న్యాయ దీపాన్ని వెలిగించిన తీర్పు

by Disha edit |
న్యాయ దీపాన్ని వెలిగించిన తీర్పు
X

భారత సుప్రీంకోర్టు బిల్కిస్ బానో కేసుపై సోమవారం అసాధారణమైన తీర్పునిచ్చింది. ఆ కేసులో శిక్షను అనుభవిస్తున్న 11 మంది విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. రెండు వారాల్లోగా ముద్దాయిలందరూ వారు విడుదల అయిన జైలు అధికారుల ముందు లొంగిపోవాల్సిందిగా ఆదేశాలిచ్చింది. ఈ తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు దేశ ప్రజలు

జస్టిస్ నాగరత్నమ్మ, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్, బిల్కిస్ బానోపై అత్యాచారం సల్పిన ముద్దాయిలకు శిక్షాకాలంలో రెమిషన్ (శిక్షాకాలం తగ్గింపు) ఇవ్వవచ్చుననే నిర్ణయంతో సిఫార్సు చేసిన గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ చర్యను తీవ్రంగా తప్పు పట్టింది. ఆ సిఫార్సుని ఆధారం చేసుకుని ఒక సుప్రీంకోర్టు బెంచ్, యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న వారిని 2022 ఆగస్టు 15న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలాంటి రెమిషన్ యధాలాప (Stereo type) నిర్ణయమని, అలాంటి నిర్ణయం గైకొనే అర్హత గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కూడా సుప్రీంకోర్టు సోమవారం నాటి తన తీర్పులో స్పష్టం చేసింది.

గోధ్రా అల్లర్ల సమయంలో..

2002లో గోధ్రా రైలులో సంభవించిన మారణకాండ సాకుతో, గుజరాత్ రాష్ట్రంలో, నిస్సహాయులైన ముస్లిం ప్రజానీకంపై ఘోరమైన హత్యాకాండకు పాల్పడ్డారు, మహిళలపై అత్యాచారాలు రోజుల తరబడి జరిగాయి. అలాంటి దాడుల నుండి తప్పించుకోవటానికి 2002 మార్చి 3న అహ్మదాబాద్‌కు దగ్గరలోని రంధిక్ పూర్ అనే గ్రామం విడిచి పోతున్న వారిలో ఐదు నెలల గర్భవతిగా ఉన్న బిల్కిస్ బానో అనే 21 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిపి ఆమె మూడేళ్ల పసి బాలికతో సహా 7గురు కుటుంబ సభ్యులను హత్య గావించారు.

ఆ సంవత్సరం నుండి ఆ కేసు పలు మలుపులు తీసుకుంది. సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిపారు. గుజరాత్ రాష్ట్రంలో విచారణ జరపడానికి వీలులేదని మహారాష్ట్రలో దానిని సాగించగా, బొంబాయి ట్రయల్ కోర్టు 11 మంది ముద్దాయిలకు 2008లో యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. 2017లో బొంబాయి హైకోర్టు వారి శిక్షను ఖరారు చేసింది. 2019లో సుప్రీంకోర్టు బిల్కిస్ బానోకు 50 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో ముద్దాయిలకు మరణశిక్ష విధించదగినప్పటికీ దానిని యావజ్జీవ కారాగార శిక్షగా మార్పు చేశారు.

సవరణలు అడ్డం పెట్టుకుని..

కొన్ని కోర్టు సవరణలను అడ్డం పెట్టుకుని 14 ఏళ్ల శిక్షాకాలం తరువాత వారికి రెమిషన్ అవకాశాన్ని గుజరాత్ ప్రభుత్వం ఇచ్చింది. వాస్తవానికి కేసు విచారణ జరిగిన, శిక్ష విధించిన మహారాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే రెమిషన్ గురించిన సిఫార్సు చేసే అవకాశం ఉన్నది. కానీ, ఆ హక్కును అడ్డం పెట్టుకొని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం రెమిషన్ సిఫారసు చేసింది. ఆ విధంగా భయంకర నేరానికి పాల్పడిన 11 మంది ముద్దాయిలకు 2022 ఆగస్టు 15న విడుదల అయ్యే అవకాశం లభించింది. గుజరాత్ రాష్ట్ర బీజేపీ నాయకులు దండలతో, అభినందనలతో వారికి స్వాగత సత్కారాలు నిర్వహించారు. విజయోత్సవాలు జరిపారు. దేశం దేశమంతా సిగ్గుపడేట్లు చేసిన ఈ సంఘటనను ప్రశ్నిస్తూ బిల్కిస్ బానో తిరిగి సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వ సిగ్గుమాలిన చర్య

తనకు లేని అధికారాలను ఉపయోగించుకుని బిల్కిస్ బానో కేసులో ముద్దాయిలకు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం రెమిషన్ వచ్చేట్లు చేయటాన్ని సుప్రీంకోర్టు, తప్పు పట్టింది. అధికారాన్ని గుజరాత్ ప్రభుత్వం తీవ్రంగా దుర్వినియోగం చేసిందని ఆక్షేపించింది. ఈ కారణంగా, తక్షణమే గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గం రాజీనామా చేయాలి. 2019లో బాబ్రీ మసీద్ కూల్చివేత విషయంలో ఎవరూ నేరస్తులు కారు, లేరు అంటూ తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు... కొద్ది రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రతిపత్తికి కీలకమైన ఆర్టికల్ 370ని భారత పార్లమెంటు రద్దు చేయటాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు... పక్షపాతంగా వ్యవహరించిందని చాలామంది అభిప్రాయపడ్డారు. అలాంటిది గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ గతేడాది తీసుకున్న అసంబద్ధ చర్యను పూర్తిగా ఖండిస్తూ తీర్పునివ్వడం హర్షించదగ్గ విషయం.

- సి. ఉమా మహేశ్వరరావు,

'అంకురం' చిత్ర దర్శకుడు,

కో కన్వీనర్, సంగమం విజయవాడ,

90007 45555

Next Story