మరోకోణం:టి-కాంగ్రెస్.. ఈ జాకీ లేపుతుందా!?

by D.Markandeya |
మరోకోణం:టి-కాంగ్రెస్.. ఈ జాకీ లేపుతుందా!?
X

తెలంగాణలో రాహుల్ పర్యటన సక్సెస్ కావడం కాంగ్రెస్ శ్రేణులలో ఫుల్ జోష్ నింపింది. శుక్రవారం వరంగల్‌లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభకు భారీగా జనం హాజరు కావడం, రాహుల్, రేవంత్‌ ప్రసంగాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం పట్ల ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సోనియా ఇచ్చిన తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నదెవరు? దోచుకుంటున్నదెవరు? ఇక్కడి ప్రజల కలలను కల్లలు చేసిందెవరు? అంటూ రాహుల్ అడిగిన ప్రశ్నలకు జనం చాలా ఉత్సాహంగా, 'కేసీఆర్.. కేసీఆర్' అంటూ బిగ్గరగా సమాధానం చెప్పడంపై ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చే నడుస్తోంది. రాహుల్‌ను ఫ్యూచర్ పీఎం అనీ, రేవంత్‌ను ఫ్యూచర్ సీఎం అనీ సంబోధించడం కూడా శ్రేణులను ఉత్సాహపరుస్తున్నది.

పీకే ఎపిసోడ్ నేపథ్యంలో కాంగ్రెస్‌కు, టీఆర్ఎస్‌కు మధ్య పొత్తు కలిసే అవకాశం ఉందన్న ఇటీవలి వార్తలను రాహుల్ తీవ్రంగా ఖండించడం ఆ పార్టీ కార్యకర్తలకు స్పష్టతనిచ్చింది. టీఆర్ఎస్‌తో, కేసీఆర్‌తో కలుద్దామనే, సంబంధాలు పెట్టుకునే నేతలపై వెంటనే బహిష్కరణ వేటు వేస్తామని ఆయన హెచ్చరించడం పార్టీలో ఉన్న కోవర్ట్ నాయకులకు వణుకు పుట్టిస్తుందని వారంటున్నారు. టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని, ఆ రెండు పార్టీలు కలిసి డ్రామా ఆడుతున్నాయని విమర్శించడం తమకు భవిష్యత్ బాట చూపిందని చెబుతున్నారు. ఇక వరంగల్ డిక్లరేషన్ ద్వారా జనాభాలో మెజారిటీగా ఉన్న రైతాంగాన్ని ఆకర్షించడానికి చేసిన ప్రయత్నం, యువత కలలను నెరవేరుస్తామన్న మాటలు, ఆదివాసీలకు ఇచ్చిన హామీలు వచ్చే ఎన్నికలలో పార్టీకి మంచి ఫలితాలనివ్వగలవని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

భ్రమపడితే అంతే సంగతి

అయితే, 'ఇల్లలకగానే పండుగ కాదు' అన్నట్లుగా రాహుల్ సభ తెచ్చిన జోష్‌తో వచ్చే ఎన్నికలలో అధికారం తమదేనని ఆ పార్టీ నేతలు భ్రమపడితే అది మరో చారిత్రక తప్పిదమే అవుతుంది. 2018 ఎన్నికలకు ముందు కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. ప్రజలలో కేసీఆర్ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉండడం గమనించి ఇక విజయం తమదేనని చంకలు గుద్దుకున్నారు. ఆ అతివిశ్వాసంతో తప్పుడు వ్యూహాలను అనుసరించారు. టీడీపీతో జతకట్టి ఇక్కడి సభలకు చంద్రబాబును రప్పించారు. అధికారం దక్కితే తెలంగాణ మరోసారి బాబు జేబులోకి వెళ్తుందన్న పరోక్ష సంకేతాలకు కారణమయ్యారు. కేసీఆర్‌కు అద్భుత అస్త్రాలను అందించారు. గ్రూపుల మధ్య తగాదాలతో అర్హులకు టిక్కెట్లు అందకుండా అడ్డుకున్నారు. ప్రచారంలో అనైక్యత చూపారు. చివరకు, ఎన్నికల రణరంగంలో బొక్కబోర్లా పడ్డారు.

ఆగని కుమ్ములాటలు

ఇప్పుడు కూడా అదే అతివిశ్వాసంతో, గతం నుంచి నేర్చుకోకపోతే మరోసారి గుణపాఠం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికీ టి-కాంగ్రెస్ రాజకీయంగా, సంస్థాగతంగా చాలా బలహీనంగా ఉంది. సీనియర్ల మధ్య అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ద్వారా రేవంత్‌రెడ్డి పగ్గాలు తీసుకున్నప్పటి నుంచి కూడా ఏ ఒక్క రోజూ అగ్రనేతలలో ఐక్యత కానరాలేదు. స్వయానా ఉత్తమ్, జానారెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ వంటి నేతలు మౌనం దాల్చగా, కోమటిరెడ్డి బ్రదర్స్, వీహెచ్, జగ్గారెడ్డి, మధుయాష్కీ తదితరులు పీసీసీ అధ్యక్షుడిపై నేరుగానే విమర్శల దాడి చేస్తున్నారు. పార్టీలో ప్రజాస్వామ్యం లేదని నెత్తీ నోరూ బాదుకుంటున్నారు.

