ఎన్టీఆర్ పేరు మార్పు కరెక్టేనా?

by Disha edit |
ఎన్టీఆర్ పేరు మార్పు కరెక్టేనా?
X

విజయవాడలో ఉన్న 'డాక్టర్ ఎన్‌టీ‌ఆర్ హెల్త్ యూనివర్సిటీ' పేరును డా. వైఎస్‌ఆర్ హెల్త్ యూనివర్సిటీ' గా మార్చే బిల్లును ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇటీవల ఆమోదించింది. ఈ నిర్ణయం ముఖ్యమంత్రి జగన్ ఏకపక్షంగా తీసుకున్నట్లు ఉంది. ఎన్‌టీ‌ఆర్, వైఎస్‌ఆర్ ఇద్దరూ మహానాయకులే. కానీ, ఎన్‌టీ‌ఆర్‌కు ఉన్న చరిష్మా వైఎస్‌ఆర్‌కు లేదు. 'నాకు ఎన్‌టీఆర్ అంటే ఎంతో గౌరవం. అందుకే ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టామని' సీఎం సమర్థించుకుంటున్నారే తప్ప ఎందుకు పేరు మార్చాల్సి వచ్చిందో చెప్పడం లేదు.దీనిపై రాష్ట్రంలో పెద్ద దుమారమే చెలరేగింది.

ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల సొంత పార్టీ నేతలే అయిష్టంగా ఉన్నారు. ఇప్పటికే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బాహాటంగా 'యార్లగడ్డ' తన పదవులకు రాజీనామా చేశారు. ఎన్‌టీ‌ఆర్ సతీమణి వైఎస్ఆర్సీపీ నేత లక్ష్మీపార్వతి స్పందించిన తీరు విడ్డూరంగా ఉంది. పేరు మార్చడంపై జగన్ నిర్ణయాన్ని ఆమె సమర్థించారు. జిల్లాకు ఎన్‌టీ‌ఆర్ పేరు పెట్టి యూనివర్సిటీ పేరు మార్చడంతో జగన్ ఒక తేనె తుట్టను కదిపినట్టు అయ్యింది.

హుందాతనం కాపాడుకోండి

నిజానికి ఎన్‌టీ‌ఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడవలేదు. అప్పుడున్న రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా అనేక మంది సలహాపై పార్టీ సంరక్షణకు నిర్ణయం తీసుకున్నారు తప్పితే అది వెన్నుపోటు కాదు. కానీ, ఇప్పుడు పాలక పక్షం వారు 'ఎన్‌టీ‌ఆర్ అంటే ఇష్టం' అంటూనే పేరు మార్చి వెన్నుపోటు పొడిచారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వైఎస్‌ఆర్ పేరును ఎక్కడా తొలగించలేదు. జగన్ అనవసరంగా ఇద్దరు మహా నాయకుల పేర్లను బజారుకు ఈడ్చారు. పేరు మార్పు నిర్ణయం ఆషామాషీ వ్యవహారం కాదు. విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలు, ఫొటోల వంటివి సవరించవలసి వస్తుంది. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడతారు.

పేరు వ్యక్తి గొప్పదనాన్ని సూచిస్తుంది. మీకు అంతగా మీ నాన్నగారి పేరు పెట్టాలని ఉంటే, ఎన్‌టీ‌ఆర్ పక్కన వైఎస్‌ఆర్ అని పెట్టాల్సింది. అది మీకు ఎంతో హుందాతనంగా ఉండేది. మీ నాన్నగారికి తలచుకున్నట్లుగానూ ఉండేది. ఏదేమైనా ఎన్‌టీ‌ఆర్ పేరు తొలగించడం అనైతికం. ప్రభుత్వం తన తప్పును దిద్దుకుంటే ప్రజలు హర్షిస్తారు. ఎన్‌టీ‌ఆర్ తెలుగువారి గుండెలలో ఎప్పటికీ ఉండిపోయే నాయకుడు. పేరు మార్చడం తెలుగువారి ఆత్మగౌరవానికే మాయని మచ్చ. పునరాలోచించుకుంటే మంచిది.


కనుమ ఎల్లారెడ్డి

93915 23027



Next Story