షర్మిల పార్టీ విలీనం.. లాభం ఎవరికి? నష్టం ఎవరికి?

by Disha edit |
షర్మిల పార్టీ విలీనం.. లాభం ఎవరికి? నష్టం ఎవరికి?
X

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే అధికార పార్టీ నూట పదిహేను స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో ప్రతిపక్షాలు కూడా అదే వేటలో నిమగ్నమయ్యాయి. పార్టీ ఫిరాయింపుల జోరు ఎక్కువైంది. బీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కోసం యుద్ధం తలదన్నే రీతిలో ముందుకు సాగిపోతుంది. కానీ అనూహ్యంగా అభ్యర్థుల ప్రకటన తర్వాత బీఆర్ఎస్‌లో ఎన్నడూ ఊహించని విధంగా అసంతృప్త జ్వాలలు భగ్గుమంటున్నాయి. కొందరు పార్టీ అధిష్టానాన్ని కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా టికెట్ల కేటాయింపుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

మరోపక్క తెలంగాణ ఇచ్చిన పార్టీగా కనీసం ఈ సారైనా అధికారం చేజిక్కించుకోవాలనే ఆశతో కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.. కర్ణాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్ ఎన్నడూ లేనంత జోరుతో పరుగులు పెడుతోంది. ఒకవైపు ఇతర పార్టీల నుంచి వలసల జోరు, మరో వైపు కేసీఆర్ ప్రభుత్వంపై గల వ్యతిరేకతను ఆసరాగా చేసుకొని ఎలాగైనా సరే అధికారాన్ని చేజిక్కించుకోవాలని గట్టి పట్టుదలతో కేంద్ర నాయకత్వం ఉంది.

సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే..

కాంగ్రెస్ రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా చతికిలపడి. రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాతనే కోలుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి షర్మిల ఎంట్రీ లాభం చేకూర్చకపోతుందా? లేదా మరింత నష్టాన్ని ఇవ్వబోతుందా? అన్న విషయంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. షర్మిల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒరిగేదేంటని కొందరు కాంగ్రెస్ వాదులే వ్యతిరేకించగా. మరి కొందరు వైఎస్ఆర్ కూతురిగా కాంగ్రెస్ పార్టీకి అదనపు బలమని సపోర్ట్ చేస్తున్నారు.

2018లో కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు పేరు చెప్పి సెంటిమెంట్ రగిల్చారు. అప్పుడు తెలంగాణ వ్య‌తిరేకి చంద్ర‌బాబుతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌.. అధికారంలోకి వ‌స్తే తిరిగి తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, మళ్లీ ఆంధ్రోళ్ల పాలన అవసరమా అంటూ ఊరురా వాడవాడలా మొత్తుకున్నారు. ఫలితం తెలిసిందే కదా. అయితే అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. గతంలో బీఆర్ఎస్ తెలంగాణలో కేవలం ప్రాంతీయ పార్టీ గానే పోటీ చేయగా, నేడు భారత రాష్ట్ర సమితిగా మారి, జాతీయ స్థాయి పార్టీగా దేశవ్యాప్తంగా పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతోంది. కడసారి లాగా సెంటిమెంటు రెచ్చగొట్టే ఆస్కారం అంతగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలలో ఏపీ నుంచి వచ్చిన సెటిలర్లే ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రా వాళ్లంటూ సెంటిమెంట్ రెచ్చగొడితే అది బిఆర్ఎస్‌కే ఎదురు తిరిగి, కనీసం 30 సీట్లలో గెలుపు ఓటమిలను ప్రభావితం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. పరిస్థితులు విషమించి బిఆర్ఎస్‌కు ఎదురుగాలి ఉన్నట్లయితే, మళ్లీ పాత సెంటిమెంట్ అందుకోవడానికి బీఆర్ఎస్ ఏ మాత్రం వెనుకాడదు.. కానీ ప్రజలు అన్ని విషయాలను కూడా జాగ్రత్తగా అనుక్షణం గమనిస్తున్నారు. ప్రతిసారి మోసపోవడానికి ప్రజలెప్పుడు అమాయకులేమి కారు కదా, తెలంగాణ పదాన్ని బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసివేసిన వైనం ప్రజల మదిలో నుంచి ఇంకా చెరిగిపోలేదు.

ఏపీలో ప్రభావమెంత?