రేవంత్ సారథ్యంలో నిర్వహించే సభలు, ఆందోళనలకు జనం భారీగానే వచ్చినా సీనియర్ నేతల మద్దతు మాత్రం లభించడం లేదు. ఫలితంగా భారీ అంచనాలతో నిర్వహించే కార్యక్రమాలు చివరకు రాష్ట్ర నేతల హాజరు లేక, స్థానిక నేతల సహకారం దొరక్క చప్పగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమాలకు సంబంధించి 'ఏ టు జడ్' అన్నీ తానే చూసుకోవాల్సివస్తోందని, ఇది తనకు తలకు మించిన భారమవుతోందని, తోటి నేతల నుంచి ఆర్థిక, రాజకీయ, నైతిక మద్దతు శూన్యమని సన్నిహితుల వద్ద ఇటీవల రేవంత్ వాపోయినట్లుగా గాంధీభవన్ వర్గాల సమాచారం.

ఇప్పటికీ ప్రణాళికలు లేవు

ప్రభుత్వ వ్యతిరేకత పునాదిగా ప్రజల నుంచి ఓట్లు రాబట్టే పకడ్బందీ వ్యూహాన్ని, మంచి ఆకర్షణీయమైన ఎన్నికల ప్రణాళికను కూడా టీపీసీసీ ఇప్పటికీ రూపొందించుకోలేకపోయింది. ఎన్నికల సంసిద్ధత విషయంలో వెనకబడిపోయింది. అధికార టీఆర్ఎస్, పోటీపక్షం బీజేపీ ఈ విషయంలో చాలా ముందున్నాయి. నాలుగు నెలల క్రితమే సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించారు. కేంద్రంపై, బీజేపీ పాలనపై వాడి వేడి అస్త్రాలను సంధిస్తున్నారు. ముందస్తుకు వెళతారా? అన్న అనుమానం వచ్చే రీతిలో శ్రేణులను ఎన్నికలకు సంసిద్ధం చేస్తున్నారు. రాజధానిలో, జిల్లాలలో జోరుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, సభలు జరుగుతున్నాయి. మంత్రి కేటీఆర్ ఎడతెగకుండా జిల్లాలు పర్యటిస్తున్నారు. వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అన్ని శాసనసభ నియోజకవర్గాలలో పరిస్థితులను అంచనా వేస్తూ గెలుపు గుర్రాలను కనిపెట్టే కార్యక్రమం కొనసాగుతోంది. ఇక ఏ వరాలు ఇస్తే, ఏ హామీలు గుప్పిస్తే ఓటర్లు ప్రసన్నులవుతారో బాగా తెలిసిన కేసీఆర్ వచ్చే ఎన్నికల కోసం ప్రపంచమే అబ్బురపడే పథకాన్ని ప్రకటిస్తారని ఆ పార్టీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి.

పావులు కదుపుతున్న కమలం

బీజేపీ కూడా ఎన్నికలే ఎజెండాగా పురోగమిస్తోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా మోడీ-అమిత్‌షా పావులు కదుపుతున్నారు. గ్రామాలు, పట్టణాలలో ఆ పార్టీ కార్యకర్తలు, సంఘ్ పరివార్ శ్రేణులు మోడీ పాలన గొప్పతనాన్ని ప్రచారం చేస్తున్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం, యూపీలో యోగి విజయం, హిందువుల ఐక్యత గురించి వివరిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే మొదటి దఫా పూర్తి చేసి రెండవ దఫా పాదయాత్ర చేపట్టారు. ఆయన యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నట్లు సమాచారం. అలాగే, టీఆర్ఎస్, కాంగ్రెస్‌ నుంచి అనేక మంది నేతలను ఇప్పటికే బీజేపీలో చేర్చుకున్నారు. ఇంకా చేర్చుకునే సన్నాహాలలో ఉన్నారు. అన్ని సెగ్మెంట్లలోనూ బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నారు. జనాకర్షక నేతలను పార్టీలోకి ఆహ్వానించాలని, వారితో కలిసి పనిచేయాలని మొన్నటి పాలమూరు సభలో స్వయానా ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాయే పిలుపునివ్వడం కమలనాథుల ఎన్నికల వ్యూహం మారిందనడానికి తాజా తార్కాణం.

మరి, వీరేం చేస్తున్నారు?

