవలం పదో తరగతి మార్కులను మాత్రమే ప్రామాణికంగా తీసుకునే విధానాన్ని పునఃపరిశీలించి, రాత పరీక్ష ద్వారా మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టి బలహీన వర్గాల నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని విజ్ఞప్తి. నియామక బోర్డ్‌కు కూడా గతంలో మార్కులు, ప్రస్తుతం గ్రేడింగ్ విధానం ఉన్న తరుణం లో కొంత ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఎదురవుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార దర్శకంగా అర్హతను ప్రకటించి విధివిధానాలను విడుదల చేసి ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేస్తే అందరికీ న్యాయం చేస్తూ, పారదర్శకంగా భర్తీ జరిగిందనే విశ్వాసం, నమ్మకం నిరుద్యోగులకు కలుగుతుంది.
-గుండమల్ల సతీష్ కుమార్
94931 55522