వైఎస్ షర్మిల వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు భుజానికెత్తుకుంటే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం వచ్చే అవకాశం కొంతవరకైనా ఉంటుంది. రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా పాతాళానికి పడిపోయి, అపన్న హస్తంకోసం ఎదిరి చూస్తున్న కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆ పార్టీకి ఎంతో కొంత లాభం చేకూరుతుంది. అలాగే వైఎస్‌ఆర్‌కు నిజమైన రాజకీయ వారసురాలిగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్న షర్మిలకు ఆంధ్రప్రదేశ్‌లో ఆదరాభిమానాలు దక్కే అవకాశం ఉంది. జగన్ జైలుకు వెళ్లిన సమయంలో వైసీపీ గెలుపు కోసం మరో ప్రజా ప్రస్థానం పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో కాలికి బలపం కట్టుకుని తిరిగారు షర్మిల. ఆ సందర్భంలో షర్మిలను ప్రజలు బాగానే ఆదరించారు. అయితే ఏపీ కాంగ్రెస్‌కు షర్మిల సారథ్యం వహిస్తే ప్రభుత్వ వ్యతిరేకత ఓటుతో పాటు, దళితులు. మైనారిటీ క్రైస్తవుల నుంచీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బతినే అవకాశాలు మెండుగా ఉన్నాయని విమర్శకులు సైతం అంటున్నారు. వైఎస్ఆర్‌ను అభిమానించే ఏపీ కాంగ్రెస్ మెజారిటీ నాయకులు ప్రస్తుతం వైఎస్ జగన్‌తో ఉన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తమకు అనుకున్నంత స్థాయిలో సపోర్టు చేయడం లేదనీ. కనీసం తమకు అపాయింట్‌మెంట్ కూడ ఇవ్వడం లేదని వీరు లోలోపల కుములుతున్నరనీ రాష్ట్రమంతా వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో వాళ్లంతా షర్మిల పార్టీలోకి జంప్ చేసే అవకాశముంది.. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని జగన్ సర్వనాశనం చేశారని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరితే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీలు షేర్ చేసుకునే అవకాశం కొంతవరకైనా ఉంటుంది. జగన్ ఓటమితో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలు అధికం కావచ్చు.

విలీనం సరే .... పోటీ మాత్రం..

వైఎస్ షర్మిల పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయితే నష్టమేమీ లేదు పైగా వైయస్సార్ కూతురిగా రెండు రాష్ట్రాలలో ఆమెకు మంచి ఆదరణ ఉన్నది. రెండు రాష్ట్రాలలో పార్టీకి కచ్చితంగా అదనపు బలమే. ప్రతి నియోజకవర్గంలో రెండు నుంచి మూడు వేలకు తక్కువ కాకుండా వైఎస్ఆర్ అభిమానులు ప్రభావాన్ని చూపే స్థాయిలో ఉన్నారు. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం, దళితులు, క్రిస్టియన్ మైనారిటీ వర్గాల నుంచి మద్దతు కూడగట్టే శక్తియుక్తులు షర్మిలకు ఉన్నాయి. అయితే షర్మిల తెలంగాణ శాసనసభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయకుండా కేవలం గెలుపు కోసం ప్రచారం చేస్తే కచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుతుంది . అలా కాకుండా ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే సెంటిమెంట్ వాదం కొంతవరకు పనిచేసి మళ్లీ ఆంధ్ర వాళ్ళ పెత్తనం గురించి ఇటూ పార్టీలో, అటూ ప్రజలలో లేనిపోని అనుమానాలు, వాదనలు బయలుదేరుతాయి. దీన్ని అందివచ్చిన అవకాశంగా కేసీఆర్ మాయామశ్చింద్ర విద్యలతో జోరు మీదున్న కాంగ్రెస్ పార్టీకి బ్రేకులు వేసే ప్రయత్నం చేయడంలో దిట్ట, అందుకే తెలంగాణ కోడలుగా, ఆంధ్ర ఆడబిడ్డగా, వైఎస్సార్ కూతురిగా తెలంగాణాలో ప్రచారానికి మాత్రమే పరిమితమై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పోటీ చేసినట్లయితే ఇటు పార్టీకి, అటు షర్మిలకు మంచి భవిష్యత్తు ఉండే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. కాదని మొండిగా తెలంగాణలో పోటీ చేసినట్లయితే, కాంగ్రెస్‌కి లాభం కంటే నష్టాలే ఎక్కువన్నది తెలంగాణ మెజారిటీ ప్రజల అభిప్రాయం..

డా. బి. కేశవులు నేత. ఎండీ.

చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం.

85010 61659

Next Story