ఈ దిశలో ఇప్పటివరకు టి-కాంగ్రెస్ చేసింది శూన్యమేనని చెప్పవచ్చు. ఆ పార్టీకి ఇప్పటివరకూ ఒక వ్యూహమంటూ లేనేలేదు. 'ఎవరికి వారే యమునాతీరే' అన్నట్లుగానే పరిస్థితి ఉంది. ప్రజలలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడానికి ఆ పార్టీ చేపట్టే కార్యక్రమాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. రాష్ట్ర పార్టీలాగే ప్రతి జిల్లాలోనూ రెండు మూడు గ్రూపులున్నాయి. వాటి మధ్య కొట్లాటలు పబ్లిక్‌గానే కొనసాగుతున్నాయి. ఇక ఏ ఒక్క నియోజకవర్గంలోనూ వచ్చే ఎన్నికలలో అభ్యర్థి ఫలానా అని చెప్పుకునే సీన్ లేదు. ఒక్కో గ్రూపు ఒక్కో అభ్యర్థి కోసం పట్టుబట్టే, చివరకు టిక్కెట్ ఎవరికి వచ్చినా మిగతా గ్రూపులు సహకరించకుండా ఉండే అవకాశమే చాలా చోట్ల కనిపిస్తోంది.

సందేహాలకు సమాధానం

వరంగల్ సభ కాంగ్రెస్ కార్యకర్తలలో నెలకొన్న పలు సందేహాలకు సమాధానమిచ్చిందనే విషయం వాస్తవం. ముఖ్యంగా వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ సహా ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని, రైతు సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండా అని, సిఫారసుల ఆధారంగా కాకుండా ప్రజలలో ఆదరణ ప్రాతిపదికనే టిక్కెట్ల పంపిణీ జరుగుతుందని, పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినవారిపై వెంటనే బహిష్కరణ వేటు పడుతుందని స్పష్టమైన సందేశం శ్రేణులకు లభించింది. అయితే, టి-కాంగ్రెస్‌లో ప్రస్తుతమున్న అధ్వాన పరిస్థితుల నేపథ్యంలో ఈ స్పష్టతలు ఎంతమాత్రమూ సరిపోవని చెప్పవచ్చు. వీటిని నిక్కచ్చిగా అమలు చేసే చిత్తశుద్ధి, చొరవ, అందరు నేతలనూ ఏకతాటిపై నడిపించే సమయస్ఫూర్తి టీపీసీసీ అధ్యక్షుడికి ఉండాలి. అందుకు అవసరమైన అధికారాలను, మద్దతును, వనరులను హైకమాండ్ ఇవ్వాలి. అసంతృప్త నేతలను డీల్ చేసే విషయంలో కఠిన వైఖరి అవలంబించాలి. వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రావడమే పరమావధిగా పార్టీలోని సీనియర్, జూనియర్, స్థానిక నేతలు, కార్యకర్తలూ పనిచేసేలా ఎప్పటికప్పుడు గైడ్ చేయాలి.

సెట్‌రైట్ అవుతారా?

వేయి జాకీలు పెట్టి లేపినా లేవదన్న పరిస్థితి నుంచి ఒక్క వరంగల్ జాకీతోనే టి-కాంగ్రెస్ పైకి లేస్తుందా? తిట్టుకోవడం, తగాదా పడడం కామనైపోయిన సీనియర్లు రాహుల్ వార్నింగ్‌తో సెట్‌రైట్ అవుతారా? ఎండ్రికాయల సామెత రిపీటవుతుందా? క్రమశిక్షణ ఉల్లంఘించిన నేతలపై నిజంగానే చర్యలుంటాయా? అర్హులైన అభ్యర్థులకే టిక్కెట్లు లభిస్తాయా? పీసీసీ అధ్యక్షుడిగా, ఎన్నికల సారథిగా నాటి వైఎస్ స్థాయి ప్రజాదరణను, పరిపక్వతను రేవంత్ సాధిస్తారా? కాంగ్రెస్‌పై కేసీఆర్ ఏ వైఖరి తీసుకుంటారు? జాతీయ స్థాయి ఉమ్మడి శత్రువు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఇక్కడ కారును కలుపుకోక తప్పదా? కేసీఆర్ అబ్బురపడే పథకాన్ని మించిన ఎలక్షన్ మేనిఫెస్టోకు వరంగల్ డిక్లరేషన్ పునాది అవుతుందా? ఇవన్నీ ఇప్పుడే జవాబు దొరకని ప్రశ్నలు.

కొసమెరుపు

తాజా ఖబర్.. మీడియా అధినేతలు రాధాకృష్ట, రవిప్రకాశ్‌తో హోటల్ తాజ్‌కృష్ణాలో రాహుల్‌గాంధీ సమావేశమయ్యారట. స్వయానా రేవంత్‌రెడ్డి వీరిని ఆయనకు కలిపించారట. ఏం మాట్లాడుకున్నారో ఎవరికీ తెలియదట. ''తెలంగాణ వ్యతిరేక ముఠా మళ్లీ ఒక్కటైందంటూ'' టీఆర్ఎస్ వర్గాల ట్రోల్,

కథ మళ్లీ మొదటికే వచ్చిందంటారా!?

డి. మార్కండేయ

[email protected]


Next Story

Most Viewed